క్విక్‌ కామర్స్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ- డుంజోలో 25.8% వాటా సొంతం

author img

By

Published : Jan 7, 2022, 11:17 AM IST

Reliance Retail Dunzo
Reliance Retail Dunzo ()

Reliance Retail: రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోళ్లు పరంపర కొనసాగుతోంది. తాజాగా దేశీయ దిగ్గజ క్విక్‌కామర్స్‌ సంస్థ డుంజోలో 25.8 శాతం వాటాను రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకుని, నిత్యావసర వస్తువులను వేగంగా డెలివరీ చేసే డుంజో వ్యాపారంలో పెట్టుబడుల ద్వారా క్విక్‌ కామర్స్‌ విభాగంలోకి రిలయన్స్​ రిటైల్​ ప్రవేశిస్తోంది.

Reliance Retail: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ క్విక్‌ కామర్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం దేశీయ దిగ్గజ క్విక్‌కామర్స్‌ సంస్థ డుంజోలో 25.8 శాతం వాటాను రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకుని, నిత్యావసర వస్తువులను వేగంగా డెలివరీ ఇచ్చే డుంజో వ్యాపారంలో ఈ వాటాకు 200 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1488 కోట్లు) పెట్టుబడి పెట్టింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన తాజా నిధుల సమీకరణలో డుంజో 240 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1787 కోట్లు)ను సమీకరించినట్లు ఇరు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. డుంజో ప్రస్తుత ఇన్వెస్టర్లయిన లైట్‌బాక్స్‌, లైట్‌రాక్‌, 3ఎల్‌ క్యాపిటల్‌, ఆల్టెరియా క్యాపిటల్‌లు ఈ సమీకరణలో పాల్గొన్నాయి.

ఇతర వ్యాపార భాగస్వామ్యాల్లోనూ..

డుంజో, రిలయన్స్‌ రిటైల్‌లు కొన్ని నిర్దిష్ట వ్యాపార భాగస్వామ్యాల్లోకి అడుగుపెట్టాయి. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ నిర్వహించే రిటైల్‌ స్టోర్లకు హైపర్‌ లోకల్‌ లాజిస్టిక్స్‌ను డుంజో అందిస్తుంది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌కు ఉన్న రవాణా సామర్థ్యాలు మరింత పెరుగుతాయి. జియోమార్ట్‌కు ఉన్న వ్యాపార నెట్‌వర్క్‌కు డెలివరీలను సైతం డుంజో నిర్వహిస్తుంది. దేశంలోనే అతిపెద్ద క్విక్‌ కామర్స్‌ వ్యాపార కంపెనీగా ఎదగాలన్న డుంజో లక్ష్యానికి తాజా నిధులు ఉపయోగపడనున్నాయి. దేశంలోని నగరాల్లో స్థానిక వ్యాపారులకు బీ2బీ వ్యాపార లాజిస్టిక్స్‌ను కూడా సంస్థ విస్తరిస్తుంది.

15-20 నిమిషాల్లోనే డెలివరీ

డుంజో ఇటీవల 'డుంజో డెయిలీ' పేరిట ఇన్‌స్టంట్‌ డెలివరీ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది వారం వారీగా 20 శాతం పైగా వృద్ధిని నమోదు చేస్తోంది. రోజువారీ, వారం వారీ నిత్యావసరాలను 15-20 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. ముఖ్యంగా నాణ్యమైన పళ్లు, కూరగాయలపై ఈ సంస్థ దృష్టి సారిస్తోంది.

డుంజోకు మద్దతిస్తాం: ఈశా అంబానీ

'వినియోగదార్ల ధోరణుల్లో మార్పును మేం గమనిస్తున్నాం. డుంజో క్విక్‌ కామర్స్‌ రంగంలో సృష్టిస్తున్న మార్పులు బాగున్నాయి. ఈ రంగంలో భారత్‌లోనే ఆ సంస్థ అగ్రస్థానంలో ఉంది. మరిన్ని లక్ష్యాలను చేరడానికి మేం డుంజోకు మద్దతు ఇస్తాం. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్ల నుంచి వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేసి మా వినియోగదార్లకు అద్భుత అనుభవాన్ని అందించేందుకు, మా వ్యాపారాల్లో వృద్ధికి ఈ పెట్టుబడి ఉపకరిస్తుంద’ని రిలయన్స్‌ రిటైల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ పేర్కొన్నారు.

isha ambani
ఈశా అంబానీ

వరుస కొనుగోళ్లు.. దేశీయంగా రిలయన్స్‌ రిటైల్‌ పలు కొనుగోళ్లను చేపట్టింది.

  • 2020 నవంబరులో రిటైల్‌ లోదుస్తుల వ్యాపారం 'అమాంతే'ను ఎమ్‌ఏఎస్‌ బ్రాండ్స్‌ నుంచి కొనుగోలు చేసింది.
  • అక్టోబరులో రితుకుమార్‌ సంస్థ 'రితికా'లో 52 శాతం వాటాను సొంతం చేసుకుంది.
  • మనీశ్‌ మల్హోత్రాకు చెందిన 'ఎమ్‌ఎమ్‌ స్టైల్స్‌'లో 40 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
  • సెప్టెంబరులో 'జస్ట్‌ డయల్‌' నియంత్రణను రూ.3497 కోట్లతో సొంతం చేసుకుంది.
  • అనామికా ఖన్నాతో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు 'ఏకే-ఓకే' ఫ్యాషన్‌ బ్రాండ్‌ను అభివృద్ధి చేయనుంది.
  • 'జివామే' పేరిట ఆన్‌లైన్‌ లోదుస్తుల స్టోర్‌ను నిర్వహిస్తున్న ఆక్టోసెర్బా యాక్టివ్‌ హోల్‌సేల్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.

జియో రీఛార్జులకు ఆటోమేటిక్‌ చెల్లింపులు

జియో వినియోగదారులు తమ పథకం రీఛార్జి కోసం బ్యాంక్‌ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా నిధులు యూపీఐ సేవ ద్వారా డెబిట్‌ అయ్యే అవకాశాన్ని ఎంచుకోవచ్చు. ఇందుకోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో జియో ఒప్పందం చేసుకుంది. యూపీఐ ఆటోపే సదుపాయాన్ని టెలికాం రంగంలోకి జియో ద్వారా ప్రవేశ పెడుతున్నట్లు ఇరు సంస్థలు గురువారం ప్రకటించాయి. వినియోగదారులు మైజియో యాప్‌లో, కావాల్సిన పథకానికి నిధులు బ్యాంక్‌ ఖాతా నుంచి ఆటో డెబిట్‌ అయ్యేలా సూచనలు ఇవ్వొచ్చు. రూ.5000 వరకు రీఛార్జి చెల్లింపులకు యూపీఐ పిన్‌ను కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. కావాల్సిన పథకాన్ని మార్చుకునే వీలు కూడా వినియోగదారులకు యూపీఐ ఆటోపే ద్వారా కలుగుతుంది. రీఛార్జి చేసుకోవాల్సిన, బిల్లు కట్టాల్సిన తేదీని వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, పథకం గడువు ముగియగానే నిధులు జమవుతాయి. కనెక్షన్‌ కొనసాగుతుంది.

ఇదీ చూడండి: రిలయన్స్ రికార్డ్.. 400 కోట్ల డాలర్ల విదేశీ కరెన్సీ బాండ్లు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.