ETV Bharat / business

ఉద్యోగులకు రిలయన్స్‌ ఆపన్న హస్తం

author img

By

Published : Jun 3, 2021, 3:05 PM IST

reliance
ఉద్యోగులకు రిలయన్స్‌ ఆపన్న హస్తం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఉదారతను చాటుకున్నారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారికి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని ప్రకటించారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఉదారతను చాటుకున్నారు. తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల భద్రతకు పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారికి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోనున్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆ ఉద్యోగి చివరిసారి తీసుకున్న జీతాన్ని ఐదేళ్ల పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నీతా అంబానీతో కలిసి ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు.

ప్రియమైన సహచరులకు,

కొవిడ్‌-19 గతంలో మనమెప్పుడూ చవిచూడని బాధాకరమైన అనుభవాలను పంచింది. మన సహచరులు, వారి కుటుంబ సభ్యుల మరణాలు కలచివేస్తున్నాయి. ఆ విషాదాల నుంచి కోలుకొనేందుకు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం.

చనిపోయిన వారి నష్టం పూడ్చలేనిది. 'ఒకే రిలయన్స్‌ కుటుంబం'గా అవి మన మనసుపై పెనుభారమే మోపాయి. మన ఆత్మీయుల నష్టాన్ని పూడ్చలేక పోయినా వారి కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికీ అండగా నిలిచేందుకు మేం కట్టుబడ్డాం. వారికి విశ్వాసం కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

రిలయన్స్‌లో మనందరినీ కలిపే ఉమ్మడి బంధమేదైనా ఉందంటే అది ‘వీ-కేర్​’. అందుకే మేం ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తాం. ఈ బాధాకర పరిస్థితుల్లో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్‌ అండగా నిలబడుతుంది. అందుకే మేం 'రిలయన్స్‌ కుటుంబ మద్దతు, సంక్షేమ పథకం' ప్రకటిస్తున్నాం.

  • చనిపోయిన ఉద్యోగి నామినీకి ఐదేళ్లు జీతభత్యాలు అందజేస్తాం. చివరగా తీసుకున్న వేతనాన్నే అందిస్తాం.
  • మృతిచెందిన ఉద్యోగి పిల్లలు భారతదేశంలోని ఏ విద్యా కేంద్రంలోనైనా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసే వరకు 100 శాతం ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ వసతి, పుస్తకాల ఫీజుల్ని అందిస్తాం.
  • పిల్లలు డిగ్రీ పూర్తి చేసేంత వరకు చనిపోయిన ఉద్యోగి భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల ప్రీమియం ఆస్పత్రి ఖర్చులన్నీ 100% మేమే భరిస్తాం.

ఇక కొవిడ్‌ బారిన పడ్డ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి సోకినా ప్రత్యేకంగా కొవిడ్‌ సెలవులు తీసుకోవచ్చు. మానసికంగా, శారీరకంగా కోలుకొనేంత వరకు సెలవులు తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: రిలయన్స్ ఉద్యోగులకు మే 1 నుంచి ఉచిత టీకా

ఇదీ చదవండి: 11శాతం ఆక్సిజన్ ఉత్పత్తి రిలయన్స్‌ నుంచే!

మా సహచరులు లేదా వారి కుటుంబ సభ్యులు పూర్తిగా కోలుకోవడం పైనే దృష్టి పెట్టేందుకే మేం ఈ సెలవు విధానాన్ని పొడిగిస్తున్నాం. (ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ ఈఎస్‌ఎస్‌/ఆర్‌-కనెక్ట్‌ పోర్టల్స్‌లో ఉంటాయి)

ప్రియమైన సహోద్యోగి, ఈ క్లిష్ట పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా మీరు ఒంటరిగా లేరని నిత్యం గుర్తు తెచ్చుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు అండగా రిలయన్స్‌ పరిశ్రమ మొత్తం ఉంటుందని గుర్తుంచుకోండి. మనమంతా ఒక్కటే అనే ఉద్దేశంతో మేం మీ ముందుకొచ్చాం. ఈ విపత్తుపై విజయం సాధించే వరకు ఒక్కతాటిపై నిలబడదాం.

పోరాట పటిమను వదలొద్దు. ఎందుకంటే మున్ముందు మంచి రోజులు కచ్చితంగా వస్తాయి. ఆ సమయం వచ్చేంత వరకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు బలాన్ని ఇవ్వాలని మేం ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తుపై నమ్మకంతో ఒకరికొకరం అండగా ఉంటూ ముందుకు సాగుదాం. మిమ్మల్ని, మీ కుటుంబీకులను జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి.

ఇట్లు

ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ

ఇవీ చదవండి:

1000 పడకల ఆస్పత్రిని నిర్మించనున్న రిలయన్స్​

రిలయన్స్ ఉద్యోగులకు కరోనా టీకా ఫ్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.