ETV Bharat / business

Fuel price reduction: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!

author img

By

Published : Nov 28, 2021, 9:28 PM IST

petrol diesel prices
petrol diesel prices

వాహనదారులకు శుభవార్త! అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో పతనం కొనసాగితే.. దేశీయంగా ఇంధన ధరలు తగ్గే (Petrol price reduction) అవకాశం ఉంది. పలు దేశాలు వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయడం సహా కరోనా వైరస్ వ్యాప్తి భయాలు.. ముడి చమురు ధరలు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో పతనం మరికొంతకాలం కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గే (Petrol price reduction) అవకాశం ఉంది. దేశీయంగా ఇంధన ధరల నిర్ణయించే సమయంలో 15 రోజుల రోలింగ్‌ యావరేజ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. నవంబర్‌ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 80 డాలర్ల నుంచి 82 డాలర్ల మధ్యలోనే ఉంది. గత శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లు మొదలుకాగానే 4 డాలర్ల మేరకు చమురు ధరలు పతనమయ్యాయి. ఇక బ్రెంట్‌ ఫ్యూచర్లు 6 డాలర్లు పతనమై 72.91 వద్దకు చేరాయి. కరోనా కొత్త వేరియంట్‌ చమురు మార్కెట్లలో భయాన్ని నింపింది. ఈ వైరస్‌ వ్యాపిస్తే మరోసారి చమురు డిమాండ్‌ భారీగా పతనం అవుతుందని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంస్థలు రోజు వారీ చమురు ధరలను (Fuel price reduction) నిర్ణయిస్తుండగా.. ఈ ప్రక్రియకు పక్షం రోజుల చమురు ధరలను పరిగణలోకి తీసుకొంటారు. ముడి చమురు తగ్గుదల మరికొన్నాళ్లు కొనసాగితే రిటైల్‌ ధరల్లో (crude oil price) కోత కనిపించే అవకాశం ఉంది.

వ్యూహాత్మక నిల్వల విడుదలతో..

చమురు దిగుమతి చేసుకొనే ప్రధాన దేశాలు వ్యూహాత్మక నిల్వల్లో కొంత భాగాన్ని ఓపెన్‌ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ దేశాల జాబితాలో అమెరికా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా వీటిల్లో ఉన్నాయి. భారత్‌ దాదాపు 50 లక్షల పీపాల చమురు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల సంఘం ఒపెక్‌+కు వ్యతిరేకంగా పలు దేశాలు ఈ నిర్ణయం తీసుకొన్నాయి. భారత్‌ కూడా తొలిసారి తన వ్యూహాత్మక నిల్వలను వాడటం మొదలుపెట్టింది. కొన్ని నెలలుగా ఒపెక్‌+ దేశాలు కోటాలు విధించుకొని మరీ డిమాండ్‌ కంటే తక్కువ చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. ఫలితంగా ధర పెరుగుతోంది. ఇప్పటికే భారత్‌ పలు వేదికలపై ఈ దేశాలను ఉత్పత్తి పెంచాల్సిందిగా కోరింది. కొవిడ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థపై చమురు ధరలు ప్రతికూల ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. మరోపక్క అమెరికా కూడా చమురు ధరలు కొవిడ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థపై, వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడించింది.

ఒపెక్‌+ దేశాల్లో రష్యా, సౌదీ అరేబియాలు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులు. ఇటీవల చమురు ఉత్పత్తిలో కోత విధించి ధరల పెరుగుదలకు కారణం కావడంలో వీటి పాత్ర చాలానే ఉంది. ఈ ఒపెక్‌ + దేశాలు (OPEC Plus countries) ప్రపంచ చమురులో సగం ఉత్పత్తి చేస్తున్నాయి. ఒపెక్‌+ దేశాలు రోజుకు కోటి పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాలని 2020లో నిర్ణయించాయి. అప్పట్లో కొవిడ్‌ కారణంగా డిమాండ్‌ పడిపోయి చమురు పీపా ధర 20 డాలర్ల వద్దకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకొన్నాయి. కానీ, 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మళ్లీ కోలుకొన్నాయి.. ఫలితంగా చమురు డిమాండ్‌ పెరిగింది. కానీ, ఆ మేరకు ఉత్పత్తిని మాత్రం పెంచలేదు. ఫలితంగా చమురు ధరలు రివ్వున పెరిగిపోయాయి. ఒపెక్‌+ సభ్యదేశాలు చెప్పిన దాని కన్నా 5.4 మిలియన్‌ పీపాల చమురును తక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.

భారత్‌లో 2020లో చమురుపై పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గడంతో పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని విధించారు. వీటికి రాష్ట్రాల వ్యాట్‌ కూడా తోడు కావడంతో దేశీయంగా వినియోగదారుడిపై భారం పడింది. వీటికి ఒపెక్‌+ దేశాల తీరు తోడు కావడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100ను దాటేశాయి. కేంద్రం ఇటీవల పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌ రూ.10 సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. తాజాగా వ్యూహాత్మక నిల్వలను బయటకు తీయడం కూడా మార్కెట్లోకి ఇంధన సరఫరాను పెంచే నిర్ణయమే.

ఏమిటీ వ్యూహాత్మక నిల్వలు..

1973-74లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా చమురు సంక్షోభ తలెత్తింది. ఆ తర్వాత నుంచి అమెరికా, పశ్చిమ దేశాలు అత్యవసరాల కోసం భారీగా చమురును కొనుగోలు చేసి నిల్వ చేయడం మొదలుపెట్టాయి. భారత్‌ కూడా ఇదే విధంగా 5.33 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చమురును భూగర్భంలోని రాతి గుహల్లో నిల్వ చేస్తోంది. విశాఖ పట్టణం, కర్ణాటకలోని మంగళూరు, పదౌర్‌ప్రాంతాల్లో ఈ నిల్వలు ఉన్నాయి. చమురు సరఫరా నిలిచిపోయిన సమయంలో 9.5 రోజుల పాటు దేశ అవసరాలను(2019-20 అంచనా ప్రకారం) ఈ నిల్వలు తీర్చగలవు. భారత్‌ వ్యూహాత్మక నిల్వల సామర్థ్యాన్ని మరో 6.5 ఎంఎంటీలు పెంచేందుకు ఛండీకోల్‌, పదౌర్‌ల్లో ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని చమురు కంపెనీల నిల్వ సామర్థ్యాన్ని కలిపితే దేశ అవసరాలను 64.5 రోజుల పాటు తీర్చవచ్చు. అంటే సంక్షోభ సమయంలో భారత్‌కు 74 రోజులు నిరంతరాయంగా చమురును వాడుకోవచ్చన్నమాట. కానీ, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు మాత్రం మన నిల్వలు లేవు. ది ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ 90 రోజుల చమురు నిల్వలను ఉంచుకోవాలని సూచించింది. ఎందుకంటే భారత్‌ చమురు అవసరాలు 85శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. సంక్షోభ సమయంలో దిగుమతులు ఆగినా.. మూడునెలలపాటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి. 606 మిలియన్‌ పీపాల సామర్థ్యంతో వీటిని నిర్మించింది. లూసియానా, టెక్సస్‌లోని తీర ప్రాంతాల్లోని భూగర్భ గుహల్లో వీటిని ఏర్పాటు చేసింది. అమెరికా అవసరాలను ఇవి మూడు నెలల పాటు తీర్చగలవు. గతంలో అమెరికా మూడు సార్లు ఈ నిల్వల నుంచి చమురును విడుదల చేసింది. ఈ నిల్వల విషయంలో అమెరికా తర్వాత స్థానంలో జపాన్‌, చైనా ఉన్నాయి. తాజాగా వివిధ దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీయడంతో రష్యా, సౌదీలు క్రమంగా ఉత్పత్తిని పెంచనున్నట్లు సంకేతాలిస్తున్నాయి.

ఇదీ చదవండి: jio tariff hike: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్- ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.