ETV Bharat / business

14 ఏళ్ల తర్వాత పెరగనున్న అగ్గిపెట్టె ధర!

author img

By

Published : Oct 24, 2021, 5:47 AM IST

Updated : Oct 24, 2021, 6:20 AM IST

14 ఏళ్లుగా రూపాయికే లభిస్తున్న అగ్గిపెట్ట ధర పెరగనుంది (Matchbox Price Hike). డిసెంబర్ 1 నుంచి అగ్గిపెట్టెను రూ.2 లకు విక్రయించనున్నట్లు తయారీ సంస్థలు ప్రకటించాయి.

matchbox price hike
అగ్గిపెట్టె

అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి(Matchbox Price Hike). ఇప్పటివరకు రూ.1కి విక్రయిస్తున్న అగ్గిపెట్టెను డిసెంబరు 1 నుంచి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కి, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని పేర్కొన్నారు. బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, గంధకం వంటి ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. ఇంధన ధరల వల్ల రవాణా ఛార్జీలు భారమయ్యాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని (Matchbox Price) నిర్ణయించాయి.

50 పైసల నుంచి..

ఒక అగ్గిపెట్టె ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచుతూ 2007లో నిర్ణయం తీసుకోగా, మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు (Matchbox Price in India). ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇకపై రూ.430-480కి పెంచాలని నిర్ణయించినట్లు నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వి.ఎస్‌.సేతురథినమ్‌ తెలిపారు. దీనికి అదనంగా 12 శాతం జీఎస్‌టీ, రవాణా ఛార్జీలు కూడా ఉంటాయన్నారు. తమిళనాడులో అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.

ఇదీ చూడండి: 18 నెలల్లోనే రూ.36 పెరిగిన పెట్రోల్ ధర

Last Updated : Oct 24, 2021, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.