ETV Bharat / business

ఇప్పట్లో పెట్రోల్​ ధరల తగ్గుదల లేనట్టే!

author img

By

Published : Jul 5, 2021, 3:19 PM IST

Updated : Jul 5, 2021, 3:31 PM IST

There is no chance to decline petrol prices
పెట్రోల్​ రేట్ల తగ్గుదల కష్టమే

దేశంలో పెట్రో మంట ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రెండు నెలల కాలంలో పెట్రోల్ ధర 35 సార్లు డీజిల్​ ధర 33 సార్లు పెరిగింది. దీనితో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్ రేట్లు.. దిల్లీ, కోల్​కతాలోనూ ఆ మార్క్​కు చేరువయ్యాయి.

పెట్రోల్‌ ధరల బాదుడు నుంచి సామాన్యుడికి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా కనిపించడం లేదు. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో.. బండి బయటకు తీయాలంటేనే వాహనదారుడి గుండె గుబేలుమంటోంది.

రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బంగాల్​ ఎన్నికల సమయంలో వరుసగా.. 18 రోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఆ తర్వాత మే 4 నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

సోమవారం కొత్త రికార్డులు..

సోమవారం లీటర్​ పెట్రోల్‌ పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్‌ ధరలపై.. ఎలాంటి పెంపు లేకుండా యథావిధిగా కొనసాగించాయి. మే నెల నుంచి.. ఇప్పటివరకు మొత్తం 35 సార్లు పెట్రోల్‌ ధరలను పెంచగా డీజిల్‌ ధరను 33 సార్లు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

మే నెలలో 16 సార్లు, జూన్‌లో 16 సార్లు ఇంధన ధరలను పెంచిన చమురు సంస్థలు.. జులైలో ఐదు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పెట్రోల్‌ ధరను పెంచాయి. దీంతో ఈ రెండు నెలల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.9.46 పైసలు పెరిగింది. 33 సార్లలో డీజిల్‌ ధర రూ.8.63 పైసలు పెరిగింది.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.90 పైసలకు చేరి సెంచరీకి చేరువైంది. కోల్‌కతాలోనూ లీటర్‌ పెట్రోల్‌ వంద మార్కును సమీపించింది.

ఆర్ధిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.105.95 పైసల వద్ద ఉంది.

చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.78 పైసలకు చేరి వాహన దారులకు మోయలేని భారంగా తయారైంది.

ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టేసింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సహా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, జమ్ముకశ్మీర్‌, తమిళనాడు, కేరళ, బిహార్‌, పంజాబ్‌, లద్దాఖ్‌, సిక్కింలలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 పైనే ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో డీజిల్ ధర కూడా రూ.100 దాటేసింది. రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.100పైనే ఉంది.

ప్రభుత్వం చెబుతున్న కారణాలు..

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్లనే దేశీయంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో.. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 2019 ఏప్రిల్‌ తర్వాత తొలిసారి ‌75 డాలర్ల మార్క్‌ను తాకింది.

ఇవీ చదవండి:

Last Updated :Jul 5, 2021, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.