రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు వేళాయే!

author img

By

Published : Jul 25, 2021, 8:04 PM IST

Updated : Jul 25, 2021, 9:58 PM IST

transportation

ప్రపంచంలో అతివేగంగా నడిచే రైలును ఇటీవలే చైనా ప్రారంభించింది. ఇది మ్యాగ్​లెవ్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. ప్రపంచంలో అతికొన్ని రైళ్లు మాత్రమే ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. అసలేంటి ఈ మ్యాగ్​లెవ్​? భవిష్యత్తులో రవాణా రంగంలో ఎలాంటి మార్పులు రానున్నాయి? అనేది తెలుసుకుందాం.

రవాణా రంగం ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి. పశువులు లాగే బండ్ల నుంచి మొదలు కొని విమాన ప్రయాణం వరకు సాంకేతికత దినదినాభివృద్ధి సాధించింది. భూమి మీద గాలిలో ప్రయాణించేంత వేగాన్ని అందుకునేందుకు మానవ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొంత మేర పురోగతి సాధిస్తున్నారు. అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో రవాణా రంగంలో భారీ మార్పులు రాబోతున్నాయి.

వేగాన్ని అందిపుచ్చుకుని రోజు వారీ రవాణా సాధనాలతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నారు మానవుడు. దీనికి గొప్ప ఉదాహరణే.. ఇటీవల చైనాలో ప్రారంభించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు. మ్యాగ్​లెవ్ అనే అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనిలో గంటకు 600 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ సాంకేతికతను ఉపయోగించుకొని నడిచే రైళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

ఏమిటీ మ్యాగ్​లెవ్?

మ్యాగ్​లెవ్ అంటే మ్యాగ్నటిక్ లెవిటేషన్. ఇందులో రైలు పట్టాల మీద ప్రయాణం చేయదు. ట్రాక్ పైన కొంచెం ఎత్తులో రైలు ఉంటుంది. ఇలా రైలు ఉండేందుకు బలమైన అయస్కాంతాలను ఉపయోగిస్తారు. దీంతో పట్టాలకు, రైలుకు మధ్య ఘర్షణ ఉండదు. కాబట్టి భారీ స్పీడ్​ను అందుకోవచ్చు. చైనా ఆవిష్కరించిన ఈ రైలు ద్వారా భారత్​లోని దిల్లీ నుంచి ముంబయికి కేవలం మూడు గంటల కంటే తక్కువ వ్యవధి చేరుకోవచ్చు.

అధునాతన టెక్నాలజీకి మ్యాగ్​లెవ్ ఒక మంచి ఉదాహరణ కాగా... ఇప్పటికే వాణిజ్య స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తోన్న బుల్లెట్ రైళ్లు మరో ఉదాహరణ. ఇవే కాకుండా హైపర్ టూప్​ అనే సాంకేతికత భవిష్యత్​ను శాసించబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైపర్​లూప్

ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విమాన వేగాన్ని అందుకోవచ్చని భావిస్తున్నారు. దీని ద్వారా గంటకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. హై స్పీడ్ రైళ్లతో పోల్చితే ఇది ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని వీటి తయారీలో ఉన్న కంపెనీలు చెబుతున్నాయి. ఇది మ్యాగ్నిటిక్ లెవిటేషన్​కు అప్​డేటేడ్ సాంకేతికతగా దీన్ని పరిగణించవచ్చు. ఈ పరిజ్ఞానంలో ట్యూబ్​లో రైలు కదులుతుంది. ఈ ట్యూబ్​ను సాధారణ రైలు పట్టాలతో పోల్చుకోవచ్చు. ఇందులో తక్కువ పీడనంలో గాలి ఉంటుంది. దీని వల్ల ఘర్షణ మరింత తగ్గిపోతుంది. ఈ కారణంగా మ్యాగ్​లెవ్ రైళ్లతో పోల్చితే ఇవి ఇంకా ఎక్కువ స్పీడ్​లో ప్రయాణించవచ్చు. స్పేస్​ఎక్స్, వర్జీన్ గెలాక్టిక్​ లాంటి కంపెనీలు వీటి అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఎగిరే కార్లు

ఈ ఫ్యూచరిస్టిక్ కార్లకు సంబంధించి ప్రస్తుతం ప్రోటోటైప్​ల అభివృద్ధి జరుగుతోంది. ఎగిరే కార్లు ఏ విధంగా ఉండనున్నాయి? వీటిలో ప్రయాణం అనేది ఎలా ఉంటుంది? అన్న దానిపై స్పష్టత రావాలంటే ఇంకా కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇటీవల ఓ కంపెనీ నిర్వహించిన ప్రోటోటైప్ మోడల్ టెస్టింగ్​లో ఉన్న ఎగిరే కార్... కారు, విమానం కలిపి ఉన్నట్లు ఉంది. భూమి మీద నడిచినప్పుడు కారులా... గాలిలో ఉన్నప్పుడు విమానం లాగా కనిపిస్తుంది.

ప్యాసింజర్ డ్రోన్​లు

ఇది చాలా ఫ్యూచరిస్టిక్ మోడల్. వీటి ద్వారా ఎగిరే కార్​లలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చు. ఒకే దగ్గర ఎగిరి ఒకే దగ్గర దిగవచ్చు. సాధారణ డ్రోన్ మాదిరే ఇది పనిచేస్తుంది. దీనినే డ్రోన్ ట్యాక్సీ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది చాలా కొత్త టెక్నాలజీ అయినందకు దీని భవిష్యత్​పై స్పష్టత రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: అంతరిక్ష పర్యటనపై ఆసక్తా? ఇది మీకోసమే..

Last Updated :Jul 25, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.