ETV Bharat / business

మోదీ 'టార్గెట్​ 2070'.. భారత్​కు సాధ్యమేనా?

author img

By

Published : Nov 2, 2021, 6:52 PM IST

గ్లాస్గో వేదికగా జరిగిన కాప్26​ 'ప్రపంచ నేతల సదస్సు'లో మాట్లాడుతూ.. 2070 నాటికి ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రపంచ దేశాధినేతలు ఆశ్చర్యపోయారు. 2070 నాటికి లక్ష్యాన్ని సాధించాలంటే భారత్​ చేయాల్సిందేంటి? అసలు ఈ లక్ష్యం సాధించగలిగేదేనా?

modi glasgow visit
మోదీ 'టార్గెట్​ 2070'.. భారత్​కు సాధ్యమేనా?

2070 నాటికి ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గ్లాస్గోలో జరిగిన కాప్​26 సదస్సులో ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే.. దేశంలోని సౌరశక్తి సామర్థ్యం 5,600 గిగావాట్లకు చేరాలని, 2060 నాటికి బొగ్గు వినియోగం (ముఖ్యంగా విద్యుత్​ రంగంలో) 99శాతం పడిపోవాలని సీఈఈడబ్ల్యూ ఇండియా(కౌన్సిల్​ ఆన్​ ఎనర్జీ, ఎన్విరామ్నెంట్​, వాటర్​) అంచనా వేసింది. అదే సమయంలో చమురు వినియోగం 2050 నాటికి తారస్థాయికి చేరుకుని అక్కడి నుంచి రెండు దశాబ్దాల పాటు కిందకు దిగిరావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లక్ష్యాన్ని సాధించడానికి 2030- 2100 వరకు దాదాపు 13వేల బిలియన్​ డాలర్లను దేశం ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది.

"నెట్​-జీరో కోసం ముందుగా.. విద్యుత్​ రంగంలో బొగ్గు వినియోగంపై దృష్టిపెట్టాలి. అసలు బొగ్గు వినియోగమే లేకుండా చేయాలి. 2040 వరకు బొగ్గు వినియోగం పెరిగినా, 2060 నాటికి దానిని 99శాతం మేర తగ్గించాలి. సౌరశక్తి ఆధారిత విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2050 నాటికి 1,689గిగావాట్లకు పెంచాలి. 2070 నాటికి దానిని 5,630గిగావాట్లకు చేర్చాలి. వాయు ఆధారిత విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2050కి 557గిగావాట్లు, 2070 నాటికి 1792 గిగావాట్లకు తీసుకెళ్లాలి. అటు 2070 నాటికి ఎలక్ట్రిక్​ వాహనాల అమ్మకాలు 84శాతానికి చేరాలి. సరకు రవాణా ట్రక్కులో విద్యుత్​ వాహనాల వాటా 2070 నాటికి 79శాతానికి పెరగాలి. మిగిలినవి హైడ్రోజెన్​ ద్వారా నడిపించాలి. "

--- సీఈఈడబ్ల్యూ ఇండియా.

దేశ పునరుత్పాదక శక్తి సామర్థ్యం 2030 నాటికి 450గిగావాట్లకు చేరాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్లాస్గోలో ప్రసంగించిన మోదీ.. ఆ లక్ష్యాన్ని 500గిగావాట్లకు పెంచారు. దేశంలో సగానికిపైగా విద్యుత్​ ఉత్పత్తి పునరుత్పాదక శక్తితోనే జరుగుతుందని హామీనిచ్చారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్​ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని చెప్పారు. వాతావరణ మార్పుల కట్టడి కోసం భారత్​ ఎంతో శ్రమిస్తోందని.. దాని ఫలితాలు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- డిస్కమ్‌లకు విద్యుదాఘాతాలు- నియంత్రణ మండళ్ల పనితీరు నిస్తేజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.