ETV Bharat / business

తగ్గిన ఫేస్​బుక్ యూజర్ల సంఖ్య.. 18 ఏళ్లలో ఇదే తొలిసారి..

author img

By

Published : Feb 3, 2022, 4:30 PM IST

Facebook Losses Daily Users: 18 ఏళ్ల చరిత్రలో ఫేస్‌బుక్‌ వినియోగదారుల సంఖ్య తొలిసారిగా తగ్గింది. డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి ఈ సంఖ్య 192 కోట్ల 90 లక్షలకు పడిపోయింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 193 కోట్లుగా ఉంది. ఫలితంగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా షేర్లు 20 శాతం మేర నష్టపోయాయి.

Facebook Losses Daily Users
తగ్గిన ఫేస్​బుక్ వినియోగదారుల సంఖ్య

Facebook Losses Daily Users: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఆ సంస్థ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గింది. డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి ఈ సంఖ్య 192 కోట్ల 90 లక్షలకు పడిపోయింది.

అంతకుముందు త్రైమాసికంలో ఇది 193 కోట్లుగా ఉంది. దీంతోపాటు ప్రత్యర్థి సంస్థలైన టిక్‌టాక్‌, యూట్యూబ్‌ నుంచి పోటీ పెరిగిపోవడంతో ఆదాయాలు తగ్గుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది.

చరిత్రలో తొలిసారి రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గడంతో ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా షేర్లు ట్రేడింగ్‌ ఆఫ్టర్ అవర్స్‌లో 20శాతం మేరకు కుంగాయి. ఫేస్‌బుక్‌ మార్కెట్‌ విలువలో ఏకంగా 200 బిలియన్‌ డాలర్ల పతనం చోటు చేసుకొంది. మరోపక్క ట్విటర్‌, పిన్‌ట్రస్ట్‌, స్నాప్‌ షేర్లు కూడా పతనం అయ్యాయి.

కారణం అదే..

వినియోగదారుల సంఖ్యలో తగ్గుదలపై ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పందించారు. ముఖ్యంగా యువ వినియోగదారులు ఫేస్‌బుక్‌ను వీడి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లిపోతుండటంతో సంస్థ వ్యాపారం తగ్గుతోందని వెల్లడించారు. ఇప్పటికే యాపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో గోప్యతా మార్పులతో ఫేస్‌బుక్‌కు సమస్యలు మొదలయ్యాయి.

ఈ మార్పుల కారణంగా ఫేస్‌బుక్‌లో ఆయా వాణిజ్య సంస్థలు తమ ప్రకటనలు వినియోగదారులను ఎంత మేరకు ప్రభావితం చేశాయో కనుక్కోవడం కష్టంగా మారింది. ప్రపంచంలోనే గూగుల్‌ తర్వాత అతిపెద్ద డిజిటల్‌ వాణిజ్య ప్రకటనల ప్లాట్‌ఫామ్‌గా మెటాకు పేరుంది.

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మెటా మొత్తం ఆదాయం 33.67 బిలియన్‌ డాలర్లగా ఉంది. ఇందులో ఎక్కువ మొత్తం అడ్వటైజింగ్‌ సేల్స్‌ నుంచే లభిస్తోంది.

ఇదీ చూడండి: ఎల్‌ఐసీ ఐపీఓ మార్చిలో.. వచ్చే వారమే సెబీకి ముసాయిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.