ETV Bharat / business

Dolo 650 Tablet: అందరి నోళ్లలో 'డోలో 650'.. ఎందుకింత ప్రాధాన్యం?

author img

By

Published : Jan 23, 2022, 7:24 AM IST

Dolo 650 Tablet: 'డోలో 650'.. కొవిడ్‌ మహమ్మారితో ప్రజలందరి నోళ్లలో నానుతున్న మందు ఇదే. ఇంతకీ ఏమిటీ మందు.. దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం? దీన్ని ఉత్పత్తి చేస్తున్నది ఎవరు? అనేవి అత్యంత ఆసక్తికరమైన అంశాలుగా మారాయి.

DOLO 650 News
డోలో 650

Dolo 650 Tablet: 'డోలో 650' అనేది బ్రాండు పేరు. మందు పారాసెట్మాల్‌. 650 ఎంజీ అనేది డోసు. బెంగుళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌ అనే ఫార్మా కంపెనీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలందరికీ తెలిసిన పారాసెట్మాల్‌ బ్రాండ్లు వేరే ఉన్నాయి. అవి బహుళ జాతి ఫార్మా కంపెనీ జీఎస్‌కేకు చెందిన కాల్‌పాల్‌, క్రోసిన్‌ బ్రాండ్లు. ఆ తర్వాత దేశీయ కంపెనీలు కొన్ని పీ 650, పాసిమోల్‌, పారాసిప్‌, ఎక్స్‌టీపారా, సుమో ఎల్‌ బ్రాండ్ల పేరుతో ఈ మందును అపెక్స్‌, సిప్లా, ఇప్కా, టోరెంట్‌ వంటి దేశీయ కంపెనీలు అందిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలందరికీ తెలిసింది 'డోలో 650'నే. జ్వరం అనగానే పారాసెట్మాల్‌ వాడాలి, అనటానికి బదులు, 'డోలో 650' వేసుకో అనే మాట వస్తుంది.

కొవిడ్‌ సోకగానే కనిపించే మొదటి లక్షణం జ్వరం. అందుకే డోలో 650 వేసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇంకా యాంటీ- బయాటిక్‌, యాంటీ-హిస్టమిన్‌ మందులు, విటమిన్‌ ట్యాబ్లెట్లూ సూచిస్తున్నారనుకోండి. అయినప్పటికీ ప్రాథమిక ఔషధం 'డోలో650'నే అవుతోంది. ఈ బ్రాండుకు ఇంత అధిక ప్రజాదరణ లభిస్తుందని మేం కూడా అంచనా వేయలేదు- అంటారు మైక్రో ల్యాబ్స్‌ సీఎండీ దిలీప్‌ సురానా.

Dolo 650 Dosage:

650 ఎంజీతో పారాసెట్మాల్‌ 500 ఎంజీ డోసు మాత్రమే అందుబాటులో ఉన్న తరుణంలో, 1993లో 'డోలో' పేరుతో 650 ఎంజీ డోసు పారాసెట్మాల్‌ ట్యాబ్లెట్‌ను మైక్రో ల్యాబ్స్‌ తీసుకొచ్చింది. దీని విజయానికి ఈ డోసే ప్రధాన కారణం. పారాసెట్మాల్‌ మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు... జ్వరాన్ని అదుపు చేయటానికి 500 ఎంజీ డోసు సరిపోవటం లేదని, కొంత అధిక డోసు అయితే మేలు- అనే అభిప్రాయం వైద్యుల నుంచి వ్యక్తమైంది. దాన్ని మైక్రో ల్యాబ్స్‌ అందిపుచ్చుకుంది. 650 ఎంజీ డోసులో ఈ మందు ఉత్పత్తి చేయటం కొంత కష్టమైనప్పటికీ, సొంత పరిశోధన- అభివృద్ధి ద్వారా దాన్ని సాధించింది.

350 కోట్లకు పైగా..:

Dolo 650 Uses: మనదేశంలో కొవిడ్‌ విస్తరించిన తర్వాత ఇప్పటి వరకూ 350 కోట్లకు పైగా డోలో 650 ట్యాబ్లెట్‌ అమ్ముడయ్యాయి. ఇక్వియా సంస్థ గణాంకాల ప్రకారం 2021లో రూ.307 కోట్ల అమ్మకాలు ఈ బ్రాండు నమోదు చేసింది. 2021 డిసెంబరు నెలలోనే రూ.28.9 కోట్ల అమ్మకాలు నమోదు కావటం గమనార్హం. ఈ విభాగంలో అతిపెద్ద రెండో బ్రాండు- కాల్‌పాల్‌, రూ.28 కోట్ల అమ్మకాలు సాధించింది. ఎక్కువ మంది వైద్యులు సిఫార్సు చేయటంతోనే డోలో-650 ప్రజల్లో గుర్తుండిపోయే బ్రాండుగా మారిందని ఫార్మా, వైద్య పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. డోలో 650 అనేది ఇంటి ఔషధంగా మారిపోయింది- అని ఒక ఫార్మసీ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఎంతో పోటీ ఉన్న దేశీయ ఔషధ పరిశ్రమలో మైక్రో ల్యాబ్స్‌కు అదృష్టవశాత్తూ దక్కిన బ్రాండు- డోలో 650. ఈ అదృష్టం ఊరకే రాలేదు. అదృష్టానికి తోడు తమ శ్రమ, పట్టుదలా ఉందంటారు మైక్రో ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు. ఈ సంస్థ ప్రస్తుతం రూ.2,700 కోట్ల వార్షిక టర్నోవర్‌ నమోదు చేస్తోంది. ఇందులో రూ.900 కోట్లకు పైగా ఎగుమతుల ఆదాయం ఉంటుంది. త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే ఆలోచనా ఈ సంస్థకు ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: క్యూ3లో రిలయన్స్ హవా.. 41% పెరిగిన లాభాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.