ETV Bharat / business

Digital payments: డిజిటల్​ పేమెంట్స్​లో జోరు- అగ్రగామి భారత్​

author img

By

Published : Jan 28, 2022, 6:50 AM IST

Digital payments In India
డిజిటల్ చెల్లింపులు

Digital Payments In India: సామాన్యుడు కూడా సులువుగా డిజిటల్‌ చెల్లింపులు జరపడానికి అనువైన యూపీఐ సాంకేతికతను భారత్‌ రూపొందించినందు వల్ల ప్రపంచంలో ఈ రంగంలో అగ్రస్థానానికి చేరుకోగలిగింది. ఈ విజయానికి 2015లో ప్రారంభమైన డిజిటల్‌ ఇండియా వెన్నుదన్నుగా నిలిచింది. ఇకపై బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో డిజిటల్‌ లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరగబోతున్నాయి.

Digital Payments In India: ఆధార్‌ కార్డుతో పౌరుల వివరాలు చోరీ అవుతాయని మొదట్లో ఆందోళన వ్యక్తమయ్యేది. అలాగే భారతీయులకు స్మార్ట్‌ ఫోన్లు కొనే స్తోమత ఉంటుందా అనే అనుమానాలూ రేగాయి. చివరికి ఈ రెండు పరిణామాలు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను కొత్త మలుపు తిప్పాయి. ప్రస్తుతం పది వేల రూపాయల లోపు ధరకే స్మార్ట్‌ ఫోన్లు లభిస్తున్నాయి. 2021లో దాదాపు 17 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు భారతీయుల హస్తాలను అలంకరించగా, వాటిలో 2.9 కోట్లు 5జీ ఫోన్లే. ఆధార్‌ ద్వారా బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన స్మార్ట్‌ ఫోన్‌ నేడు అరచేతిలో బ్యాంకు శాఖగా, కిరాణా దుకాణంగా మారిపోయింది. మొబైల్‌లో చౌకగా అంతర్జాలం సదుపాయం లభ్యమవడంతో నేడు నగదు చెల్లింపులు, వస్తుసేవల కొనుగోళ్లు డిజిటల్‌ బాట పడుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారితోపాటు పెద్ద నోట్ల రద్దు కూడా డిజిటల్‌ చెల్లింపులకు ఊతమిచ్చింది.

Digital Transactions in World: ఒక్క 2020లోనే భారత్‌లో 2,550 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. ఇవాళ ప్రపంచమంతటిలోకీ డిజిటల్‌ చెల్లింపుల్లో భారతదేశానిదే అగ్ర స్థానం. 1,570 కోట్ల లావాదేవీలతో చైనా రెండో స్థానం ఆక్రమిస్తుంటే, కేవలం 120 కోట్ల లావాదేవీలతో అమెరికా తొమ్మిదో స్థానంలో నిలిచినట్లు చెల్లింపుల కంపెనీ 'ఏసీఐ వరల్డ్‌వైడ్‌' వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో 61.4 శాతం చెల్లింపులకు కరెన్సీ నోట్లను వాడుతున్నారు. 2025కల్లా ఈ తరహా చెల్లింపులు 28.3 శాతానికి తగ్గిపోతాయంటున్నారు. అప్పటికి డిజిటల్‌ చెల్లింపులు దాదాపు 72 శాతానికి చేరతాయన్న మాట! 2021లో నగదు రూపేణా డిజిటల్‌ చెల్లింపుల విలువ 30 వేల కోట్ల డాలర్లు; 2026కల్లా అవి లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది, 'క్రెడిట్‌ లాయనేస్‌ సెక్యూరిటీస్‌ ఆసియా (సీఎల్‌ఎస్‌ఏ)' సంస్థ అంచనా. 2016లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనివర్సల్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) డిజిటల్‌ లావాదేవీలను ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం 250 బ్యాంకులు యూపీఐ ద్వారా నగదు బదిలీని అనుమతిస్తున్నాయి. పేటీఎం, ఫోన్‌ పే, జీపే, భారత్‌ పే, రేజర్‌ పే సహా మొత్తం 50 యూపీఐ యాప్‌లు డిజిటల్‌ చెల్లింపులను సులభతరం చేస్తున్నాయి. వర్తకులకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా జరుగుతున్న చెల్లింపులకు సమానంగా యూపీఐలోనూ చెల్లింపులు జరుగుతున్నాయి. కొవిడ్‌ కాలంలో దుకాణదారుడికి దూరం నుంచి చెల్లింపులు జరపడానికి క్యూఆర్‌ కోడ్‌ వినియోగం విస్తృతమైన సంగతి తెలిసిందే. ఇటీవల నెలసరి వాయిదా పద్ధతి (ఈఎంఐ)లో వస్తు కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ రుణాలిచ్చే పద్ధతి కూడా విస్తరిస్తోంది. దీన్ని 'ఇప్పుడు కొను, తరవాత చెల్లించు' (బీఎన్‌పీఎల్‌) పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. భారత్‌ త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద బీఎన్‌పీఎల్‌ మార్కెట్‌గా అవతరించనున్నది. అయితే, దీనివల్ల స్వదేశీ విపణి విస్తరించినా, ఖాతాదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రుణ సంస్థల చేతిలో వినియోగదారులు వేధింపులకు గురవుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడటం గమనార్హం.

Digital Payments Index: ఏదిఏమైనా- సామాన్యుడు కూడా సులువుగా డిజిటల్‌ చెల్లింపులు జరపడానికి అనువైన యూపీఐ సాంకేతికతను భారత్‌ రూపొందించినందు వల్ల ప్రపంచంలో ఈ రంగంలో అగ్రస్థానానికి చేరుకోగలిగింది. ఈ విజయానికి 2015లో ప్రారంభమైన డిజిటల్‌ ఇండియా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజలు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలు పొందడానికి, వారికి ప్రత్యక్ష నగదు బదిలీ చేయడానికి డిజిటల్‌ ఇండియా తోడ్పడింది. 2020లో కేంద్ర ప్రభుత్వం దేశంలో మూలమూలకూ అంతర్జాల సౌకర్యాన్ని విస్తరించాలని నిశ్చయించింది. వెయ్యి రోజుల్లో ఆరు లక్షల గ్రామాలకు అంతర్జాల సేవలు అందించదలచినట్లు 2020 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చే క్రమంలో 16 రాష్ట్రాల్లోని 3,60,000 గ్రామాలకు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కింద ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ ద్వారా అంతర్జాలం అందించడానికి భారత్‌ నెట్‌ ప్రాజెక్టును చేపట్టారు. గడచిన అయిదేళ్లలో లక్షన్నర గ్రామ పంచాయతీలకు ఫైబర్‌ నెట్‌ సేవలను కల్పించారు. ఈ సువిశాల యంత్రాంగమే భారత్‌ను డిజిటల్‌ చెల్లింపులలో అగ్రగామిగా నిలబెడుతోంది. ఇకపై బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో డిజిటల్‌ లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరగబోతున్నాయి.

- ప్రసాద్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్​ 580 పాయింట్లు పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.