Crypto Assets Bill: 'క్రిప్టో కరెన్సీ' పేరు మార్చేందుకు కేంద్రం నిర్ణయం!

author img

By

Published : Dec 4, 2021, 6:35 AM IST

Crypto

Crypto Assets Bill: క్రిప్టో కరెన్సీని 'క్రిప్టో అసెట్'​గా పేరు మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక దీనిని సెబీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెబీ వద్ద నమోదు కావడానికి ప్రస్తుత క్రిప్టో ఎక్స్ఛేంజీలకు గడువు తేదీని కూడా ప్రకటించనున్నారు.

Crypto Assets Bill: క్రిప్టో కరెన్సీని 'క్రిప్టో అసెట్‌'గా పేరు మార్చి, మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. అంటే సెబీ దగ్గర నమోదైన ప్లాట్‌ఫాంలు, ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే క్రిప్టో లావాదేవీలు జరగాలి. సెబీ వద్ద నమోదు కావడానికి ప్రస్తుత క్రిప్టో ఎక్స్ఛేంజీలకు గడువు తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇవన్నీ అమల్లోకి రావడానికి వీలుగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అత్యున్నతాధికారి తెలిపారు.

నగదు అక్రమ లావాదేవీల (మనీ లాండరింగ్‌)ను అరికట్టడానికి ఈ బిల్లులో 'ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌'(పీఎమ్‌ఎల్‌ఏ) నిబంధనలను సైతం పొందుపరుస్తారని వివరించారు. ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీ బిల్లుకు సంబంధం లేకుండా ఇది విడిగా ఉంటుంది. డిజిటల్‌ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా వర్గీకరించడానికి మధ్య అంతరం ఉండేందుకు ఇలా చేయనున్నారని విశదీకరించారు.

ఉల్లంఘిస్తే రూ.5-20 కోట్ల జరిమానా

వివిధ స్థానిక ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్‌ అవుతున్న క్రిప్టోకరెన్సీల విలువ భారీగా పడిపోయిన నేపథ్యంలో, క్రిప్టో కరెన్సీలను నిషేధించడం కంటే వాటిని నియంత్రించడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. 'అన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలు సెబీ నియంత్రణ పరిధిలోకి వస్తాయి. ఏదైనా ఉల్లంఘన జరిగితే నిర్వాహకులకు రూ.5-20 కోట్ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉండొచ్చ'ని ఆ అధికారి వివరించారు.

సెబీకి ఇష్టమేనా?

SEBI Cryptocurrency: సెబీ కిందకు క్రిప్టో ప్లాట్‌ఫాంలను తీసుకురావడం వల్ల మార్కెట్లో సామర్థ్యం కలిగిన సంస్థలే మనుగడ సాగిస్తాయని అంచనా. క్రిప్టో ప్లాట్‌ఫాంల రూపంలో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్టవేసినట్లు అవుతుంది. అయితే సెబీలోని కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. క్రిప్టోను నియంత్రించడానికి తొలుత సెబీ పెద్ద ఆసక్తి చూపలేదు. ఊహాజనితమైన క్రిప్టోల్లో ఎటువంటి ఆస్తులు లేకపోవడమే ఇందుకు కారణం.

అయితే ఇపుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో ప్రతీ లావాదేవీ, ప్రతి వాలెట్‌ను ఒక కేంద్రీకృత డీమ్యాట్‌ తరహా స్టోర్‌లో ఉంచాలని భావిస్తోంది. కాయిన్‌ ఓనర్‌షిప్‌ను రియల్‌టైమ్‌లో నిర్వహించడానికి ఒక ప్రత్యేక డేటాబేస్‌ను సృష్టించడానికి ఇది అత్యంత అవసరమని ఆ అధికారి వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.