ETV Bharat / business

'కరోనా' కాలంలో బంగారం కొనడం మంచిదా? కాదా?

author img

By

Published : Feb 21, 2020, 2:26 PM IST

Updated : Mar 2, 2020, 1:50 AM IST

ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోన్న ప్రాణాంతక వైరస్... కరోనా. ఇప్పటివరకు చైనాలో 2 వేల మందికి పైగా బలితీసుకున్న ఈ వైరస్ ప్రభావం పలు రంగాలపై పడుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందన్న అంచనాల మధ్య బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్​కు బంగారం ధరకు సంబంధం ఏంటి? పసిడి ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతుందా?

gold
బంగారం

'కరోనా' కాలంలో బంగారం కొనడం మంచిదా? కాదా?

బంగారం ధర గత ఐదు రోజుల్లో 700 రూపాయలకు పైగా పెరిగింది. హైదరాబాద్‌లో 5 రోజుల క్రితం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 42,300 ఉంది. ప్రస్తుతం రూ.43వేలు దాటింది. నెల రోజులుగా చూస్తే పసిడి ధర రూ.1700 వరకు పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది.

ఎందుకీ పెరుగుదల?

బంగారం ధర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముడిచమురు ధరలు, డాలరు విలువ, ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వాణిజ్య యుద్ధం, మధ్య ఆసియా పరిస్థితులూ ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.ప్రస్తుత పెరుగుదల కరోనా భయాల వల్ల వచ్చినప్పటికీ.. అంతకుముందు నుంచీ బంగారం ధర పెరుగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్ కంటే ముందే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ దేశాల్లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్న కారణంగా భౌతిక ఆస్తులపై పెట్టుబడికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బంగారం కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా కొంతకాలం నుంచి బంగారం ధర పెరుగుతోంది.

"సాధారణంగానే బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. ఇప్పుడు కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబధించిన భయాలతో మరింత పెరుగుతోంది. సమస్య ఇంకా పెద్దదైతే ర్యాలీ కొనసాగవచ్చు. దీనిపై కొన్ని వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కరోనా సమస్య పరిష్కారమైతే.. స్వల్పకాలంలో ర్యాలీ ఆగిపోవచ్చు లేదా కొద్దిగా తగ్గిపోవచ్చు. కొన్ని దేశాల్లో వడ్డీ రేట్లు రుణాత్మకం లేదా తక్కువున్న దృష్ట్యా దీర్ఘ కాలంలో ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది."

- సతీష్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్ మనీ

కరోనాకు పరిష్కారం దొరికితే..

ఒకవేళ కరోనా సమస్య పరిష్కారమైనట్లయితే ధరలు స్థిరీకరణ అవటం కానీ.. లేదా కొంచెం తగ్గటం కాని జరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారీగా తగ్గే అవకాశం లేదంటున్నారు. ఇది కాకుండా అంతర్జాతీయంగా మిగతా అనిశ్చితులు కొనసాగితే దీర్ఘకాలంలో కూడా బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయం కూడా బంగారం ధరను ప్రభావితం చేయనుంది.

"కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి 10 శాతం ధరలు పెరిగాయి. కొన్ని నెలల్లో మళ్లీ 10 శాతం పెరుగుదల కనిపించినప్పటికీ ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికా ఎన్నికలు, చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, మధ్య ఆసియాలో పరిస్థితులు, డాలరు విలువ, ముడిచమురు ధరలపై బంగారం ధర ఆధారపడి ఉంది. మొత్తం మీద ధర పెరుగుతుందని అనుకుంటున్నాం. మీద చెప్పిన ఇతర కారణాలూ ధరను ప్రభావితం చేస్తాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించినా ధరలు పెరుగుతాయి. కరోనా వైరస్ ప్రభావం దీనికి జతకలిసింది. కరోనా సంక్షోభం తొలగిపోతే ధరలు తగ్గే అవకాశం ఉంది. "

- సతీష్ అగర్వాల్, కుందన్ జ్యూవెల్లర్స్.

Last Updated :Mar 2, 2020, 1:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.