ETV Bharat / business

మళ్లీ టారిఫ్​ పెంపు.. ఎయిర్​టెల్​ కస్టమర్లకు మరింత భారం!

author img

By

Published : Feb 9, 2022, 11:01 PM IST

Airtel Tariff Hike: ఇప్పటికే టారిఫ్​ పెంచి టెలికాం ఛార్జీలను భారంగా మార్చిన ఎయిర్​టెల్.. కస్టమర్లకు మరో షాక్​ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 3-4 నెలల్లో మరోసారి ఛార్జీలను పెంచే అవకాశం ఉందని సంస్థ సీఈఓ వెల్లడించారు.

airtel
ఎయిర్​టెల్​

Airtel Tariff Hike: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ మరో షాక్‌కు సిద్ధమైంది. ఈ ఏడాదీ ఎయిర్‌టెల్‌ టెలికాం ఛార్జీల పెంపు ఉండొచ్చని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. అలాగే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలియజేశారు.

2022లో మరోసారి ఛార్జీల పెంపు ఉండొచ్చని.. రాబోయే 3-4 నెలల్లో ఈ పెంపు ఉండే అవకాశం ఉందని గోపాల్‌ తెలిపారు. అయితే, ఈ నిర్ణయం చందాదారుల వృద్ధి, పోటీతత్వంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) రూ.163గా ఉండగా, ఈ ఏడాది రూ.200కు చేరుతుందని తాము ఆశిస్తున్నామన్నారు.

ఎయిర్‌టెల్‌ గతేడాది నవంబర్‌లో 20 శాతం మేర ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. అక్కడికి కొద్ది రోజులకే వొడాఫోన్‌, జియో సైతం ఈ దారిలో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మూడో త్రైమాసికంలో ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున చందాదారులను కోల్పోయాయి. ఎయిర్‌టెల్‌ ఒక్కటే 6 లక్షల మందిని చేజార్చుకుంది.

ఈ ఏడాది 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మే-జూన్‌ మధ్య స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం గురించి గోపాల్‌ విఠల్‌ మాట్లాడారు. స్పెక్ట్రమ్‌ రిజర్వ్‌ ధర తక్కువగా ఉండాలని, చెల్లింపుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ చర్యలు చేపడుతోందని వివరించారు.

ఇదీ చూడండి : ఆ కార్ల ఇంజిన్​లో మంటలు.. 4.85లక్షల యూనిట్లు రీకాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.