ETV Bharat / business

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ఖజానాపై భారం ఎంతంటే?

author img

By

Published : Nov 4, 2021, 4:06 PM IST

వినియోగదారులకు ఊరటనిస్తూ పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఖజానాపై రూ.45 వేల కోట్ల భారం పడతుందని ఓ సంస్థ అంచనా వేసింది. ఆర్థిక లోటు 0.3 శాతం పెరుగుతుందని లెక్కగట్టింది.

PETROL prices
చమురు ధరలు

పెట్రోల్‌, డీజిల్​పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఖజానాపై దాదాపు రూ.45వేల కోట్ల భారం పడొచ్చని జపాన్​కు చెందిన బ్రోకరేజీ సంస్థ 'నోమురా' అంచనా వేసింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జీడీపీలో 0.45శాతం... అంటే రూ.1 లక్ష కోట్ల భారం పడుతుందని పేర్కొంది. అంతేగాక ఇది ద్రవ్య లోటు లక్ష్యాన్ని మించి ఉంటుందని తెలిపింది. ఇవేగాక.. తాజా నిర్ణయంతో ఖజానాపై పడే భారం గురించి నోమురా ఆర్థికవేత్తలు ఏమన్నారంటే..

  • ఇంతకుముందు 6.2 శాతంగా ఉన్న ఆర్థిక లోటు తాజా నిర్ణయంతో 6.5 శాతానికి చేరుతుంది. అయితే బడ్జెట్​ అంచనా ప్రకారం.. 6.8 శాతం లక్ష్యం కంటే ఇది తక్కువగానే ఉంటుంది.
  • ధరల తగ్గింపు కారణంగా వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ప్రత్యక్షంగా 0.14శాతం, పరోక్షంగా 0.3పాయింట్ల వరకు తగ్గే అవకాశముంది.
  • చమురు ధరల తగ్గింపుతో ప్రజల వినియోగం పెరిగి.. 2021-22లో అంచనా వేసిన 9.2 శాతం జీడీపీ వృద్ధికి దోహదం చేస్తుంది.

ఓటర్ల ప్రధాన ఆందోళనల్లో ఒకటైన ద్రవ్యోల్బణం పెరుగుదల.. రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిణమించిందని.. దీనితో వారి అసంతృప్తిని తగ్గించేందుకు ధరల తగ్గింపు సహాయపడుతుందని పేర్కొంది. అయితే.. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో పెరిగిన ఖర్చులు, ఇతర ఒత్తిళ్లు వంటివి ప్రభుత్వానికి సవాళ్లుగా ఉన్నాయని 'నోమురా' పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.