ETV Bharat / business

మూలధన వ్యయం పెంచండి: నిర్మలా సీతారామన్

author img

By

Published : Nov 15, 2021, 10:56 PM IST

Updated : Nov 16, 2021, 4:53 AM IST

నవంబర్​ నెలలో పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సి మొత్తాన్ని రెట్టింపు చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్​ తెలిపారు. ఈ నెల 22న ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

nirmala seetha raman
నిర్మలా సీతా రామన్​

ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పట్ల ఉన్న సానుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. మూలధన వ్యయం పెంచడంతోపాటు, భూసేకరణ, ఇతర సమస్యలను పరిష్కరించుకుని సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను నగదీకరించుకోవడంతోపాటు, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టి వనరులను పెంచుకోవాలని కోరారు. సోమవారం 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిగతా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా రెండో దశ ఉద్ధృతి తర్వాత దేశంలో ఆర్థిక పరిస్థితులు, అందివచ్చిన అవకాశాలను అందుకోవాల్సిన తీరు గురించి రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు.

"రెండో వేవ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది. ఎగుమతులు, దిగుమతులు, పీఎంఐ, తయారీ, డిజిటల్‌ చెల్లింపులు ఇప్పటికే మహమ్మారి ముందునాటి కాలానికి చేరుకున్నాయి. భారత్‌ వృద్ధిరేటుపైనా ప్రపంచవ్యాప్తంగా సానుకూల దృక్పథం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ రంగాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ అవకాశాన్ని రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకోవాలి. పెట్టుబడులు పెంచుకోవాలి. మూలధన వ్యయం కోసం గత బడ్జెట్‌లో రూ.5.54 లక్షల కోట్లు కేటాయించాం. అంతకుముందు సంవత్సరం కంటే ఇది 34.5% ఎక్కువ. దీనికితోడు రాష్ట్రాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు ఇందుకోసం మరో రూ.2 లక్షల కోట్లు కేటాయించాయి. వీటికితోడు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా రాష్ట్రాల కోసం ప్రకటించిన పథకం కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికే 15% వ్యయం సాధ్యమైంది. దానివల్ల 11 రాష్ట్రాలు రూ.15,271 కోట్ల అదనపు రుణ పరిమితి పొందాయి. ఇటీవల ప్రారంభించిన జాతీయ నగదీకరణ పైప్‌లైన్‌ పథకం కిందకు కేంద్ర ఆస్తులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులుకూడా వస్తాయి. రాష్ట్రాల్లో నగదీకరించుకొనే ఆస్తులు దండిగానే ఉన్నాయి. అందువల్ల వాటితో కొత్త మౌలికవసతుల కల్పన, ఇతర సామాజిక రంగాలకు అవసరమైన మూలధనాన్ని సమీకరించుకోవచ్చు. ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి చాలా రాష్ట్రాల్లో భూమి ప్రధాన సమస్యగా మారుతోంది. అందువల్ల రాష్ట్రాలు దృష్టిసారించి భూసేకరణ సున్నితంగా జరిగేలా చూడాలి. ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటుచేసి పెట్టుబడులను ఆకర్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. అక్కడ వనరుల సమీకరణ బాగా జరిగేలా చూసుకోవాలి. మౌలికవసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయంతోపాటు, సాంకేతిక సాయంకూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో సహకరించడానికి ఆర్థికశాఖ సిద్ధంగా ఉంది. ఆర్థికంగా లాభదాయకం కాకపోయినా సామాజికంగా అవసరమైన ప్రాజెక్టులకు వ్యయ సర్దుబాటు నిధి ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది" అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

ముందస్తుగా ఒక వాయిదా..

రాష్ట్రాలకు పన్ను వాటా పంపిణీ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో రూ.95,082 కోట్లు విడుదల చేయనుందని సీతారామన్‌ తెలిపారు. ఈ నెలలో చెల్లించాల్సిన వాయిదాతోపాటు ముందస్తుగా మరో వాయిదాను చేర్చి చెల్లిస్తామని, అందువల్ల రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని చెప్పారు. "అక్టోబర్‌ నెలకు సంబంధించి పన్ను వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రూ.1,923 కోట్లు, తెలంగాణకు రూ.999 కోట్లు అందాయి. నవంబర్‌ నెలలో ఈ మొత్తం రెట్టింపు అవనుంది" అని సీతారామన్‌ వెల్లడించారు.

ఆర్థిక మంత్రికి రాష్ట్రాల సూచనలు

  • పర్యావరణ, అటవీ అనుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన విధానం, మార్గదర్శకాలు జారీచేయాలి.
  • 'ఎకో-ఎకనామిక్స్‌' పంథాలో అటవీ, పర్యావరణ విషయాల్లో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి.
  • డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ పాలసీ వినియోగ విధానాన్ని పునఃసమీక్షించాలి. దాన్ని కేవలం ఒక జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకొనే వెసులుబాటు కల్పించాలి.
  • విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు, తీరప్రాంత రాష్ట్రాలన్నింటికీ వేగంగా అనుమతులు ఇవ్వాలి.
  • విభిన్న రకాల భూములను పారిశ్రామిక పార్కులుగా చట్టబద్ధంగా మార్చడానికి న్యాయపరమైన సమీక్ష నిర్వహించాలి.
  • వివాద పరిష్కార యంత్రాంగాన్ని, పోస్ట్‌ అవార్డ్‌ కాంట్రాక్ట్‌ అమలు విధానాన్ని బలోపేతం చేయాలి. పీపీపీ ప్రాజెక్టుల విధానం బలోపేతానికి నమూనా ఒప్పందాలు రూపొందించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలి.
  • రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌ విస్తరణ, క్రెడిట్‌-డిపాజిట్‌ రేషియోను జనాభా ప్రాతిపదికన పెంచాలి. ఒకవేళ కొత్త బ్యాంకింగ్‌ వ్యవస్థ లేకపోయినా, ఉన్న వ్యవస్థనే బలోపేతంచేసి అక్కడ మానవ వనరులు, ఇతర వసతులను పెంచి ఇబ్బందులను తొలగించాలి.
  • దేశవ్యాప్తంగా వ్యవసాయ ఆధారిత మౌలిక వసతులను పెంచాలి. జీఐ ల్యాబ్స్‌, శీతల గిడ్డంగులు, రైతు మార్కెట్లు పెంచాలి.

ఇదీ చూడండి: వరుసగా ఏడోసారి రెండంకెలపైనే టోకు ద్రవ్యోల్బణం

Last Updated :Nov 16, 2021, 4:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.