ETV Bharat / business

కరోనా వేళ బడ్జెట్​పై కేంద్రం కసరత్తు

author img

By

Published : Oct 4, 2020, 2:29 PM IST

వార్షిక బడ్జెట్ సన్నాహాలు మొదలుపెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు చేయాలని మంత్రిత్వ శాఖలకు ఇదివరకే సూచనలు చేసింది. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో కేంద్ర బడ్జెట్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Budget making exercise begins under the shadow of COVID-19
కరోనా వేళ.. బడ్జెట్ ప్రక్రియకు సన్నహాలు

2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. అక్టోబర్ 16న తొలి విడత ముందస్తు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేటాయింపులపై వివరాలు పంపించాలని మంత్రిత్వ శాఖలకు ఇదివరకే ఆదేశించింది. 2021-22కు సంబంధించి వ్యయాలు, పన్నేతర ఆదాయ వనరుల వివరాలను రూపొందించి.. బడ్జెట్ డివిజన్​కు అక్టోబర్ 9లోపు పంపించాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు చేయాలని మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ డివిజన్ సూచనలు చేసింది.

"ఈ సంవత్సరం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో బడ్జెట్ తుది కేటాయింపులు.. ఆర్థిక వ్యవస్థ పరిస్థితితో పాటు మంత్రిత్వ శాఖల సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి."

-రజత్ కుమార్ మిశ్రా, సంయుక్త కార్యదర్శి, ఆర్థిక శాఖ బడ్జెట్ విభాగం

కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతటినీ కుదిపేసి, ఆర్థిక వ్యవస్థలను తిరోగమన బాట పట్టించిన ఈ సమయంలో కేంద్రం బడ్జెట్​కు తుదిరూపు ఇవ్వనుంది. కొవిడ్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ దాదాపు 24 శాతం పతనమైంది. ఈ నేపథ్యంలో పద్దు కూర్పు ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ద్రవ్యలోటుపై ప్రభావం

బడ్జెట్​లో భాగంగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాలతో పాటు 2020-21 సంవత్సరానికి సవరించిన జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూ.30.42 లక్షల కోట్ల బడ్జెట్​ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం పన్ను వసూళ్లను రూ.16.36 కోట్లుగా అంచనా వేశారు. పన్నేతర ఆదాయాన్ని రూ.3.85 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్య లోటు 7.96 లక్షల కోట్లు లేదా జీడీపీలో 3.5 శాతంగా ఉంంటుందని అంచనా వేశారు.

అయితే కొవిడ్ కారణంగా ఆదాయం కోల్పోయిన కేంద్రం.. రూ.4.2 లక్షల కోట్లను అదనంగా రుణం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాలను మించిపోనుంది.

ఇదీ చదవండి- దారి తప్పిన పన్ను 'పరిహారం'.. ప్రభుత్వాల మధ్య అంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.