ETV Bharat / business

అమెజాన్​ ప్రకటనతో జోష్- బిట్​కాయిన్​ హై జంప్​

author img

By

Published : Jul 27, 2021, 5:13 PM IST

ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​.. అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్​కాయిన్ విలువ భారీగా పెరిగేందుకు కారణమైంది. అమెజాన్​ చేసిన ఓ ఉద్యోగ ప్రకటన ఇందుకు కలిసొచ్చింది. ఇంతకీ అమెజాన్ ప్రకటనలో ఏముంది? బిట్​కాయిన్ విలువ ఎంత పెరిగింది?

bitcoin Price high jump
భారీగా పెరిగిన బిట్​కాయిన్ విలువ

అతి పెద్ద క్రిప్టో కరెన్సీ బిట్​కాయిన్ విలువ మరోసారి రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, త్వరలోనే తమ ప్లాట్​ ఫామ్​పై క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు వీలు కల్పించొచ్చని వెలువడిన ఊహాగానాలు ఇందుకు కారణమయ్యాయి. అమెజాన్​పై ఈ అంచనాలతో బిట్​కాయిన్ విలువ సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) 14 శాతం పుంజుకుని.. ఇంట్రాడేలో దాదాపు 40 వేల డాలర్ల స్థాయికి చేరింది. చివరకు 37 వేల డాలర్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో బిట్​కాయిన్ తాకిన విలువ ఐదు వారాల గరిష్ఠ స్థాయి కావడం విశేషం.

అమెజాన్​పై ఊహాగానాలు ఎందుకు?

డిజిటల్​ కరెన్సీ, బ్లాక్​చైన్ ప్రోడక్ట్​ విభాగానికి వ్యూహ రచన, నేతృత్వం వహించే అధికారి కోసం చూస్తున్నట్లు అమెజాన్​ ఇటీవల ఓ పోస్ట్​ పెట్టింది. ఈ పోస్ట్​తో అమెజాన్ క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని.. ఊహాగానాలు పెరిగిపోయాయి. త్వరలోనే అమెజాన్ ప్లాట్​ఫామ్​పై క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వచ్చాయి. ఫలితంగా బిట్​కాయిన్​కు డిమాండ్ భారీగా పెరిగింది.

బిట్ కాయిన్ విలువ ఒక్క సారిగా పెరగటం.. ట్రేడర్లు కావాలని చేసిన పనిగా కూడా అంచనాలు ఉన్నాయి.

అయితే 'అమెజాన్ ప్రకటన ప్రకారం ఆయా విభాగాల్లో అనుభవమున్న ఉద్యోగుల కోసమేనని, దాని ఆధారంగా కంపెనీ క్రిప్టో కరెన్సీ విభాగంలోకి ప్రవేశిస్తుందని చెప్పలేం' అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎలాన్​ మస్క్, జాక్​ డోర్సీ వంటి ప్రముఖులు పెట్టుబడులు పెట్టడం, వివిధ దేశాల్లో క్రిప్టో కరెన్సీకి పెరిగిన డిమాండ్​తో.. బిట్​ కాయిన్ విలువ ఏప్రిల్​లో జీవితకాల గరిష్ఠమైన 65 వేల డాలర్ల మార్క్​ను తాకింది. ఇటీవల అది 30 వేల డాలర్లకు పడిపోయింది.

ఇదీ చదవండి:నగదు లావాదేవీలతో జాగ్రత్త- లేదంటే ఐటీ నోటీసులొస్తాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.