ఝున్‌ఝున్‌వాలా 'ఆకాశ ఎయిర్​'కు లైన్ క్లియర్​

author img

By

Published : Oct 12, 2021, 6:24 AM IST

Rakesh Jhunjhunwala

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్‌'కు (Rakesh Jhunjhunwala Airlines) పౌరవిమానయాన శాఖ నుంచి ఎన్‌ఓసీ లభించింది. 'ఆకాశ ఎయిర్‌' బ్రాండ్‌ కింద ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్‌' (Rakesh Jhunjhunwala Airlines) ప్రారంభం దిశగా మరో అడుగు పడింది. తాజాగా ఈ సంస్థకు పౌరవిమానయాన శాఖ నుంచి ఎన్‌ఓసీ లభించింది. 'ఆకాశ ఎయిర్‌' (Akasa Airlines) బ్రాండ్‌ కింద ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్(ఏఓపీ) కోసం ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌(డీజీసీఏ)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులు దక్కాక విమాన సేవలు ప్రారంభించవచ్చు! ఈ క్రమంలో 2022 వేసవిలో దేశవ్యాప్తంగా విమానాలు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

వచ్చే ఏడాది జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా..!

'పౌర విమానయానశాఖ ప్రోత్సాహం అందించడం, ఎన్‌ఓసీ మంజూరు చేయడంపై సంతోషంగా ఉంది. సంస్థ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతుల విషయంలో సంబంధిత అధికారులకు సహకరిస్తాం' అని ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే ఓ ప్రకటనలో తెలిపారు. 'దేశ పురోగతికి వాయు రవాణా వ్యవస్థ ప్రధానమని నమ్ముతున్నాం. ఈ నమ్మకమే.. ఆధునిక, సమర్థవంతమైన విమానయాన సంస్థను స్థాపించేందుకు ప్రేరేపించింది. దేశవాసులందరికీ వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా సేవలందిస్తాం. ఎందుకంటే చివరకు ఈ లక్షణమే ప్రజలను, సంస్కృతులను కలుపుతుంది. దేశవాసులు వారి కలలను సాకారం చేసుకునేందుకు సహాయపడుతుంది' అని వివరించారు. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది కొత్తగా రెండు విమానయాన సంస్థల సేవలు ప్రారంభం కానున్నాయి! ఆర్థిక సంక్షోభం కారణంగా 2019లో నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా 2022లో కొత్త ప్రమోటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఇదివరకు ప్రకటించింది.

ఇదీ చూడండి: టాటాకు అప్పగించే ముందే ఎయిర్​ ఇండియా అప్పుల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.