ETV Bharat / business

కరోనాతో మారిన లెక్క- సర్కారీ కొలువే శ్రీరామ రక్ష!

author img

By

Published : Jul 12, 2020, 12:41 PM IST

కరోనా తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకే యువత మొగ్గుచూపుతున్నట్లు ఓ సర్వే తెలిపింది. ముఖ్యంగా కొవిడ్ సంక్షోభంతో ప్రైవేట్ ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొనడం, వేతనాల కోతలు విధించడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉత్తమమని యువత భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది.

People prefer govt employment
ప్రభుత్వ కొలువులపై పెరిగిన మోజు

కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా యువత ఆలోచనల్లో ఉద్యోగం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. సంక్షోభం కారణంగా ప్రైవేటు సంస్థల్లో భారీగా ఉద్యోగాలు, వేతనాల కోతలు విధించిన నేపథ్యంలో.. చాలా మంది ప్రభుత్వ కొలువే శ్రీరామ రక్షగా భావిస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది.

పోటీ పరీక్షల ప్లాట్​ఫాం 'అడ్డా247' ఈ సర్వే చేసింది. 6,500 మంది యువత (18 నుంచి 30 ఏళ్ల వయస్సు) ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10 ప్రధాన పట్టణాల్లో సర్వే నిర్వహించగా.. ఇందులో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు పాల్గొనడం గమనార్హం.

ఎక్కువ వేతనం, ఉద్యోగ భద్రత కారణాలతో చాలా మంది ప్రభుత్వ కొలువులకే దరఖాస్తులు చేయడం, అందుకు సన్నద్ధమవ్వడం వంటివి చేస్తున్నట్లు సర్వే తెలిపింది. కరోనాకు ముందూ ఈ ధోరణి ఉన్నా.. ఇటీవల మరింత ఎక్కువైనట్లు పేర్కొంది.

సర్వేలో ముఖ్యాంశాలు..

  • ప్రభుత్వ ఉద్యోగాల డిమాండ్ దిల్లీలో ఎక్కువగా ఉంది. ఇక్కడ సర్కారీ కొలువే నయమనుకునే యువత 11.04 శాతం ఉండగా ... ఆ తర్వాతి స్థానంలో పట్నా (11.03 శాతం) ఉంది.
  • సర్వేలో పాల్గొన్న వారిలో 64.77 శాతం మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి కొలువుల్లో రెండింటికీ ప్రాధాన్యమిస్తున్నారు.
  • 28 శాతం మంది జాతీయ స్థాయి ఉద్యోగాలవైపే మొగ్గుచూపుతున్నారు. 6.5 శాతం మంది రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలనే ఇష్టపడుతున్నారు.

పెరిగిన దరఖాస్తులు..

కరోనా సంక్షోభం తర్వాత ఉద్యోగాల కోసం దరఖాస్తులు భారీగా పెరిగినట్లు క్వికర్ జాబ్స్​ నివేదిక తెలిపింది. కొవిడ్ ముందుతో పోలిస్తే ఇప్పుడు సగటున ఒక ఉద్యోగం కోసం దరఖాస్తుల రేటు 48 శాతం పెరిగినట్లు సర్వే పేర్కొంది. మెట్రో నగరాల్లోనే ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

job applications rise
ఉపాధికోసం పెరిగిన దరఖాస్తులు

క్వికర్ జాబ్స్ నివేదిక ముఖ్యాంశాలు..

  • జనవరి నుంచి మార్చి 15 వరకు కరోనా సంక్షాభానికి ముందు.. మార్చి 16 నుంచి మే చివరి వరకు కరోనా తర్వాత వచ్చిన ఉద్యోగ దరఖాస్తుల ఆధారంగా నివేదికను రూపొందించింది క్వికర్ జాబ్స్​.
  • అత్యధికంగా డేటా ఎంట్రీ (115 శాతం), డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ (139 శాతం), డ్రైవింగ్ (122 శాతం), టీచర్​ (108 శాతం), మార్కెటింగ్ (179 శాతం ), సేల్స్ (187 శాతం) ఉద్యోగాలకు దరఖాస్తులు పెరిగాయి.
  • అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తులు 65 శాతం తగ్గాయి.

ఇదీ చూడండి:పదివేలతో మొదలై.. ఐదు కోట్లకు చేరిన ఈమె తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.