ETV Bharat / business

జాక్​మాపై చైనా ఆంక్షల కొరడా- భారీగా జరిమానా

author img

By

Published : Apr 10, 2021, 9:50 AM IST

Updated : Apr 10, 2021, 11:39 AM IST

చైనా ప్రభుత్వానికి సలహాలివ్వబోయి చిక్కుల్లో ఇరుక్కున్న చైనా ఈ-కామర్స్​ దిగ్గజం అలీబాబా, యాంట్‌ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్‌ మాను.. డ్రాగన్‌ అంత తేలిగ్గా వదిలిపెట్టేట్లు లేదు. ఇప్పటికే పలు విధాలుగా జాక్‌ మాను ఇబ్బంది పెడుతున్న చైనా ప్రభుత్వం.. తాజాగా మరోసారి అలీబాబా సంస్థపై ఆంక్షల కొరడా ఝుళిపించింది. నియంత్రణ పేరుతో జాక్‌మా సంస్థపై చైనా భారీ జరిమానా విధించింది.

Alibaba fined USD 2.8 billion on competition charge in China
అలీబాబాకు 2.8 బిలియన్​ డాలర్ల జరిమానా

పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది ఇప్పుడు అలీబాబా గ్రూప్‌ పరిస్థితి. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, అపరకుబేరుడు జాక్‌ మా ఏ ముహూర్తాన నోరుజారారో గానీ.. అప్పటి నుంచి ఆయనను, కంపెనీని కష్టాలు చుట్టుముట్టాయి. ఆయనపై ప్రతీకార చర్యలు ఆరంభించిన డ్రాగన్‌ సర్కారు.. తొలుత యాంట్‌గ్రూప్‌ ఐపీవోను అడ్డుకుంది. ఆ తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ నిబంధనలు నెత్తిన రుద్దింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ అమాంతం పడిపోయింది.

కుబేరుల్లో అగ్రస్థానాన్నీ కోల్పోవాల్సి రావడమేగాక, బాహ్య ప్రపంచానికీ జాక్‌మా కన్పించలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఏకంగా నియంత్రణ పేరుతో జరిమానా రూపంలో అలీబాబాపై భారీ భారాన్నే మోపింది చైనా. గుత్తాధిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ ప్రపంచ దిగ్గజ ఇ-కామర్స్‌ సంస్థపై ఏకంగా 2.8 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది.

అలీబాబా గ్రూప్‌ ఇతర సంస్థల నుంచి తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోందని చైనా మార్కెట్‌ రెగ్యులేషన్‌ ఆరోపించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 18.3 బిలియన్‌ యువాన్ల(2.8బిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో(455.712 బిలియన్‌ యువాన్లు) దాదాపు 4 శాతానికి సమానం కావడం గమనార్హం.

జాక్​ మాకి మాత్రమే..

వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ పరిశ్రమలపై మరింత నియంత్రణలో భాగంగా చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ గతంలో యాంటీ మోనోపలీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది దీనిపై మరింత దృష్టిపెట్టి ఇప్పటికే పలు టెక్‌ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది. టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, వీ-చాట్‌ వంటి సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే జాక్‌మాతో విరోధం కొనసాగుతున్న సమయంలో అలీబాబాకు ఇంతటి భారీ స్థాయిలో జరిమానా విధించడం గమనార్హం.

అప్పటి నుంచి చిక్కులు..

గతేడాది అక్టోబరు 24న చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపడంతో జాక్‌ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని జాక్‌ మా హితవు పలికారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ చైనా అగ్రనాయకత్వం‌ ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, 37 బిలియన్‌ డాలర్లు విలువచేసే యాంట్‌ గ్రూప్‌ ఐపీవోను అడ్డుకొంది. చైనా విడుదల చేసిన టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా ఆయనను పక్కనబెట్టేసింది. ఈ పరిణామాల తర్వాత జాక్‌ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన అదృశ్యంపై పలు అనుమానాలు తలెత్తాయి. కానీ, కొద్ది వారాల తర్వాత వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. అలాగే చైనా కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కూడా కోల్పోయారు.

ఇవీ చదవండి: మీడియాలో వాటా విక్రయానికి జాక్​ మాపై చైనా ఒత్తిడి!

జాక్​మాకు చైనా షాక్- అలీబాబా జాతీయం?

Last Updated :Apr 10, 2021, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.