ETV Bharat / briefs

ఏపీ, తెలంగాణలో కొవిడ్ -19 సహాయక చర్యలకు రిలయన్స్ మద్దతు

author img

By

Published : May 17, 2021, 8:01 PM IST

కొవిడ్​కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతును అందించనుంది. ఇందులో భాగంగా కొవిడ్​ సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్స్‌లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనాన్ని అందించనున్నాయి.

Telangana news
కొవిడ్​ కట్టడికి రిలయన్స్​ తోడు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కొవిడ్​ సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉయోగించే అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రిలయన్స్​ పెట్రోలు బంకుల్లో ఉచితంగా ఇంధనం అందించనున్నాయి.

ఇందుకోసం సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్ఠంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తాయి. ఈ సదుపాయం జూన్ 30 వరకు వర్తిస్తుంది.

మరోవైపు ఆక్సిజన్ కొరత సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు తెలంగాణకు 80 టన్నులు, ఆంధ్రప్రదేశ్​కు మరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్​ను రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్‌నగర్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్లకు ఆదివారం నాటికి చేరవేసింది.

కొవిడ్​పై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిలయన్స్ కుటుంబం చేతులు కలిపింది. మహమ్మారితో చేస్తున్న పోరాటంలో దేశం విజయం సాధించేలా చేసేందుకు క్షేత్రస్థాయిలో బహుముఖ విధానాలతో కార్యక్రమాలను రిలయన్స్ చేపట్టింది. కరోనా సమయంలో భారతీయుల కష్టాలను తొలగించేందుకు నిర్విరామంగా ప్రయత్నించింది. వైరస్ కలిగించిన ముప్పును అధిగమించేందుకు తన వనరులు, మానవశక్తి, ఉపకరణాలు...అన్నిటినీ రిలయన్స్ ఉపయోగిస్తోంది.

రిలయన్స్ 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్​ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది దేశ ఆక్సిజన్ ఉత్పత్తిలో 11 శాతం, ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దానితో సమానం. దీనికి రిలయన్స్ అండగా నిలిచింది. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ రవాణాను సులభతరం చేసేందుకుగాను రిలయన్స్ 32 ఐఎస్ఒ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది.

రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో కొవిడ్​ కట్టడికి ఆది నుంచి సాయం అందిస్తోంది. మొట్టమొదటి కొవిడ్ కేర్ ఆస్పత్రిని కేవలం రెండు వారాల్లోనే ఏర్పాటు చేసింది. మిషన్ అన్న సేవను ప్రారంభించింది. ఇప్పటి వరకూ 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి 5.5 కోట్ల మందికి పైగా భోజనాలను సమకూర్చింది.

ఇదీ చూడండి: మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.