ETV Bharat / briefs

జీవితపు అర్థాన్ని నేర్పిన నాన్నే నా హీరో...!

author img

By

Published : Jun 16, 2019, 9:21 AM IST

Updated : Jun 17, 2019, 6:00 AM IST

FATHERS DAY SPECIAL STORY

నీకు అమ్మ ఇష్టమా... నాన్న ఇష్టమా అని పిల్లలనడిగితే... చెప్పటానికి కొంచెం ఇబ్బందిపడ్డా... అమ్మ వైపే మొగ్గు చూపుతారు. నాన్నంటే ఇష్టం లేక కాదు... కొంచెం భయం... ఇంకొంచెం గౌరవం... మరికొంచెం మొహమాటం. కార్లలో తిప్పకపోయినా... కోట్ల ఆస్తి ఇవ్వకపోయినా... మన గెలుపు కోసం ఎన్నోసార్లు ఓడిపోయి మురిసిపోయే ప్రతీ నాన్న హీరోనే మరి...!

పాదర్స్ డే పై ప్రత్యేక కథనం

జన్మనిచ్చేది అమ్మ అయితే... బతుకునిచ్చేది నాన్న...!
నడక నేర్పేది అమ్మ అయితే... నడత నేర్పేది నాన్న...!
ఇష్టాయిష్టాలు పంచుకునేది అమ్మతో అయితే... మన ఇష్టాలు నేరవేర్చేది మాత్రం నాన్నే...!
గొరుముద్దలతో కడుపు నింపేది అమ్మ అయితే... ఆ ముద్ద కోసం శ్రమించేది నాన్న...!
మనం సుఖంగా నిద్రపోయేందుకు తాను కునుకు లేకుండా కష్టపడే కార్మికుడే నాన్న...!
తాను చేసే కష్టం మన దరికి చేరకూడదని ప్రతీక్షణం తపించే వాడు నాన్న...!
కళ్లలోని ప్రేమను గుండెలోనే దాచుకునే అమాయక చక్రవర్తి నాన్న...!
పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని తన సర్వస్వాన్ని దారపోసే స్వార్థపరుడు నాన్న...!
కరుకుగా మాట్లాడినా... కఠినంగా వ్యవహరించినా... నిత్యం నా క్షేమం కోరుకునే నాన్నే నా హీరో...!


కుటుంబ నావికుడిగా...

అవును... నాన్న ప్రతీ ఒక్కరి జీవితంలో రియల్​ హీరో... మనం ఈ లోకంలోకి వచ్చింది మొదలు... తాను ఈ లోకం విడిచి వెళ్లేవరకు... మన సుఖం కోసం ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఏకైక వ్యక్తి నాన్న. తన పిల్లల దృష్టిలో తానొక హీరోలా ఉండాలనేది ఆయన కోరిక. దాని కోసం ఎన్ని కష్టాలొచ్చినా ముఖంలో ఆ బాధను చూపించకుండా కుటుంబాన్ని నడిపించే నావికుడవుతాడు నాన్న.

రెండు తగిలించి మరీ...

చిన్నప్పుడు అమ్మతోనే అన్నీ నేర్చుకుంటాం... ఎందుకంటే మనకు బతుకిచ్చేందుకు నాన్న సమాజంతో పోరాడుతూ బిజీగా ఉంటాడు కాబట్టి. నడక నేర్చుకునేటప్పుడు అడుగులు తడబడుతుంటే అమ్మ సరిచేస్తుంది. అదే పెద్దయ్యాక తడబడితే... నాన్న రెండు తగిలిస్తాడు. ఎందుకంటే తన పిల్లలు సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు... మరి అదే సమాజం వేలెత్తి చూపిస్తే ఎలా తట్టుకుంటాడు. అందుకే కొంచెం కఠువుగా చెప్తాడు!

జీవితం విలువ నేర్పుతూ...

తాను చెమటతో తడిసిన బట్టలేసుకుని... మనకు రంగురంగుల బట్టలు కొనిస్తాడు. తనకు తలకు మించిన భారమని తెలిసినా... మంచి చదువు చెప్పిస్తాడు. మన ఇష్టాలను అమ్మ ద్వారా తెలుసుకుని... ఎంతటి కష్టాన్నైనా భరించి మనకు ఆనందాన్ని పంచుతాడు. ముఖంలో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ... గుండెల్లో ప్రేమను దాచుకుంటూనే జీవితం విలువ నేర్పిస్తాడు. చిన్నప్పటి నుంచి మనం ఏ చిన్న పని చేసినా కళ్లతోనే మురిసిపోతాడు. ప్రతీ పనిలో నీ వెనక నేనున్నాననే ధైర్యమిస్తాడు. కావాలన్న ప్రతీది ఇవ్వకపోయినా... ఇచ్చే ప్రతీది మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేదై ఉండాలని ఆలోచిస్తాడు. అన్ని దశల్లోనూ మంచి చెడులను విశ్లేషిస్తూ... మార్గదర్శకుడవుతాడు. తప్పు చేస్తే కొంచెం కఠినంగా వ్యవరించినా... తప్పొప్పుల ఫలితాలు వివరిస్తూ... జీవితపు విలువ నేర్పే గురువవుతాడు. తన ఆశలను మన ద్వారా నేరవేర్చుకుని గర్వపడే ఆశాజీవి నాన్న. చుట్టూ ఉన్న వాళ్లు 'మీ కొడుకు గొప్పవాడయ్యాడు' అనే మాటలు విని ముల్లోకాలు గెలిచిన వాడిలా గర్వంతో తలెత్తుకుని 'వాడు నా కొడుకు' అని చెప్పుకునే వ్యక్తి నాన్న.

కష్టాలకు ఎదురునిలుస్తూ... గెలుస్తూ...

ప్రతీ దశలో నాన్న ఎదుర్కొన్న ఒడుదొడుకులనే జీవితపాఠాలుగా చెప్తూ... ప్రతీ విపత్కర సందర్భంలో తన ఆత్మస్థైర్యంతో.. ప్రతీ బాధను చిరునవ్వుతో స్వాగతించే తన మనోనిబ్బరంతో... ఎలాంటి పరిస్థితులొచ్చినా... ఎదురొడ్డి నిలిచి గెలిచి ఈ సమాజానికి చూపించాలని చెప్పే మాటలతో నా మార్గాన్ని నిర్మించిన నాన్నే.... నా హీరో...!

ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

Intro:Body:Conclusion:
Last Updated :Jun 17, 2019, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.