ETV Bharat / bharat

నాడు జవాన్​ను కాపాడింది.. నేడు రాజకీయాల్లోకి వస్తోంది

author img

By

Published : Dec 7, 2020, 10:10 AM IST

Woman who saved CISF jawan's life marries him,contesting local body polls in Kerala
సైనికుడిని కాపాడి.. ఎన్నికల్లో బరిలో నిలిచి..

ఛత్తీస్​గఢ్​కు చెందిన నర్సింగ్ విద్యార్థిని ఆమె. ఓ సైనికుడిని కాపాడి కేరళ కోడలిగా అడుగుపెట్టింది. ఇప్పుడు.. అదే కేరళ నుంచి రాజకీయాల్లోకి వస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తన కథ తెలిసిన కేరళ వాసులంతా ఆమెను ఎంతగానో ఆదరిస్తున్నారు.

ప్రమాదంలో ఓ సైనికుడిని కాపాడిన ఛత్తీస్​గఢ్​కు చెందిన జ్యోతి(30).. ఇప్పుడు కేరళ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. డిసెంబర్​ 7న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తోంది.

2010, జనవరి 3.. జ్యోతి జీవితంలో ఓ కీలకమలుపు. ఆరోజు జరిగిన ఓ ఘటన వల్ల తన చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. తన చేతికి అయిన గాయమే దానికి కారణం. తన తల్లిదండ్రుల కోపాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఓ కొత్త ప్రేమనూ సంపాదించుకుంది.

ట్రక్కు ఢీ కొట్టబోతుండగా...

బీఎస్సీ నర్సింగ్ నర్సింగ్​ చదువుతున్న ఆమె రోజులాగే... ఆరోజు కూడా కళాశాల నుంచి ఇంటికి బస్సులో వెళుతోంది. తన ముందు సీట్లో కేరళకు చెందిన వికాస్​ అనే ఓ జవాను కూర్చున్నాడు. దంతెవాడ జిల్లాలో క్యాంపునకు తిరిగి వస్తున్నాడు అతడు. ఆ సమయంలో బస్సు కిటికీకి తల ఆనించి నిద్రపోయాడు. ఈలోగా బస్సును ఓ భారీ ట్రక్కు డీకొట్టబోతుండంటం గ్రహించింది జ్యోతి. వెంటనే అప్రమత్తమై వికాస్​ను పక్కకు లాగి.. ప్రాణాపాయం నుంచి తప్పించింది. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రంగా గాయమైంది. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమెపై తల్లిదండ్రులు కోప్పడ్డారు.

ఈ క్రమంలోనే వికాస్​, జ్యోతి మధ్య పరిచయం పెరిగింది. అది ప్రేమగా మారింది.

అదే చాలు..

కేరళకు తిరిగివచ్చి వికాస్​ను పెళ్లి చేసుకుంది జ్యోతి. ఏడాది తర్వాత వారి వివాహాన్ని అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. మలయాళాన్ని పూర్తిగా నేర్చుకున్న ఆమె.. ప్రస్తుతం పాలక్కడ్​ జిల్లా కొల్లన్​గోడెలోని పాలతుల్లి డివిజన్​ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీలోకి దిగుతోంది. అయితే.. తన రాజకీయ ప్రవేశం కూడా ఊహించకుండా జరిగిపోయిందని అంటోంది జ్యోతి. తనకు ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెబుతోంది.

"నరేంద్ర మోదీ రాజకీయాల పట్ల నేను ఆకర్షితురాలినయ్యాను. అదే సమయంలో పార్టీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే అంగీకరించాను. నా భర్త, అత్తింటి నుంచి నాకు పూర్తి మద్దుతు అందుతోంది. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. వారు నాకు ఓటు వేసినా, వేయకపోయినా.. నాపై మాత్రం ప్రేమాభిమానాలను చూపిస్తున్నారు."

-- జ్యోతి

జ్యోతి కథ తమ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న 1700 మంది అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందని కేరళ భాజపా చెబుతోంది.

ఇదీ చూడండి:'కరోనా ప్లాన్​'తో భర్తనే కిడ్నాప్​ చేయించిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.