ETV Bharat / bharat

రజనీ 'రాజకీయ' ప్లాన్​ కొనసాగుతుందా?

author img

By

Published : Dec 27, 2020, 4:28 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​.. ఈ నెల 31న తన రాజకీయ రంగప్రవేశంపై కీలక విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఈ తరుణంలో అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం రజనీ డిశ్చార్జ్​ అయినప్పటికీ.. వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, ఒత్తిడికి గురిచేసే పనులేవీ పెట్టుకోవద్దని ఆయనకు వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాల విషయంలో రజనీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

Superstar Rajinikanth discharged from hospital
రజనీ 'రాజకీయ' ప్లాన్​ కొనసాగుతుందా?

తన రాజకీయ పార్టీ గురించి ఈ నెల 31న అన్ని వివరాలను వెల్లడిస్తానని సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఇప్పటికే ప్రకటించారు. ఆ క్షణం నుంచి ఆయన అభిమానులు, రాజకీయ విశ్లేషకులు రజనీ పార్టీ ప్రకటన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనారోగ్యంతో రజనీ హైదరాబాద్​లోని అపోలో ఆసుపత్రిలో చేరడం.. వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చికిత్స పొంది డిశ్చార్జ్​ అయినప్పటికీ.. అనుకున్న సమయానికి రజనీ ప్రజల ముందుకు వస్తారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఆసుపత్రి వర్గాలు ఆయనకు ఇచ్చిన సూచనలే ఇందుకు కారణం.

పూర్తిగా విశ్రాంతి..

ఆదివారం రజనీని వైద్యులు డిశ్చార్జ్​ చేసినప్పటికీ.. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక సూచనలు చేశారు. రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఒత్తిడి పెంచే, శరీరానికి సంబంధించిన పనులకు రజనీ పూర్తిగా దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అదే సమయంలో కొవిడ్​-19 సోకే అవకాశాలున్న కార్యకలాపాలను సాగించవద్దని రజనీకి వైద్యులు కౌన్సిలింగ్​ ఇచ్చినట్టు అపోలో హాస్పిటల్స్​ ఓ ప్రకటనను విడుదల చేసింది.

మరి ఈ పరిస్థితుల్లో రజనీకాంత్​ వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వైద్యుల సూచనలను పక్కనపెట్టి.. ఆయన పార్టీని ప్రకటించి, ముందుకు సాగుతారా? లేక పార్టీకి సంబంధించిన విషయాలను కొన్ని రోజులు వాయిదా వేస్తారా? అన్నది కీలకంగా మారింది.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.