ETV Bharat / bharat

'వాంఖడే ఇంటికి వారెందుకు?... రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం'

author img

By

Published : Nov 1, 2021, 12:29 PM IST

ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే ఇంటికి.. జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ వెళ్లడానికి కారణాలేంటని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik news) ప్రశ్నించారు. ఎలాంటి దర్యాప్తు నిర్వహించకుండానే వాంఖడేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని అడిగారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.

WANKHEDE NAWAB MALIK
'వాంఖడే ఇంటికి వారెందుకు?... రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం'

జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్దార్.. ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede news) నివాసానికి వెళ్లడంపై మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్ మాలిక్ (Nawab Malik news) స్పందించారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం విషయంలో వాంఖడేకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో అరుణ్ హల్దార్​పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ముంబయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మాలిక్... వాంఖడే ఇంటికి హల్దార్ వెళ్లడం వల్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.

"జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్, భాజపా నేత అరుణ్ హల్దార్ నిన్న వాంఖడే ఇంటికి వెళ్లారు. ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన ముందు దర్యాప్తు నిర్వహించి, సవివర నివేదిక అందించాల్సింది. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. వాంఖడేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ఎందుకంత తొందరపడుతున్నారు. ఆరోపణలపై దర్యాప్తు జరగకుండానే ఇదంతా చేయడానికి కారణమేంటి?"

-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి

ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసును (Cruise Drug Case) వాంఖడే దర్యాప్తు చేస్తున్నారు. ఈయనపై నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగంలోకి వచ్చారని అంటున్నారు. ముస్లింగా పుట్టిన వాంఖడే.. ఫోర్జరీ ద్వారా ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారని ఆరోపిస్తున్నారు.

వీటిని వాంఖడే ఖండిస్తున్నారు. ఆరోపణలపై విచారణకు సిద్ధమని ప్రకటించారు.

ఇదీ చదవండి: ముంబయి డ్రగ్స్ కేసుపై సుప్రీంలో పిల్.. ఎందుకంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.