ETV Bharat / bharat

కలిసి ఉండటం ఇష్టం లేక భర్తపై ఆరోపణలు.. కూతురితో సంబంధం పెట్టుకున్నాడని..

author img

By

Published : Feb 6, 2023, 3:07 PM IST

ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ భార్య తన భర్తపై నిరాధారమైన ఆరోపణలు చేసి గ్రామస్థుల ముందు పరువు తీసింది. తన మొదటి భార్య కుమార్తెతో అతడు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని నిందిస్తూ గ్రామ పెద్దల ముందు పంచాయతీకి దిగింది. చివరకు ఇదంతా కావాలనే చేసిందని తేల్చిన పోలీసులు ఆమెతో భర్తకు క్షమాపణ చెప్పించారు. ఈ ఘటన రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని పఖంజుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

Wife Insulted Husband In Chattisgarh
ఛత్తీస్​గఢ్​లో భర్తను అవమానించిన భార్య

ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో ఓ భార్య చేసిన పనికి భర్త ఆత్మహత్యకు యత్నించాడు. మొదటి భార్య కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ గ్రామంలో అతడి పరువు తీసింది రెండో భార్య. దీంతో అతడిని పంచాయతీకి పిలిచి తీవ్రంగా హింసించారు గ్రామపెద్దలు.

వివరాల్లోకి వెళ్తే..
కాంకేర్​లోని పఖంజుర్ గ్రామానికి చెందిన నిర్మల్​కు ఇదివరకే పెళ్లయింది. మొదటి భార్యతో అతడికి 19 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం ఇతడి మొదటి భార్య చనిపోయింది. దీంతో 8 నెలల క్రితం మరో మహిళను వివాహం చేసుకున్నాడు నిర్మల్​. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా రెండో భార్య నిర్మల్​తో ఉండేందుకు ఇష్టపడలేదు. ఎలాగైనా భర్త నుంచి విడిపోవాలని ప్లాన్ వేసింది. చివరకు నిర్మల్​ను బలిపశువును చేసింది. ఏకంగా సొంత కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.

అంతేగాక ఇదే విషయమై గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టింది. గ్రామ సభకు రావడానికి ఆమె భర్త నిరాకరించాడు. నిర్మల్​ తాను ఉంటున్న గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాడు. ఇది తెలుసుకున్న గ్రామంలోని 20 మందికిపైగా యువకులు అతడు ఉంటున్న ఇంట్లోకి చొరబడి నిర్మల్​తో పాటు స్నేహితుడిపై దాడికి దిగారు. అనంతరం ఇద్దరిని గ్రామ సభ జరిగే చోటుకు బలవంతంగా లాక్కెళ్లారు. ఈ సమయంలో పోలీసులకు ఫోన్​ చేసి తమను కాపాడాలంటూ వేడుకున్నాడు నిర్మల్​. ఆ దాడి నిజమో కాదో అని తేల్చేందుకు ముందు ఘటనను వీడియో తీసి పంపమని ఓ పోలీస్​​ అడిగాడు.

ఈలోపే నిర్మల్​తో పాటు అతడి స్నేహితుడిని లాక్కెళ్లారు స్థానికులు. నేరం రుజువు కాకముందే తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితుడి మెడలో బూట్ల దండను వేసి క్షమాపణలు చెప్పించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని.. తమకేమీ పట్టనట్లుగా కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోయారు. అయితే అతడితో కలిసి ఉండటం రెండో భార్యకు ఇష్టం లేనందునే ఇటువంటి నింద మోపిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. చివరికి.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భార్య చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని తేల్చారు. అనంతరం భార్యతో గ్రామస్థుల ముందు తన భర్తకు క్షమాపణలు చెప్పించారు పోలీసులు. భార్యభర్తలిద్దరికీ కౌన్సెలింగ్​ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడం వల్ల నిర్మల్​ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న బంధువులు అతడిని కాపాడి ఇంటికి తీసుకొచ్చారు.

వీడియో తీయమన్నవారిపై చర్యలు తీసుకుంటాం..
దాడి జరుగుతున్నప్పుడు బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా వీడియో తీసి పంపమని అడిగిన వ్యక్తి ఎవరో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేశామని.. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని పఖంజుర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి మోర్ధ్వాజ్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.