ETV Bharat / bharat

2022 ఎన్నికలకు కాంగ్రెస్ స్కెచ్- అందుకే చరణ్​జీత్!

author img

By

Published : Sep 19, 2021, 10:08 PM IST

కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా (Amarinder Singh resigns) చేసిన 24 గంటల్లోనే కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్ కొత్త సీఎం పేరును ప్రకటించింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జీత్‌కు పట్టం కట్టింది. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

Sonia, Rahul back Channi as replacement of Captain
2022 ఎన్నికలకు కాంగ్రెస్ స్కెచ్- అందుకే చరణ్​జీత్!

అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ రాజీనామా (Amarinder Singh resigns) చేసిన 24 గంటల్లోపే కొత్త సీఎం పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. సునీల్‌ జాఖడ్‌, సుఖ్‌జీందర్‌సింగ్‌ రంధ్వా, రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌ వంటి సీనియర్‌ నేతలను కాదని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరణ్‌జీత్‌కు (Charanjit Singh Channi) కాంగ్రెస్‌ పట్టం కట్టింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని (charanjit singh channi cast) పంజాబ్‌కు తొలిసారి సీఎంగా చేసింది. మెజార్టీ స్థాయిలో ఉన్న ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు సిద్ధూతో (Navjot Singh Sidhu) కలుపుకొని పోయే నాయకుడైతేనే వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేరుస్తారన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

పంజాబ్‌లో ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాట్‌ సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే సీఎం అవుతూ వస్తున్నారు. దాదాపు 20 శాతం మంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. రాష్ట్రంలో 32 శాతానికి (Punjab SC population) పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ వారికి రాజకీయంగా ప్రాధాన్యం అంతంత మాత్రమే. ఆ సామాజిక వర్గానికి చెందిన వారెవరూ సీఎం పదవిని అలంకరించలేదు. ఇప్పటికే ఆ వర్గం ఓటర్లలో ఒకింత అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఎస్సీ ఓటర్లను ఆకర్షించేందుకు బీఎస్పీతో అకాలీదళ్‌ జట్టు కట్టింది. రైతుల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఎస్సీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భాజపా సైతం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తానని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి సవాల్‌ విసరాలన్నా ఇదే మంచి నిర్ణయమని భావించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన చరణ్‌జీత్‌ సింగ్‌ పేరును కాంగ్రెస్‌ ప్రకటించింది.

సీన్‌ రిపీట్‌ కాకుండా..

రాష్ట్రంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు భవిష్యత్‌లో కూడా కొనసాగకూడదన్న ఉద్దేశం కూడా చరణ్‌జీత్‌ పేరు ప్రకటించడానికి మరో కారణంగా తెలుస్తోంది. అమరీందర్‌, సిద్ధూ మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పటికే కొంతమేర పార్టీకి నష్టం చేకూర్చాయన్నది అధిష్ఠానానికి ఉన్న సమాచారం. ఈ క్రమంలో తొలుత సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా పేరు బలంగా వినిపించినప్పటికీ ఈ కారణం చేతనే అధిష్ఠానం వెనక్కి తగ్గిందని తెలిసింది. సీఎం ఎవరైనా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సుఖ్‌జిందర్‌ కూడా సీనియర్‌ నాయకుడు కావడంతో సిద్ధూతో పొరపొచ్చాలు తలెత్తే అవకాశం ఉందని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. అందుకే సిద్ధూతో కలుపుకొంటూ పోయే వ్యక్తి అయితేనే మంచిదని అతడికి సన్నిహితుడైన చన్నీని పేరును పార్టీ ఖరారు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి అమరీందర్‌ కాదని యువరక్తంతో ఎన్నికలకు వెళ్లాలన్న కాంగ్రెస్‌ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే!

ఇదీ చదవండి:

పంజాబ్​ నూతన సీఎం ఆయన కాదు

పంజాబ్ కొత్త సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.