ETV Bharat / bharat

పెద్దలసభకు 'సమయం' నేర్పిన నేత.. పారదర్శకతకు పెద్దపీట

author img

By

Published : Aug 7, 2022, 7:23 AM IST

Venkaiah Naidu
Venkaiah Naidu

పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. పెద్దలసభ నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి.. అతి తక్కువ ఉత్పాదకతతో పనిచేస్తున్న సభకు పునరుత్తేజాన్ని తెచ్చారు. ఆయన హయాంలో రాజ్యసభ పనితీరు, ఎదురైన సవాళ్ల గురించి ప్రత్యేక కథనం..

పదవీకాలం ముగియవచ్చిన రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు గత ఐదేళ్లలో సభకు సమయం నేర్పారు. సభ, స్థాయీసంఘాలు ఎన్ని రోజులు ఎంతసేపు పని చేశాయన్న లెక్కలు తీసి జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. సభ నిర్వహణలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అతి తక్కువ ఉత్పాదకతతో పనిచేస్తున్న సభకు పునరుత్తేజాన్ని తెచ్చారు. గత బడ్జెట్‌ సమావేశాల వరకు 13 సెషన్స్‌కు ఆయన నేతృత్వం వహించారు. తొలి 5 విడతల సమావేశాలు 6.80% నుంచి 58.80%, తదుపరి ఎనిమిది మాత్రం 76 నుంచి 105% ఉత్పాదకతతో పనిచేశాయి.

అడ్డంకులు సృష్టించిన అంశాలేంటి?
వెంకయ్యనాయుడి హయాంలో 58 అంశాలు సభ కార్యకలాపాలకు ప్రధాన అడ్డంకిగా మారి వాయిదాకు దారితీశాయి. 57% సిట్టింగ్స్‌ని పాక్షికంగానో, పూర్తిగానో వాయిదా వేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం నాలుగు సమావేశాల్లో 36 రోజుల పాటు సభ కార్యకలాపాలను అడ్డుకుంది. 2018 బడ్జెట్‌ సమావేశాల్లో అత్యధికంగా 24 సార్లు ఇది సభ స్తంభించిపోవడానికి దారితీసింది. సాగు చట్టాలు, పెగాసస్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌, కావేరీ జల యాజమాన్య బోర్డు, 2021 శీతాకాల సమావేశాల్లో 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం వంటివి వెంకయ్యనాయుడి హయాంలో వివాదాస్పదంగా మారాయి. ఆయన పదవీకాలంలో 78% మంది సభ్యులు రోజువారీగా సభకు వచ్చి, హాజరు పట్టికలో సంతకం చేశారు. 2.56% మంది ఎప్పుడూ హాజరు కాలేదు. 30% మంది సభ్యులు వివిధ సెషన్స్‌లో 100% హాజరయ్యారు.

తొలిసారిగా ఐదేళ్ల పనితీరుపై పుస్తకం
రాజ్యసభ పనితీరు గురించి డేటాను క్రోడీకరింపజేశారు. సభకు సంబంధించిన అన్ని వివరాలనూ పొందుపరుస్తూ రూపొందించిన 'రాజ్యసభ 2017-2022..ఒక వీక్షణం' అనే పుస్తకాన్ని 8వ తేదీన వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు. ఆయన ఐదేళ్ల పనితీరుకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో పొందుపరిచారు. ఇలాంటి పుస్తకం తీసుకురావడం ఇదే తొలిసారి.

భారతీయ భాషలకు ప్రాధాన్యం
సభ్యులను వారి మాతృభాషల్లో మాట్లాడమని వెంకయ్యనాయుడు తరచూ ప్రోత్సహించారు. 2004-17తో పోలిస్తే 2018-20 మధ్యకాలంలో సభలో భారతీయ భాషల వినియోగం 4 రెట్లు పెరిగింది. 1952లో రాజ్యసభ ఏర్పడిన నాటినుంచి సభలో ఎప్పుడూ వినిపించని డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాలీ భాషలు 2020లో తొలిసారి వినిపించాయి. అస్సామీ, బోడో, గుజరాతీ, మైథిలి, మణిపురి భాషలను కూడా చాలాకాలం తర్వాత ఉపయోగించారు.

1978 నుంచి డేటా క్రోడీకరణ
1995 నుంచి రాజ్యసభ పనితీరు తిరోగమనంలో సాగడం మొదలైంది. 1952లో రాజ్యసభ మనుగడలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటివరకు 40 ఏళ్లపాటు ప్రభుత్వంలో ఉన్నవారికి ఎగువ సభలో మెజార్టీ లేదు. వరుసగా గత మూడు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉంది.

  • 1978-1990 మధ్యకాలంలో సభ ఏటా సగటున 400 నుంచి 500 గంటలు పనిచేయగా, తర్వాత 300 గంటలకు పడిపోయింది. 2010 నుంచి 300 గంటల లోపునకు తగ్గిపోయింది. 2018లో అత్యల్పంగా 40% మాత్రమే పనితీరు నమోదైంది.
  • ప్రభుత్వ బిల్లులపైనే కాకుండా ప్రజాప్రాధాన్య అంశాలపైనా ఎక్కువ దృష్టిసారించింది. 1978-2004 మధ్య కాలంలో 33.40%, 2005-14 మధ్యకాలంలో 41.42%, 2015-19 మధ్యకాలంలో 46.59% సమయం ప్రజా ప్రాధాన్య సమస్యలకు వినియోగించారు.

వెంకయ్య హయాం సాగిందిలా...
రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఇప్పటివరకు 13 పూర్తి సెషన్స్‌కి నేతృత్వం వహించారు. 289 రోజులకు గానూ సభ 261 రోజులు సమావేశమైంది. 913 గంటల 11 నిమిషాలు సభ నడిచింది.

  • ఈ 13 సెషన్స్‌లో 177 బిల్లులు ఆమోదం పొందాయి.
  • 2019లో గరిష్ఠంగా 52 బిల్లులు సభామోదం పొందాయి. 36 ఏళ్లలో ఇదే గరిష్ఠం.
  • 13 సమావేశాలు వరుసగా 58.80%, 28.90%, 73%, 27.30%, 6.80%, 104.90%, 99%, 76.10%, 102.50%, 93.50%, 29.60%, 47.90%, 99.80% ఉత్పాదకతతో పనిచేశాయి.
  • 194 ప్రైవేటు మెంబర్‌ బిల్లులు ప్రవేశపెట్టారు. 9 ప్రైవేటు మెంబర్‌ తీర్మానాలపై చర్చలు చేపట్టారు.
  • 3,525 ప్రశ్నలకు గాను 936 ప్రశ్నలకు సభాముఖంగా జవాబు చెప్పించారు. ఈయన హయాంలో ప్రశ్నోత్తరాల సమయం 41% మేర పనిచేసింది.
  • 1,526 శూన్యగంట, 953 ప్రత్యేక ప్రస్తావనలు చేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు.
  • మొత్తం సమావేశాల్లో 57% విపక్షాల ఆందోళనలను చవిచూడగా, 43% సాఫీగా సాగాయి.
  • ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో 36 సిట్టింగ్స్‌ వాయిదా పడ్డాయి. 19 సిట్టింగ్‌లు సాగు చట్టాలు, 17 సిట్టింగ్‌లు పెగాసెస్‌, మరో 17 సిట్టింగ్‌లు కావేరీ జల యాజమాన్య మండలి ఏర్పాటు డిమాండుపై, సభ్యుల సస్పెన్షన్‌ ఎత్తేయాలన్న డిమాండ్‌తో 12 సిట్టింగులు వాయిదాపడ్డాయి.

మెరుగుపడిన స్థాయీ సంఘాల పనితీరు
పార్లమెంటు స్థాయీ సంఘాలు 1993లో ఏర్పడినప్పటికీ 2019వరకు వాటి పనితీరును ఎవరూ సమీక్షించలేదు. తొలిసారి వెంకయ్యనాయుడు ఆ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

2017 ఆగస్టు నుంచి 2022 జూన్‌ మధ్యకాలంలో 558 స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. వాటి పని గంటలు సగటున 2 గంటల మేర, సభ్యుల హాజరు 48% మేర మెరుగుపడింది. రాజ్యసభ ఆధ్వర్యంలోని 8 స్థాయీ సంఘాలు ఈయన హయాంలో 369 నివేదికలను పార్లమెంటుకు సమర్పించాయి.

అయిదేళ్లలో ఆమోదం పొందిన బిల్లులు
అయిదేళ్ల కాలంలో లోక్‌సభ ఆమోదించి పంపిన 14 బిల్లులకు రాజ్యసభ సవరణలు చేసి పంపగా, వాటిని దిగువ సభ యథాతథంగా ఆమోదించింది.

ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పన, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లులతో పాటు మొత్తం నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.

ఇతర ముఖ్యమైనవాటిలో 'పలాయనం చిత్తగించిన ఆర్థిక నేరగాళ్ల బిల్లు 2018', అనియంత్రిత డిపాజిట్ల స్వీకరణను నిషేధించే బిల్లు 2019, ముమ్మారు తలాక్‌, వేతన కోడ్‌లు, జమ్మూ-కశ్మీర్‌ విభజన, ట్రాన్స్‌జెండర్‌ హక్కులు, పౌరసత్వ సవరణ, వివాద్‌ సే విశ్వాస్‌, సామాజిక భద్రత కోడ్‌, అద్దె గర్భ నియంత్రణ బిల్లు వంటివి ఉన్నాయి.

ప్రశ్నోత్తరాల సమయం
2014 నవంబర్‌ నుంచి ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉదయం 11 గంటలకు బదులు మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు. 2009-14 మధ్య కాలంలో ప్రశ్నోత్తరాల సమయం 32.60% మేర జరగ్గా, సమయం మార్చిన తర్వాత 2015-19 మధ్యకాలంలో 41.39%కి పెరిగింది.

  • ప్రశ్నోత్తరాల సమయం 2017లో గరిష్ఠంగా 73.36%, 2013లో కనిష్ఠంగా 21.66% కొనసాగింది.
  • 1978 నుంచి ఇప్పటివరకు రాజ్యసభ పనిచేసిన మొత్తం సమయంలో 14.19 శాతాన్ని ప్రశ్నోత్తరాల సమయం తీసుకొంది.

పోర్‌బందర్‌లో పర్యటించిన ఉప రాష్ట్రపతి దంపతులు
మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోర్‌బందర్‌ను శనివారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ద్వారక, సోమనాథ్‌ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. సతీమణి ఉషా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు గుజరాత్‌ పర్యటనలో భాగంగా శనివారం ఆయన జాంనగర్‌ చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, సీఎం భూపేంద్ర పటేల్‌ స్వాగతం పలికారు. గాంధీ పూర్వీకుల నివాసం పక్కన ఉన్న 'కీర్తి మందిర్‌' స్మారకాన్ని వెంకయ్యనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జీవితం నుంచి ప్రజలంతా స్ఫూర్తి పొందాలని సందర్శకుల పుస్తకంలో రాశారు.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.