భారత ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్‌ఖడ్.. ఆళ్వాపై ఘనవిజయం
Updated on: Aug 6, 2022, 9:00 PM IST

భారత ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్‌ఖడ్.. ఆళ్వాపై ఘనవిజయం
Updated on: Aug 6, 2022, 9:00 PM IST
Vice President Jagdeep Dhankad: భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగ్దీప్ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1997 తర్వాత ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తిగా ధన్‌ఖడ్ నిలిచారు. ఈనెల 11న నూతన ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.
Vice President Jagdeep Dhankad: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగ్దీప్ ధన్‌ఖడ్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 725 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా జగ్దీప్ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు పోలయ్యాయి. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు.. 182 మంది సభ్యులు ఓటేశారు. మరో 15 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు వెల్లడించారు. 55 మంది ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోలేదు.
మోదీ శుభాకాంక్షలు.. భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన జగ్దీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జగ్దీప్ ధన్‌ఖడ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. దిల్లీలోని ధన్‌ఖడ్ నివాసానికి మోదీ స్వయంగా వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా కూడా ధన్‌ఖడ్ నివాసానికి వెళ్లారు.
ఓటమిని అంగీకరించిన ఆళ్వా.. ఉమ్మడి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మార్గరెట్ ఆళ్వా తన ఓటమిని అంగీకరించారు. జగ్దీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా.. జగ్దీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం, విస్తృత అనుభవం, ప్రజల సమస్యలపై లోతైన అవగాహన కచ్చితంగా దేశానికి ప్రయోజనం చేకూరుస్తాయి." అంటూ రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా ట్వీట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ధన్‌ఖడ్‌కు అభినందనలు తెలియజేశారు.
అంతకుముందు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంట్ భవనంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ నిర్వహించారు. మెుత్తం 780 మంది ఎంపీలకు గానూ 725 మంది సభ్యులు ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు. 93 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వివిధ పార్టీల ఎంపీలు ఓటు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్ లో వచ్చి ఓటు వేశారు.
లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల బలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉంది. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఆ పార్టీ ఎంపీలు శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి పోలింగ్‌లో పాల్గొన్నారు. మిగతా 34 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆరోగ్య కారణాల వల్ల భాజపా ఎంపీలు సన్నీ దియోల్, సంజయ్ ధోత్రే ఓటు వేయలేదు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆరుగంటలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ చేపట్టగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం సాధించారు. ఈనెల 11న భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇవీ చదవండి: ఉపరాష్ట్రపతి పోలింగ్.. ఓటేసిన మోదీ.. మళ్లీ వీల్‌ఛైర్‌లోనే మన్మోహన్
ఎన్నికల్లో గెలిచింది భార్యలు.. ప్రమాణస్వీకారం చేసిందేమో భర్తలు!
