ETV Bharat / bharat

ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? - ఎలా పూజించాలి? - మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 2:22 PM IST

Vaikunta Ekadasi 2023 Date: హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. మరి, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది..? పూజా విధానం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..

Vaikunta Ekadasi 2023 Date
Vaikunta Ekadasi 2023 Date

Vaikunta Ekadasi 2023 Date and Pooja Vidhanam: ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైనది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26 సార్లు వస్తుంది. అయితే.. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది. ఈ సందర్భంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది..? వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..? పూజా విధానం ఏంటి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి ఎప్పుడు: మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇది సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే.. డిసెంబరు 22 శుక్రవారం ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాలకు పూర్తవుతుంది. అయితే.. సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్నరోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి.. 23వ తేదీనే ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.

Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?

ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేసుకోవాలి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం.. ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడాని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఆ రోజు ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి, మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫొటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. తర్వాత వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలిగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహా విష్ణువును ఆరాధిస్తారో.. ఉత్తరద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుందట.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?

ఏకాదశి అంతరార్థం ఏమిటంటే.. ఏకాదశి అనగా 11. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం.

ఉపవాసం అంటే.. కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ఉప+ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండటమే ఉపవాసం.

ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు?: విష్ణు పురాణం ప్రకారం.. ముర అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్లంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట. దాంతో స్వామి అతడిని అంతమొందిం చేందుకు సిద్ధమయ్యాడట. అది తెలిసిన అసురుడు సముద్రగర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటించాడట. దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తిరూపంలో వచ్చి అతడిని వధించిందట. స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట. మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో, స్వామి తథాస్తు అనడంతోపాటు వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట. అప్పటినుంచీ వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలుపెట్టారని అంటారు. మురాసురుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందనీ చెబుతారు. ఈ రోజున ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణుపురాణం చెబుతోంది.

శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.