ETV Bharat / bharat

భారత్​కు వచ్చి మోసపోయిన విదేశీ యువతులు.. 10 నెలలుగా ఇక్కడే.. చెల్లెళ్ల కోసం అక్క పోరాటం!

author img

By

Published : Jun 12, 2023, 8:22 AM IST

బిహార్​కు చెందిన యువకుడి మాటలు నమ్మి భారత్​ వచ్చారు ఉజ్బెకిస్థాన్​కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అనంతరం పోలీసుల చేతిలో చిక్కి బిహార్​లోని 10 నెలలుగా కాలం వెళ్లదీస్తున్నారు. తమ చెల్లెళ్లను విడిపించేందుకు.. బాధితుల అక్క అనేక కిలోమీటర్లు ప్రయాణించి భారత్​కు వచ్చింది. చెల్లెళ్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. వీరి కథేంటో తెలుసుకుందాం..

uzbekistan-sisters-trapped-in-bihar-uzbekistan-young-women-came-to-india-for-sisters
చెల్లెళ్ల కోసం భారత్ వచ్చిన ఉజ్బెకిస్థాన్ యువతి

ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన ​ఓ యువకుడి మాటలు నమ్మి భారత్​కు వచ్చారు ఉజ్బెకిస్థాన్​కు చెందిన అక్కాచెల్లెళ్లు. వారిని వ్యభిచార గృహంలోకి దింపాలని ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా.. బాధిత యువతులు బిహార్​ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారి కోసం ఆ యువతుల అక్క.. 3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్​కు వచ్చింది. ఎలాగైనా వారిని తన వెంట పంపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన ఓ భారతీయ యువకుడి మాటలు నమ్మి.. ఉజ్బెకిస్థాన్​కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు భారత్​కు వచ్చారు. వీసా లేకుండా నేపాల్​ గుండా అక్రమంగా భారత్​లోకి ప్రవేశించారు. అనంతరం బిహార్​లో ఆ యువకుడిని కలుసుకున్నారు. ప్రణాళిక ప్రకారమే ఉజ్బెకిస్థాన్ యువతులను భారత్​కు రప్పించిన ఆ వ్యక్తి.. వారిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించాడు.

కానీ 2022 అక్టోబర్ 27న ​సశస్త్ర సీమ బల్(ఎస్​ఎస్​బీ) పోలీసులకు ఆ ముగ్గురు యువతులు చిక్కారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని వారిపై బిహార్​ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరపరిచారు. అనంతరం విచారణ చేపట్టిన అరారియా కోర్టు.. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. వారిని ఉజ్బెకిస్థాన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ రెండు దేశాల మధ్య ఉన్న న్యాయపరమైన చిక్కులతో ఆ బాధిత యువతులు తమ దేశానికి వెళ్లలేకపోయారు. గత పది నెలలుగా వారు వైశాలిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్​లోనే కాలం వెల్లదీస్తున్నారు.

కాగా యువతుల కోసం తీవ్రంగా వెతుకుతున్న వారి కుటుంబ సభ్యులకు.. ఆ ముగ్గురు భారత్​లో ఉన్నారనే సమాచారం అందింది. వారు ఓ వ్యక్తి చేతిలో మోసపోయారని, బిహార్​లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్​లో ఉన్నారని.. ఉజ్బెకిస్థాన్ వచ్చేందుకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిసింది. దీంతో తన చెల్లెళ్లను ఉజ్బెకిస్థాన్​ తీసుకువెళ్లేందుకు ఆ యువతుల అక్క భారత్​కు వచ్చింది.

"నా చెల్లెళ్లను కలిసేందుకు కూడా మొదటి నాకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. అనంతరం చాలా బతిమాలుకున్న తరువాత వారిని చూసేందుకు అనుమతిచ్చారు. అక్కడ వారి పరిస్థితి దారుణంగా ఉంది. నా చెల్లెళ్ల శరీరాలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇక్కడ వారికి కనీస సౌకర్యాలు కూడా అందటం లేదు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించినట్లు వారు నాతో చెప్పారు." అని బాధితుల అక్క తెలిపింది. ఎలాగైనా చెల్లెళ్లను తనతో పంపించాలని ఆమె భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. అందుకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.