ETV Bharat / bharat

UP polls 2022: యువతకు అఖిలేశ్​​ ఆఫర్​.. ఐటీ​లో 22 లక్షల ఉద్యోగాలకు హామీ

author img

By

Published : Jan 22, 2022, 7:55 PM IST

Akhilesh Yadav
సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్రంలోని యువతను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తమ హయాంలో కృషి చేశామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని భాజపాపై విమర్శలు గుప్పించారు.

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. యువతరాన్ని తమవైపు తిప్పుకునేందుకు కీలక ప్రకటన చేశారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఐటీ రంగంలో యువతకు 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

లఖ్​నవూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు అఖిలేశ్​ యావద్​.

" మా పార్టీ అధికారంలోకి వచ్చాక నైపుణ్యవంతులైన యువతకు ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఐటీ రంగంలో రాష్ట్రం మరింత ముందుకు వెళ్లేందుకు సమాజ్​వాదీ ప్రభుత్వం కృషి చేసింది. చక్​ గజారియా ఫామ్​ కోసం హెచ్​సీఎల్​ తొలుత ఇక్కడే పెట్టుబడి పెట్టింది. ఎస్​పీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ముందుకు తీసుకెళ్లి ఉంటే లఖ్​నవూ ఐటీ హబ్​గా గుర్తింపు పొంది ఉండేది. కానీ, ఏ పని జరగలేదు. హెచ్​సీఎల్​ క్యాంపస్​లో 5వేల మంది పని చేస్తున్నారు. పలువురు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు."

- అఖిలేశ్​ యాదవ్​, యూపీ మాజీ ముఖ్యమంత్రి.

ఈ సమావేశంలోనే కాంగ్రెస్​ మాజీ ఎంపీ ప్రవీణ్​ సింగ్​ అరోన్​, ఆయన భార్య సుప్రియా అఖిలేశ్ సమక్షంలో సమాజ్​వాదీ పార్టీలో చేరారు. బరేలీ కంటోన్మెంట్​ స్థానాన్ని సుప్రియాకు కేటాయించింది కాంగ్రెస్​. కానీ, ఆమె ఎస్​పీలో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్పీ టికెట్​పై అదే స్థానంలో సుప్రియా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఈ స్థానాన్ని రాజేశ్​ అగర్వాల్​కు కేటాయించింది అఖిలేశ్​ పార్టీ. సుప్రియ రాకతో మార్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. సమాజ్​వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెయిన్​పురీలోని కర్హాల్​ నియోజకవర్గం నుంచి అఖిలేశ్​ యాదవ్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్​ గోపాల్​ యాదవ్​.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: యూపీలో ముస్లింలు ఎటువైపు? యోగి '80-20' వ్యూహం ఫలించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.