ETV Bharat / bharat

రసవత్తరంగా 'యూపీ' రాజకీయాలు.. కూటమి లెక్కల్లో కొత్త చిక్కులు!

author img

By

Published : Jan 27, 2022, 8:20 AM IST

sp-rld-alliance-issues
UP ELECTION 2022 PARTIES COALITION PROBLEMS

UP ELECTION 2022: పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జాట్‌లకు భాజపాలో లభించిన ప్రాధాన్యం ఎస్పీలో దక్కలేదని ఆర్​ఎల్​డీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ఎస్​పీకి మద్దతు ఇవ్వడంపై నిరాసక్తి చూపుతున్నాయి. మరోవైపు, ఈ పరిస్థితులను తనకు అనుకూలించేలా మార్చుకునేందుకు రంగంలోకి దిగారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.

UP ELECTION 2022: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) మధ్య పొత్తు పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది! తమ పార్టీ(ఆర్‌ఎల్‌డీ) టికెట్‌ మీద ఓ ముస్లిం అభ్యర్థిని ఎస్పీ బరిలో దించడంపై ఆర్‌ఎల్‌డీలోని జాట్‌ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా భాజపాకు లబ్ధి చేకూర్చే దిశగా సంకేతాలిస్తున్నాయి. మరోవైపు- ఆర్‌ఎల్‌డీ, ఎస్పీ శ్రేణుల మధ్య విభేదాల నుంచి లబ్ధి పొందేలా బీఎస్పీ అధినాయకురాలు మాయావతి చకచకా పావులు కదుపుతూ సమీకరణాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు.

ముస్లిం-జాట్‌ల ఏకీకరణ ఆశతో..

SP RLD alliance 2022: దాదాపుగా తొలి రెండు విడతల్లోనే ఎన్నికలు పూర్తికానున్న పశ్చిమ యూపీలో ప్రధానంగా మూడు సామాజికవర్గాలది ఆధిపత్యం. ఇక్కడి జనాభాలో 26% మంది- ముస్లింలు. దళితులు 22%, జాట్‌లు 19% ఉన్నారు. దీర్ఘకాలంగా ముస్లింలు ఎస్పీకి, దళితులు బీఎస్పీకి, జాట్‌లు ఆర్‌ఎల్‌డీకి అండగా నిలుస్తూ వచ్చారు. 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్లతో (జాట్‌ X ముస్లిం) సమీకరణాల్లో మార్పు వచ్చింది. జాట్‌లు భాజపావైపు మొగ్గుచూపారు. అయితే- సాగుచట్టాలపై సుదీర్ఘ పోరాటంతో పరిస్థితులు మళ్లీ మారాయి. జాట్‌లలో ఎక్కువమంది కాషాయపార్టీకి దూరం జరిగారు! హిందూ ఓటర్లలో చీలిక రాకుండా చూడాలన్న లక్ష్యంతో.. ఈ దఫా ఎస్పీతో ఆర్‌ఎల్‌డీ జట్టు కట్టింది. జాట్‌లు, ముస్లింలు ఏకమై తమకు విజయాన్ని కట్టబెడతారన్నది ఆ కూటమి విశ్వాసం. పొత్తులో భాగంగా ప్రస్తుతం ఆర్‌ఎల్‌డీ 33 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో ఆరు సీట్లలో ఆర్‌ఎల్‌డీ గుర్తుపై ఎస్పీ నామినీలు బరిలో దిగుతారు.

జాట్‌లకు భాజపా ప్రాధాన్యం

SP RLD alliance seat sharing: పశ్చిమ యూపీలో మేరఠ్‌, భాగ్‌పత్‌.. ఆర్‌ఎల్‌డీకి గట్టి పట్టున్న జిల్లాలు. వీటిలో జాట్‌ల జనాభా 20% మేర ఉంటుంది. ముస్లిం జనాభా - దాదాపు 25%. ఈ రెండు జిల్లాల్లో 10 అసెంబ్లీ స్థానాలుండగా.. ఆర్‌ఎల్‌డీ కేవలం ముగ్గురు జాట్‌ అభ్యర్థులను బరిలో దించింది. భాజపా ఏకంగా ఐదుగురు జాట్‌లను పోటీలో నిలిపింది. ఆర్‌ఎల్‌డీ కంటే కమలదళం తమ వర్గానికి అధిక ప్రాధాన్యమివ్వడం జాట్‌లను పునరాలోచనలో పడేస్తోంది.

sp-rld-alliance-issues
జనాభా శాతాల్లో..

సివాల్‌-ఖాస్‌లో సవాల్‌

SP RLD gathbandhan: ప్రధానంగా మేరఠ్‌ జిల్లాలోని సివాల్‌-ఖాస్‌ స్థానం.. ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమిలో కుంపటి రాజేస్తోంది! ఇక్కడ ఆర్‌ఎల్‌డీ గుర్తుపై ఎస్పీ నామినీ బరిలో దిగాలన్నది ఒప్పందం. నియోజకవర్గంలో ముస్లింల జనాభా 30% పైగా ఉండటంతో.. మాజీ ఎమ్మెల్యే గులాం మొహమ్మద్‌ను ఎస్పీ పోటీలో నిలిపింది. స్థానికంగా 20% వరకూ ఉన్న జాట్‌లకు ఇది ఏమాత్రం రుచించడం లేదు. మేరఠ్‌(అర్బన్‌), మేరఠ్‌(దక్షిణ), కిఠౌర్‌లలోనూ ముస్లిం అభ్యర్థులకు ఎస్పీ టికెట్‌ ఇవ్వడం జాట్‌ ఓటర్లకు ఆగ్రహం కలిగిస్తోంది.

ముజఫర్‌నగర్‌లో మరో వైచిత్రి!

2013 నాటి అల్లర్లకు కేంద్రంగా నిలిచిన ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఆరు శాసనసభ స్థానాలున్నాయి. ఇక్కడ ముస్లిం జనాభా- 42%. కానీ ముస్లిం అభ్యర్థులను పోటికి దించితే భాజపా లాభపడుతుందేమోనన్న ఆందోళనతో.. జిల్లాలోని అన్ని సీట్లలోనూ ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి హిందూ అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో ఒక్కరే అసలైన ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి. మిగిలిన ఐదుగురూ ఆర్‌ఎల్‌డీ గుర్తుపైనే పోటీ చేస్తున్నా.. వారు ఎస్పీ నామినీలు. అయితే జిల్లాలో 18%గా ఉన్న జాట్‌ ప్రజలు.. ఎస్పీ విజయం కోసం శ్రమించేందుకు ఆసక్తి చూపడం లేదు. తమ వర్గానికి ఒక్క సీటూ కేటాయించకపోవడంతో ముస్లింలూ ఆర్‌ఎల్‌డీ-ఎస్పీ కూటమిపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు- బీఎస్పీ మాత్రం జిల్లాలో ముగ్గురు ముస్లింలకు టికెట్‌ కేటాయించింది.

'మాయ' చేస్తారా?

ఆర్‌ఎల్‌డీ, ఎస్పీ శ్రేణుల మధ్య విభేదాల్లో.. బీఎస్పీ అవకాశాలు ఒడిసిపడుతోంది! టికెట్ల కేటాయింపులో ముస్లిం అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తోంది. తొలి రెండు విడతల కోసం మాయావతి పార్టీ 109 మంది అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో 40 మంది ముస్లింలున్నారు. సహారన్‌పుర్‌ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలుండగా మూడు, బిజ్నోర్‌లో ఏడు సీట్లకుగాను ఐదు, మొరాదాబాద్‌లో ఆరు నియోజకవర్గాలుండగా ఐదు, సంభాల్‌లో నాలుగు స్థానాలకుగాను మూడు, రాంపుర్‌లో ఐదు సీట్లుండగా రెండు టికెట్లను బీఎస్పీ ముస్లింలకు కేటాయించింది. ఆయా జిల్లాల్లో ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పార్టీ గణనీయంగా లబ్ధి పొందే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

West UP muslim population

బీఎస్పీ, ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ ముస్లిం అభ్యర్థులను నిలబెట్టిన స్థానాల్లో.. ముస్లిం ఓట్లు చీలిపోయి భాజపా లబ్ధి పొందే అవకాశాలూ ఉన్నాయి. ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి తరఫున బరిలో దిగుతున్న హిందూ అభ్యర్థులు హిందువుల ఓట్లను చీలిస్తే మాత్రం.. భాజపాకు నష్టం, బీఎస్పీకి లాభం చేకూరుతుంది! మాయావతి పార్టీకి దళితుల అండ ఎలాగూ ఉంటుంది. కాబట్టి పశ్చిమ యూపీలో ఇప్పుడు సమీకరణాలు ఉత్కంఠగా మారాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.