ETV Bharat / bharat

తాను ఓడినా.. శత్రువు గెలవొద్దు.. యూపీలో 'మాయా' స్కెచ్!

author img

By

Published : Jan 31, 2022, 7:45 AM IST

Up Election 2022
ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు

Up Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజుకో మలుపు తీసుకుంటూ రసవత్తరంగా మారాయి. అఖిలేశ్​ యాదవ్ ముస్లిం-యాదవ్‌-జాట్‌ సమీకరణకు ప్రయత్నిస్తుంటే.. వీరి ఓట్లకు గండికొట్టే ఎత్తుగడల్లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నిమగ్నమయ్యారు. ముస్లిం అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో రంగంలోకి దింపుతున్నారు.

Up Election 2022: 'తాను ఓడిపోయినా సరే.. ప్రధాన ప్రత్యర్థి మాత్రం విజయం సాధించకూడదు' అన్నట్లుగా ఉంది ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) వ్యూహం. ప్రస్తుత ఎన్నికల్లో ముస్లిం-యాదవ్‌-జాట్‌ వర్గాల దన్నుతో అధికారాన్ని సొంతం చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ యత్నిస్తుంటే..ఆ సమీకరణకు గండికొట్టే ఎత్తుగడల్లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నిమగ్నమయ్యారు. ఆమె ముస్లిం అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో రంగంలోకి దింపుతుండటం ఎస్పీని కలవరపెడుతోంది.

రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీఎస్పీ ఇప్పటి వరకు 225 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వాటిల్లో 60 స్థానాలను ముస్లిం అభ్యర్థులకు కేటాయించింది. అంటే ఇప్పటివరకు ప్రకటించిన సీట్లలో 26శాతం స్థానాలను మైనార్టీలకు కేటాయించడం ద్వారా ఎస్పీని దెబ్బతీసి.. పరోక్షంగా భాజపాకు మేలు చేయాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

సగటున 5వేల ఓట్లు చీల్చగలిగితే..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ముస్లిం ఓటర్ల తొలి ప్రాధాన్యం సమాజ్‌వాదీ పార్టీకే లభిస్తుంటుంది. సంప్రదాయంగా ఆ వర్గం ఓట్లు ములాయంతో ఉన్నందున అత్యధిక మంది అటువైపే చూస్తున్నారు. అయితే స్థానిక సమీకరణలు, అభ్యర్థుల గుణగణాలను దృష్టిలో ఉంచుకొని కొందరు ముస్లిం ఓటర్లు ప్రత్యామ్నాయం వైపు చూసే అవకాశం ఉంటుందని, అలాంటి సమయంలో బీఎస్పీ తరఫున పోటీచేసే ముస్లిం అభ్యర్థులకు వారు ఓటేసే అవకాశం ఉంటుందని ఓ అంచనా.

ఇప్పటివరకు మాయావతి రంగంలోకి దింపిన 60 మంది ముస్లింలు అంతా స్థానికులే కాబట్టి, వారు తమకున్న పరిచయాల ఆధారంగా ఒక్కో నియోజక వర్గంలో కనీసం 5వేల ఓట్లయినా దక్కించుకొనే అవకాశం ఉంటుందని, ఆ మేరకు అది ఎస్పీకి నష్టం కలిగిస్తుందని బీఎస్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. కనీసంగా ఈ మేరకు చీల్చే ఓట్లు బీఎస్పీకి మేలుచేయకపోయినా పరోక్షంగా భాజపా లబ్ధి పొందుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాయావతికి భాజపా కంటే ఎస్పీ నుంచే రాజకీయ ముప్పు ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీని ఎంత బలహీనపరిస్తే తాను అంత బలం పుంజుకోవచ్చన్న సూత్రీకరణ ఆమెను ఈ దిశగా ప్రేరేపించి ఉండొచ్చని చెబుతున్నారు.

అఖిలేశ్‌ ఆకర్ష మంత్రం

మైనార్టీ ఓటర్లలో మాయావతి చేస్తున్న నష్టాన్ని దళిత ఓటర్ల ద్వారా భర్తీ చేసుకొనేందుకు అఖిలేశ్‌ యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ 403 సీట్లలో పోటీ చేసి 19 స్థానాలతోనే సరిపెట్టుకొంది. ఎస్పీ 311 స్థానాల్లో పోటీచేసి 47 సీట్లు గెలుచుకొంది. అయితే, మొత్తం పోలైన ఓట్లలో ఎస్పీకి 21.82 శాతం దక్కితే, బీఎస్పీకి 22.23శాతం వచ్చాయి. గతంతో పోలిస్తే బీఎస్పీ ఈ ఎన్నికల్లో చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి క్రియాశీలకంగా ప్రచారం చేయకపోవడం వల్ల బీఎస్పీ అభిమానుల్లోనూ కొంత నిరుత్సాహం ఉంది. దీనివల్ల ముస్లింలు ఆ పార్టీ వైపు పెద్దగా మొగ్గు చూపక పోవచ్చని ఎస్పీ అభిమానులు అంచనా వేస్తున్నారు.

అయితే, దళితులు భాజపా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనిని అడ్డుకునేందుకు అఖిలేశ్‌ దళిత నేతలను ఆకట్టుకునే యత్నంలో ఉన్నారని సమాచారం.

ఎదురుదెబ్బ తగిలినా సరే..

2017 అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించిన మాయావతి 99 స్థానాలను ముస్లింలకు కేటాయించారు. ఆ అభ్యర్థుల్లో అయిదుగురు మాత్రమే గెలిచారు. ఇప్పుడు ఆమె బీఎస్పీ విజయం కంటే ఎస్పీ ఓటమికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ వర్గం ఓట్లను చీల్చడానికి మైనార్టీ అభ్యర్థులకు అత్యధికంగా టికెట్లు కేటాయిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు దశల ఎన్నికల వరకు ఆమె అభ్యర్థులను ప్రకటించారు.

తొలి దశలో ఎన్నికలు జరిగే 58 స్థానాలకు గాను 16, రెండో దశలో 55 స్థానాలకు గాను 23, మూడో దశలో 59 స్థానాలకు గాను అయిదు, 4వ దశలో 60 స్థానాలకుగాను ఇప్పటి వరకు ప్రకటించిన 53 మందిలో 16 స్థానాలను ముస్లింలకు కేటాయించారు. ఇదే తరహాలో మిగిలిన దశ ఎన్నికలకూ ముస్లిం అభ్యర్థులను ప్రకటిస్తే 2017లో కన్నా అధికంగానే ఆ వర్గానికి సీట్లు కేటాయించినట్లు అవుతుంది.

గత ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో 24శాతం (99) సీట్లు ఈ వర్గానికి కేటాయిస్తే వచ్చిన ఫలితం 5 శాతమే. అయినప్పటికీ మళ్లీ అంతకుమించి సీట్లు ఆ వర్గానికి ఎందుకు కేటాయిస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Anupriya Patel: 'అభివృద్ధికే పట్టం- మళ్లీ మాదే అధికారం'

ఎక్కడికెళ్లినా అఖిలేశ్​ వెంటే ఆ మూట.. ఇంతకీ అందులో ఏముంది?

యోగి కోసం రంగంలోకి 'మానసపుత్రిక'.. అప్పుడు భాజపాకు ఝలక్.. ఇప్పుడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.