ETV Bharat / bharat

'ఆగస్టులో పిల్లలకు కరోనా టీకా పంపిణీ!'

author img

By

Published : Jul 27, 2021, 3:45 PM IST

ఆగస్టులోనే పిల్లలకు టీకా అందిచనున్నట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్​సుఖ్​ మాండవియా తెలిపారు. భారత్​ త్వరలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా అవతరించబోతుందన్నారు. మరోవైపు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి పల్లెలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీలకు నిర్దేశించారు ప్రధాని నరేంద్ర మోదీ.

Corona vaccine for children
పిల్లలకు కరోనా టీకా

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక విషయం వెల్లడించారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్ మాండవియా. వచ్చే నెలలోనే పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే మరిన్ని కంపెనీలకు వ్యాక్సిన్​ ఉత్పత్తి లైసెన్స్​ పొందనున్నాయని.. ఫలితంగా భారత్​ త్వరలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా అవతరిస్తుందని మాండవియా పేర్కొన్నారు.

తుది దశకు పరీక్షలు

సెప్టెంబరులోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయని కొద్దిరోజుల క్రితం ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. అయితే మాండవియా ప్రకటనతో వచ్చే నెలలో పిల్లలకు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయని గులేరియా గతంలో పేర్కొన్నారు. పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయిల్స్‌ సైతం త్వరలోనే పూర్తి కానున్నాయని తెలిపారు.

ప్రతి పల్లెలో స్వాతంత్ర్య వేడుక!

తమ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో 75వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్​ రామ్​ మేఘవాల్​ వెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తికానున్న నేపథ్యంలో ఈ వేడుకను ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజా ఉద్యమంలా జరపాలని.. దేశ పౌరులందరూ ఇందులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మోదీ సూచించినట్లు మేఘవాల్​ వివరించారు.

ఈ విషయమై విపక్ష పార్టీలతో చర్చించడానికి ప్రభుత్వం మొగ్గు చూపినా.. వారు అందుకు సిద్ధంగా లేరని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: పిల్లలకు కరోనా టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.