ETV Bharat / bharat

పద్దు: ఆరోగ్యం, మౌలిక వసతులకే ప్రాధాన్యం

author img

By

Published : Feb 1, 2021, 3:07 PM IST

Updated : Feb 1, 2021, 3:17 PM IST

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్​ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. మౌలిక వసతులు తదితర రంగాలకు వార్షిక పద్దులో పెట్టపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు​ సెస్​ పేరుతో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారం మోపారు.

union budget 2021-22 introduced in parliament
కేంద్ర బడ్జెట్​

సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో నడపడమే ప్రధాన లక్ష్యంగా వార్షిక బడ్జెట్​ను తీసుకొచ్చింది కేంద్రం. ఒక్కో రంగంలో నిర్దిష్ట లక్ష్యాలతో 'ఆత్మనిర్భర్ భారత్​' నిర్మాణానికి పునాదులు వేసేలా బడ్జెట్​​ను రూపొందించింది. కరోనా మిగిల్చిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్​కు బాటలు వేసే విధంగా కేంద్ర బడ్జెట్​ 2021-22ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

రూ.34.83లక్షల కోట్లు

గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించే లక్ష్యంతో మౌలిక వసతులు తదితర రంగాలకు వార్షిక పద్దులో పెట్టపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.34.83 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. ఇందులో రూ.12 లక్షల కోట్లు రుణాల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. 2025-26 నాటికి ద్రవ్య లోటును 4.5 శాతం లోపు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్రం... రాష్ట్రాలకు 41 శాతం పన్నుల వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. 27.1 లక్షల కోట్ల విలువైన ఆత్మనిర్భర ప్యాకేజీలను ప్రకటించామన్న నిర్మలా సీతారామన్‌... సంస్థాగత సంస్కరణలను వేగవంతం చేసినట్లు తెలిపారు.

34.5 శాతం పెంపు

అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై బడ్జెట్​లో ప్రధానంగా దృష్టిసారించింది కేంద్రం. 2021-22 సంవత్సరానికి పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచి.. రూ. 5.5 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు ప్రకటించింది. గత బడ్జెట్​లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 4.12 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మేరకు 2020-21 బడ్జెట్ అంచనాలను సవరిస్తూ.. ఈ వ్యయాన్ని రూ. 4.39 లక్షల కోట్లకు పెంచిన్నట్లు పేర్కొన్నారు.

"2020-21 పెట్టుబడుల బడ్జెట్ అంచనాలు గణనీయంగా పెరిగాయి. రూ.4.12 లక్షల కోట్లను ఈ(పెట్టుబడి) వ్యయం కోసం ప్రతిపాదించాం. నిధుల కొరత ఉన్నప్పటికీ పెట్టుబడి వ్యయాన్ని అధికం చేయాలని అనుకుంటున్నాం. ఈ ఏడాదిని రూ.4.39 లక్షల కోట్లతో ముగించాలని భావిస్తున్నాం."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి

ఆరోగ్య రంగం

కరోనా నేపథ్యంలో 2021-22లో ఆరోగ్య రంగానికి 2 లక్షల 23 వేల కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 137 శాతం అధికం. తొలిసారి ఆత్మ నిర్భర్‌ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రకటించి దానికి 64 వేల 180 కోట్లు, వ్యాక్సినేషన్ కోసం 35 వేల కోట్లను కేటాయించారు. రికార్డు స్థాయిలో రైల్వేలకు లక్షా 10 వేల 55 కోట్లు ఇవ్వనున్నారు. 4 వేల 378 పట్టణ స్థానిక సంస్థలకు జలజీవన్‌ మిషన్‌ కింద 2 లక్షల 87 వేల లక్షల కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో లక్షా 41 వేల 678 కోట్లతో స్వచ్ఛ భారత్‌ను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ బ్యాంకుల మూల ధన సాయం కింద మరో 20 వేల కోట్లు అందించాలని నిర్ణయించారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షా 75 వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రైతు సంక్షేమం..

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న విత్త మంత్రి...పంట సేకరణ క్రమం పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 40 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు 40 వేల కోట్లు కేటాయించారు. కొత్తగా వంద సైనిక స్కూళ్లను ఏర్పాటు చేస్తామని, 15 వేల పాఠశాలలను జాతీయ విద్యా విధానం కింద బలోపేతం చేస్తామని తెలిపారు. బీమారంగంలో ఎఫ్‌డీఐల పరిమితికి 74 శాతానికి పెంచారు.

ఆ రాష్ట్రాల్లో..

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు అసోం, తమిళనాడు, బంగాల్, కేరళ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ప్రాజెక్టులను ప్రకటించింది.

సామాన్యులకు వాత..

అయితే కోటి ఆశలతో బడ్జెట్​ కోసం ఎదురు చూసిన సామన్యూలను ఊరటనిచ్చేలా కేంద్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు. సెస్​ పేరుతో పెట్రల్​, డీజిల్​పై ధరలు భారీగా పెంచి అదనపు భారం మోపింది.

Last Updated : Feb 1, 2021, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.