రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలపరిచేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది త్రిపుర ప్రభుత్వం. 'మదర్ ఆన్ క్యాంపస్' పేరుతో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లల్లో ఉండి, స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులకు ఇది ఉపయోగపడనుంది.
త్రిపుర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్ లాల్నాథ్ ఈ పథకం గురించి వివరిస్తూ.. భవిష్యత్తు తరాల విద్యార్థులపైనే రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందని అన్నారు.
"పిల్లలు.. తల్లులతోనే సన్నిహితంగా ఉంటారు. తల్లే.. విద్యార్థికి తొలి టీచర్. అందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాము. ఇందులో భాగంగా.. విద్యార్థుల వద్ద ఇద్దరు తల్లులు రెండు వారాల పాటు ఉంటారు. మరో రెండు వారాలు ఇంకో ఇద్దరు విద్యార్థుల తల్లులు ఉంటారు. దీంతో తాము భద్రంగా ఉన్నామని విద్యార్థులకు నమ్మకం కలుగుతుంది. హాస్టళ్లల్లో తల్లులు ఉంటే.. విద్యార్థుల చదువులు మెరుగుపడతాయి. అదే సమయంలో హాస్టళ్ల నిర్వహణ మెరుగుపడుతుంది. ఇక్కడ పిల్లలతో సమయం గడపడం తప్ప తల్లులు వేరే పని చేయరు."
--- రతన్ లాల్నాథ్, త్రిపుర విద్యాశాఖ మంత్రి.
హాస్టళ్లలోకి తల్లులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు రతన్ లాల్నాథ్. తల్లులు రెండు వారాల పాటు కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని, వారి ఇష్టం మేరకు 3,4 రోజుల తర్వాత కూడా వెళ్లిపోవచ్చన్నారు. బాయ్స్ హాస్టళ్ల విషయానికొస్తే.. తల్లులకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. అవి కుదరకపోతే, ఆ హాస్టల్కు సంబంధించి పథకాన్ని నిలిపివేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:- 'అక్షరాల్లో అసమానతలు.. తొలగితేనే దేశ భవితకు మేలు'