ETV Bharat / bharat

మనాలీలో భారీగా మంచు.. చిక్కుకున్న 400 వాహనాలు.. 12 గంటలపాటు నరకం

author img

By

Published : Dec 30, 2022, 6:36 PM IST

Updated : Dec 30, 2022, 6:47 PM IST

హిమాచల్‌ ప్రదేశ్‌ రోహ్‌తంగ్‌ పాస్‌లోని అటల్‌ టన్నెల్‌ పరిసర ప్రాంతాల్లో మంచులో చిక్కుకుపోయిన వందలాది మంది పర్యటకులను అధికారులు రక్షించారు. మనాలీ- లేహ్‌ రహదారిపై గురువారం భారీగా మంచు కురిసింది. దీంతో 400 వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. సుమారు 12 గంటల పాటు శ్రమించి ఆ వాహనాల్లో ఉన్న పర్యటకులను రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

SNOW-TUNNEL
SNOW-TUNNEL

మనాలీలో భారీగా మంచు.. చిక్కుకున్న 400 వాహనాలు.. 12 గంటలపాటు నరకం

Manali Snowfall : హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ-లేహ్‌ రహదారి పరిసర ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదైంది. అటల్‌ టన్నెల్‌కు సమీపంలో 400 వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. పెద్ద ఎత్తున మంచు రహదారిపై పేరుకుపోవడం వల్ల వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాహనాల్లో ఉన్న వారంతా మంచులోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు కీలాంగ్‌, మనాలీ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. 12 గంటలపాటు శ్రమించి పర్యటకులను కాపాడారు. పర్యటకులంతా తమ తమ గమ్యస్థానాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

అంతకుముందు వాహనాల్లో చిక్కుకున్న వారందరికీ ఆహారాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు. హిమపాతంలో చిక్కుకుపోయిన పర్యటకుల్లో ఎక్కువ మంది కులు, మనాలి ప్రాంతానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వెళ్లే క్రమంలో అనుహ్యంగా మంచులో చిక్కుకుపోయినట్లు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున వాహనాలు రావడం వల్ల మనాలీ లేహ్‌ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్‌ ఏర్పడినట్లు పేర్కొన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని డల్హౌసీ, సలోని, చురాహ్‌ ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయినట్లు స్పష్టం చేశారు. కోఠి ప్రాంతంలో 15 సెంటీమీటర్ల మేర మంచు కురవగా ఖద్రాలా, ఉదయ్‌పుర్, కల్పాలో 5సెంటీ మీటర్ల హిమపాతం నమోదైంది. భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటం వల్ల పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప స్థానికులు బయటకు రావొద్దని సూచించారు.

Last Updated :Dec 30, 2022, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.