ETV Bharat / bharat

'ఆ పేలుడు వెనక ఉగ్రహస్తం.. నిందితులకు ఐసిస్​తో లింకులు.. విదేశాల నుంచి ప్లాన్'

author img

By

Published : Oct 25, 2022, 2:13 PM IST

తమిళనాడు కోయంబత్తూర్​లో ఆదివారం ఉదయం జరిగిన ఓ కారు పేలుడు.. రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ప్రమాదమా? లేదా సంఘవిద్రోహ చర్యా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగగా.. రాష్ట్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

Coimbatore car explosion
tn car explosion

TN car explosion : తమిళనాడు కోయంబత్తూర్​ ఉక్కడంలోని సంగమేశ్వర్ ఆలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఓ కారు పేలుడు.. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో జమేషా ముబీన్ అనే వ్యక్తి మరణించాడు. తాజాగా ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రయాణిస్తున్న కారులోని సిలిండర్ పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలుప్రాంతాల్లో గస్తీకి దిగిన ర్యాపిడ్​ యాక్షన్​ ఫోర్స్ ​భద్రత్రను మరింత కట్టుదిట్టం చేసింది.

tn car explosion
ర్యాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​

అదుపులోకి తీసుకున్న నిందితులను ముహమ్మద్ తల్కా, ముహమ్మద్ అజారుద్దీన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, ముహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని వెల్లడించారు. వారివద్ద నుంచి పొటాషియం నైట్రేట్​ అనే పేలుడు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు ఘటనలో మృతి చెందిన ముబీన్​ ఇంట్లో నుంచి కూడా పొటాషియం నైట్రేట్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్​లను పరీశీలించారు. శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ముబీన్ ఇంటి నుంచి ఓ గోనె సంచిని ఐదుగురు మోసుకెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయని తెలిపారు. ఆ ఐదుగురిలో ముబీన్​ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా వ్యక్తుల గురించి మరింత సమచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

tn car explosion
ఘటనా స్థాలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

దర్యాప్తులో భాగంగా ముబీన్​తో పరిచయం ఉన్న ఏడుగురిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. ఘటనా స్థలంలో ట్రేస్​ చేసిన సిగ్నల్స్​ ద్వారా నీలగిరిలోని కూనూర్​కి చెందిన ఓ ఆటో డ్రైవర్​ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఆ ప్రాంతంలో గత నాలుగు నెలలుగా నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ముబీన్​ ప్రయాణిస్తున్న కారులో.. మేకులు, గోళీలు లభించాయని పోలీసులు తెలిపారు.

రాజకీయ దుమారం
పేలుడు ఘటనపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ఇది ఉగ్రవాద చర్యేనని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. నిందితులకు ఐఎస్ఐఎస్​తో లింకులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పేలుడును అరికట్టడంలో రాష్ట్ర నిఘా వ్యవస్థ విఫలమైందంటూ దుయ్యబట్టారు. దీనికి అధికార డీఎంకే బాధ్యత వహించాలని అన్నారు.

"ముబీన్ నివాసం నుంచి 50 కిలోల అమ్మోనియం నైట్రేట్, పొటాషియం, సోడియం, ఫ్యూజ్ వైర్​తో పాటు 7-వోల్ట్ బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి గల కారణాన్ని పోలీసులు ఎందుకు వెల్లడించట్లేదు. దాడికి ప్లాన్ చేస్తున్న సమయంలోనే నిందితుడు చనిపోయాడు. అక్టోబర్​ 21న ముబీన్​ ఐఎస్​ఐఎస్​ తరహాలో ఓ వాట్సాప్​ స్టేటస్​ని పోస్ట్​ చేశాడు. తమిళనాడు భాజపా తరఫున ఈ విషయం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు లేఖ రాశాం. పోలీసులు దీన్ని ఆత్మాహుతి దాడిగా పరిగణించాలి. నిందితులకు ఐసిస్​తో లింకులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. విదేశాల నుంచి ఈ దాడికి ప్లాన్ జరిగింది. తమిళనాడులో ఇంకా కొన్ని విద్రోహశక్తులు క్రియాశీలంగా ఉన్నాయి. నిర్దాక్షిణ్యంగా వీరిపై విరుచుకుపడాలి. ముఖ్యమంత్రి స్టాలిన్.. తన వైఫల్యాల నుంచి దాక్కోవడం మానేసి బయటకు రావాలి" అని అన్నామలై ఆరోపించారు.

ఈ ఘటనపై ప్రతిపక్ష నేత పళని స్వామి సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం ఈ విషయంపై ఏం వివరణ ఇస్తారని ప్రశ్నించారు. "డీఎంకే అధికారం చేపట్టినప్పుడల్లా, బాంబు పేలుళ్ల ఘటనలు పునరావృతమవుతున్నాయి" అని ధ్వజమెత్తారు. పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ పనితీరులో లోపాన్ని ఈ ఘటన ఎత్తి చూపుతోందని ఆరోపించారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

ఇదీ చదవండి: Attack: పాత గొడవలతో ఇద్దరు యువకులపై కత్తితో దాడి... ఎక్కడంటే..?

చోరీకి వచ్చి ఇంట్లోని దేవుడి గదిలో ఉరేసుకున్న దొంగ.. నిజంగా ఆత్మహత్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.