ETV Bharat / bharat

ఎవరీ మహువా మొయిత్రా? ఆమెను లోక్​సభ నుంచి ఎందుకు బహిష్కరించారు?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 5:16 PM IST

TMC MP Mahua Moitra Biography
TMC MP Mahua Moitra Biography

TMC MP Mahua Moitra Biography: ఎంపీ మహువా మొయిత్రాను లోక్​సభ నుంచి బహిష్కరించారు. ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రజాప్రతినిధికి.. చట్ట సభలో ఉండే అర్హత లేదంటూ పంపేశారు! మరి.. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? అసలు ఎవరీ మొయిత్రా? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనే పూర్తి వివరాలు మీకోసం..

TMC MP Mahua Moitra Biography in Telugu: మహువా మొయిత్రా తృణమూల్ కాంగ్రెస్​ కు చెందిన ఎంపీ. 2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్​సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంట్​లో తొలిసారిగా అడుగు పెట్టిన మహువా.. తృణమూల్​ పార్టీలో ఫైర్​ బ్రాండ్​గా పేరు సంపాదించారు. తనదైన వాగ్ధాటితోపాటు సునిశిత పరిశీలన చేస్తూ.. ప్రత్యర్థులను ఇరుకున పడేయడంలో దిట్ట అనే పేరుంది. అలాంటి మహువా.. ఇప్పుడు పార్లమెంట్​నుంచి బహిష్కరణకు గురయ్యారు. మరి.. ఇంతటి చర్య తీసుకోవడానికి కారణమేంటి? మహువా చేసిన నేరమేంటి? ఆమె నేపథ్యమేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

మొయిత్రా చరిత్ర.. మహువా మొయిత్రా 1974లో అస్సాం రాష్ట్రంలో జన్మించారు. అయితే.. ఆమె ప్రాథమిక విద్య మాత్రం కోల్‌కతాలో ముగిసింది. ఆ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లారు. 1998లో మౌంట్ హోలియోక్ కాలేజ్ సౌత్ హ్యాడ్లీ నుంచి మ్యాథ్స్-ఎకనామిక్స్​లో డిగ్రీ తీసుకున్నారు. స్టడీస్​ కంప్లీట్ అయిన తర్వాత.. ప్రముఖ బ్యాంకింగ్ కంపెనీ JP మోర్గాన్ చేజ్‌లో వర్క్ చేశారు. లండన్‌, న్యూయార్క్​లో పని చేసిన మొయిత్రా.. కొంత కాలం తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొద్దికాలానికే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

మహువా మొయిత్రా
మహువా మొయిత్రా

కాంగ్రెస్ పార్టీ ద్వారా.. 2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ద్వారా మహువా రాజకీయం రంగంలో కాలుమోపారు. కానీ.. ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేదు. సంవత్సర కాలానికే రాజీనామా చేశారు. 2010లో తృణమూల్ కాంగ్రెస్​లో చేరారు. మహువా ప్రసంగాలు ఎంతో పదునుగా ఉంటాయి. ప్రజలను సులువుగా ఆకట్టుకోగల నేర్పరి. దాంతో.. పార్టీలో ఆమె ప్రాధాన్యం వేగంగా పెరుగుతూ వచ్చింది. 2016లో నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ టికెట్​ను తృణమూల్ కాంగ్రెస్​ మహువాకు కేటాయించింది. తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమెను పార్లమెంట్​కు పంపించాలని పార్టీ నిర్ణయించింది. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన మహువా.. అక్కడ కూడా విజయం సాధించారు. ఆ విధంగా.. లోక్‌సభలో అడుగుపెట్టారు.

'బహిష్కరణ వేటు 'కంగారూ కోర్టు' ఉరి తీర్పుతో సమానం- విపక్షాలను లొంగదీసుకోవడానికే ఎథిక్స్ కమిటీ'

సభలో యాక్టివ్.. పశ్చిమ బెంగాల్​ రాజకీయాల్లో ఫైర్​ బ్రాండ్​గా పేరు సంపాదించిన మహువా.. లోక్​ సభలోనూ తన వాగ్ధాటిని కొనసాగించారనే పేరుంది. సభలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ.. తనదైన రీతిలో ప్రశ్నలు అడిగి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఎంపీగా గుర్తింపు పొందారు. అలాంటి మహువా మొయిత్రా ఓ వివాదంలో చిక్కుకున్నారు. "డబ్బులు తీసుకొని లోక్​ సభలో ప్రశ్నలు అడిగారు" అన్నదే ఆ వివాదం.

బీజేపీ ఎంపీ ఆరోపణలు.. మహువా మొయిత్రాపై.. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే ఈ ఆరోపణలు చేశారు. మహువా డబ్బులు తీసుకొని.. లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. ఈ మేరకు స్పీకర్‌ బిర్లాకు సైతం లేఖ రాశారు. ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ టార్గెట్​గా ఆమె ప్రశ్నలు అడిగారని అందులో పేర్కొన్నారు. ఈ ప్రశ్నలు అడగడానికి ప్రముఖ బిజినెస్ మేన్.. దర్శన్‌ హీరానందానీ నుంచి రూ.2 కోట్లతోపాటు పలు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని ఆరోపించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన దాదాపు 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ అడగమన్నవే అని లేఖలో పేర్కొన్నారు. ఇంధన, ఇన్‌ఫ్రా రంగాలకు సంబంధించిన ఓ కాంట్రాక్టు అదానీ గ్రూపునకు రావడంతో.. హీరానందానీ వ్యాపార ప్రయోజనాల కోసం మహువా ఈ ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ఇలా.. నేరపూరిత కుట్రలకు పాల్పడి.. పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించిన మహువాను లోక్​ సభ నుంచి బహిష్కరించాలని దుబే కోరారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బిజినెస్​ మేన్​ హీరానందానీ సైతం పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లెటర్ రాశారు. ప్రధాని మోదీ, అదానీని మొయిత్రా టార్గెట్ చేసి ప్రశ్నలు అడిగారని.. అందుకు ప్రతిగా ఖరీదైన బహుమతులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు.

టీఎంసీ ఎంపీ మహువాపై బహిష్కరణ వేటు- లోక్​సభ నుంచి విపక్షాలు వాకౌట్

ఎథిక్స్ కమిటీ విచారణ.. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలని "నైతిక విలువల కమిటీ"ని స్పీకర్ ఆదేశించారు. లోక్‌సభలో ఈ కమిటీని 2000 ఏడాదిలో ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది సభ్యులు ఉంటారు. లోక్​ సభ సభ్యులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించి.. వారిపై తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. మహువా వివాదంపై ఎథిక్స్ కమిటీ విచారణ పూర్తి చేసి.. నివేదికను పార్లమెంట్​కు సమర్పించింది. ఈ నివేదికను శుక్రవారం (డిసెంబర్ 8) లోక్‌సభ ఆమోదించింది. దీంతో.. మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

తప్పు చేయలేదు- మహువా: డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగారనే విమర్శలను మహువా ఆదినుంచీ కొట్టిపారేస్తూనే వచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. బహిష్కరణ రోజు కూడా అదే మాట చెప్పిన మహువా.. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం ఇద్దరు చెప్పిన మాటలు నమ్మి తనను దోషిగా నిర్ధారించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీని ప్రశ్నించే వారిని బీజేపీ అణచివేస్తోందని.. ఇందులో భాగంగానే తనపై ఈ కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.