ETV Bharat / bharat

East India company: ఒక ఇండియా.. 4 ఈస్ట్‌ ఇండియాలు!

author img

By

Published : Aug 24, 2021, 7:16 AM IST

1608 ఆగస్టు 24న మొదటిసారిగా బ్రిటిష్​వారు మన గడ్డపై అడుగుపెట్టారు. నాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ (East India company) ప్రతినిధి బృందం గుజరాత్‌లోని సూరత్‌ వద్ద భారత్‌లోకి ప్రవేశించింది. అది మొదలుగా తెల్లవారి అడుగులు మనల్ని మడుగులొత్తించే దిశగా సాగాయి.

east india
ఈస్ట్​ ఇండియా

ఆగస్టు 24.. చరిత్రలో పెద్దగా మనకు గుర్తులేని రోజు! కానీ ప్రత్యేకంగా గుర్తు చేస్తే మాత్రం గుర్తు రాకూడదనుకునే రోజు! బ్రిటిష్‌ వారు మన గడ్డపై అడుగుపెట్టిన రోజు ఇది. 1608, ఆగస్టు 24నాడు... ఈస్ట్‌ ఇండియా కంపెనీ(East India company) ప్రతినిధి బృందం గుజరాత్‌లోని సూరత్‌ వద్ద భారత్‌లోకి ప్రవేశించింది. కెప్టెన్‌ విలియం హాకిన్స్‌కు.. సూరత్‌ వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు అప్పటి మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ అనుమతి మంజూరు చేశారు. అది మొదలుగా తెల్లవారి అడుగులు మనల్ని మడుగులొత్తించే దిశగా సాగాయి.

గమ్మత్తేమంటే.. బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ కంటే ముందే మరో రెండు ఈస్ట్‌ ఇండియా కంపెనీలు ఇక్కడ తిష్టవేసున్నాయి. ఒక బంగారు బాతు ఇండియా కోసం నాలుగు ఈస్ట్‌ ఇండియాలు తపించాయి. ఎవరికి వీలైనంత వారు దోచుకున్నారు.

east india
ఈస్ట్​ ఇండియా

ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని ఈస్ట్‌ ఇండియాకు అర్థం- ఈస్ట్‌ ఇండీ(East India company)స్‌ నుంచి వచ్చింది. ఈస్ట్‌ ఇండీస్‌ (ఆఫ్రికాలోని కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌నకు తూర్పున ఉన్న ప్రాంతం) అంటే ఆసియా. ఆయా దేశాల్లోని బడా కంపెనీలు, బడాబాబులు, వాణిజ్యవేత్తలు ఈ ఈస్ట్‌ ఇండియా కంపెనీల్లో వాటాదారులు. సుగంధ ద్రవ్యాలు, సిల్కు, వస్త్రాలు, బియ్యం, నల్లమందు తదితరాల వాణిజ్యం ద్వారా పెద్దమొత్తాల్లో సంపాదించేవారు.

తొలి అడుగు పోర్చుగీసుది..

సంప్రదాయ రోడ్డు మార్గాలు ముస్లిం పాలకుల చేతిలో ఉండటంతో.. భారత్‌లో వాణిజ్యం కోసం సముద్ర మార్గాల్ని అన్వేషించిన తొలి యూరోపియన్లు పోర్చుగీసువారు. వాస్కోడిగామా 1498 మేలో భారత్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి.. దాదాపు వందేళ్ళపాటు హిందూ మహా సముద్రంపై పెత్తనం చెలాయించారు. వీరిని చూసి.. డచ్‌, బ్రిటిష్‌ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. 1602లో వెరీనిగ్డె ఓస్టిండిచె కంపెనీ (వీఓసీ)పేరిట ఏర్పాటైన డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రపంచంలో ప్రజలకు స్టాక్స్‌ పంచిన తొలి కంపెనీ. తమిళనాడులో, మచిలీపట్నంలో స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా 1664లో ఈస్ట్‌ ఇండియా వేటలో ఫ్రాన్స్‌ అడుగు పెట్టింది.

అన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీలదీ వాణిజ్యమే లక్ష్యమైనా.. స్థానిక రాజ్యాల్లోని రాజకీయ పరిస్థితులను చూశాక ఆశ విస్తరించింది. ఈ క్రమంలో వారి మధ్యే ఆధిపత్యపోరు సాగింది. చివరకు.. వీరందరిలో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ(East India company) బలమైనదిగా ఆవిర్భవించి భారత్‌పై పట్టు బిగించింది.

సూరత్‌లో అడుగిడి..

1599లో ఆరంభమైన బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా(East India company) కంపెనీ.. మొదటి పేరు బ్రిటిష్‌ జాయింట్‌ స్టాక్‌ కంపెనీ. 1608లో నౌకామార్గాన భారత్‌లో ప్రవేశించింది. తూర్పు, పశ్చిమ తీరాల్లో అనేక చోట్ల తమ కంపెనీలు ప్రారంభించింది. అప్పటి భారత్‌లోని వివిధ రాజ్యాలు, బలహీనమైన మొఘల్‌ సామ్రాజ్యం.. రాజకీయ పరిస్థితులను గమనించి క్రమంగా వాణిజ్యం నుంచి భౌగోళిక, రాజకీయ ఆక్రమణలోకి దిగారు. 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్‌ నవాబును ఓడించటంతో ఈస్ట్‌ ఇండియా రాజ్యానికి బీజం పడి.. 1857లో సిపాయిల తిరుగుబాటు దాకా సాగింది. ఆ తర్వాత ఈస్ట్‌ ఇండియా కంపెనీని తప్పించి, బ్రిటిష్‌ ప్రభుత్వం నేరుగా భారత పాలనను తానే చేపట్టింది.

ఇదీ చదవండి:ఆ పోలీసు స్టేషన్‌పై దాడికి వందేళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.