Action Illegal Liquor in TS : 'ఇతర రాష్ట్రాల మద్యం తెస్తే ఊరుకునే ప్రసక్తే లేదు'

author img

By

Published : May 18, 2023, 8:59 AM IST

Action Illegal Liquor in TS

Action Illegal Liquor in Telangana : గోవాకు వెళ్తున్నావ్‌ కదా వచ్చేటప్పుడు మూడు, నాలుగు ఫారిన్ లిక్కర్ బాటిళ్లు తీసుకురా..! హైదరాబాద్ కంటే మద్యం దిల్లీలో చవకగా దొరుకుతుంది.. ఇంటికొచ్చేటప్పుడు నాలుగు మందుసీసాలు పట్టుకురా.. ఇవీ స్నేహితుల మధ్య తరచూ వినిపించే సంభాషణలు. విమానంలో ఇతర ప్రాంతాలకు వెళ్తే.. తిరిగొచ్చేటప్పుడు మద్యం సీసాలు తీసుకురావడం సాధారణంగా జరిగేదే. కానీ ఇకపై ఇది కుదరదు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాకు ఒక్క లిక్కర్ బాటిల్ వెంట తెచ్చుకున్నా.. కేసు తప్పదంటున్నారు ఆబ్కారీ శాఖ అధికారులు.

ఇతర రాష్ట్రాల మద్యంపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ ఎక్సైజ్‌శాఖ

Action Illegal Liquor in Telangana : మద్యం విక్రయాలు రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో.. తెలంగాణ ఆబ్కారీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. శంషాబాద్ విమానాశ్రయాన్ని వేదికగా చేసుకుని ప్రయాణికుల్ని సోదాలు చేయడం ఆరంభించింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో అధికారులు విమానాశ్రయం బయట.. డొమెస్టిక్ ప్రయాణికుల సూటుకేసులు, బ్యాగులు తెరిపించి మరీ సోదాల్లో చేశారు.

తొమ్మిది రోజులుగా గోవా, దిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి.. రూ.16.24లక్షలు విలువ చేసే 1302 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 85 కేసులు నమోదు చేసి... 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు.. రెండు బాటిళ్ల వరకూ అనుమతి ఉందని.. కానీ సుంకం చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క సీసా తెచ్చినా ఉల్లంఘనేనని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.

కేసు నమోదు చేస్తాం : అంతర్జాతీయ విమాన ప్రయాణికులు 2 లీటర్ల వరకు విదేశీ మద్యాన్ని దర్జాగా తెచ్చుకుంటుంటే.. ఒక్క లీటర్ తెచ్చుకున్నా తమపై కేసులేంటని స్వదేశీ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సవరణ చేసిన ఆంధ్రప్రదేశ్​ ఆబ్కారీశాఖ... తమ రాష్ట్రంలో తయారుకానీ మద్యం సీసా ఒక్కటైనా సరే బయట నుంచి తెచ్చుకుంటే.. కేసు నమోదు చేస్తామని తెలిపింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అలాంటి మార్పు చేయకుండానే.. కనీసం అవగాహన కల్పించకుండానే కేసులు పెట్టడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిఘా పెంచిన ఎక్సైజ్‌ అధికారులు : శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే కాదు.. రోడ్డు రైలు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యంపై కూడా ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిఘా పెంచారు. తాజాగా కుత్బుల్లాపూర్ ఎక్సైజ్‌ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. హరియాణా నుంచి డీసీఎంలో తీసుకొస్తున్న 1600లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. 15 మందిని అరెస్టు చేశారు. మూడు కార్లు, ఒక కంటైనర్, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

మరో కేసులో సరూర్‌నగర్, మల్కాజిగిరి స్టేషన్ల పరిధిలో అక్రమంగా మిలటరీ మద్యాన్ని విక్రయిస్తున్న 29 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 350లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది సొంతంగా మద్యం తయారుచేసి లేబుల్స్ వేసి అమ్మకాల కొనసాగిస్తున్నారని.. గతంలో ఒడిశాలో పలువురిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మద్యం అమ్మకం ద్వారా ఖజానాకు ఏ మాత్రం గండిపడకుండా.. పకడ్బందీగా ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న మద్యంపై ఎక్సైజ్‌శాఖ అధికారులు డేగ కన్ను వేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. జైలుకే అంటూ హెచ్చరిస్తున్నారు.

"ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క బాటిల్‌ మద్యం తీసుకొచ్చినా చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తాం. విమానయాన సంస్థలు 5 లీటర్ల మద్యానికి అనుమతించినా ఎక్సైజ్‌ అధికారులు అనుమతించరనే విషయం గుర్తించాలి. విదేశాల నుంచి వచ్చేవారు మాత్రం రెండు బాటిల్స్ తీసుకురావడానికి అనుమతిస్తాం." - శ్రీనివాస్‌గౌడ్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి

ఇవీ చదవండి : Telangana Cabinet Meeting Today : నేడు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే.. డిప్యూటీ సీఎంగా డీకే.. మే 20న ప్రమాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.