ETV Bharat / bharat

Telangana Assembly Election Results 2023 Live : 33 జిల్లాల్లో సత్తా చాటిన హస్తం అభ్యర్థులు వీళ్లే- ఈ వివరాలు మీకోసం

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:47 PM IST

Telangana Assembly Election Results 2023 Live : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోస్పష్టమైన మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్‌.. సగం ఉమ్మడి జిల్లాల్లో ప్రభంజనం సృష్టించింది. ఊహించినట్టుగానే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం మినహా మిగతా నియోజకవర్గాలన్నింటినీ స్వీప్‌ చేయగా కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో అంచనాలను తలకిందులు చేస్తూ విజయకేతనం ఎగురవేసింది. 2018 ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని స్థానాలను సైతం గెలుచుకున్న హస్తం పార్టీ, పలుచోట్ల గులాబీ కంచు కోటలను బద్దలుకొట్టింది.

Telangana Assembly Election Results 2023 Live
Telangana Assembly Election Results

Telangana Assembly Election Results 2023 Live : 33 జిల్లాల్లో సత్తా చాటిన అభ్యర్థులు వీళ్లే- ఈ వివరాలు మీకోసం

Telangana Assembly Election Results 2023 Live : "మార్పు కావాలి - కాంగ్రెస్‌ రావాలి" నినాదంతో ఎన్నికల సమరం సాగించిన హస్తం పార్టీ, స్పష్టమైన మెజార్టీతో అధికార బీఆర్ఎస్​ను గద్దె దించటంలో సఫలీకృతమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అంతగా ప్రభావం చూపని చోట కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోయింది. గులాబీ పార్టీకి కంచుకోటగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌, మెదక్‌, నిజామాబాద్ జిల్లాల్లో సత్తాచాటి సొంతబలంతో అధికారాన్ని కైవసం చేసుకుంది.

ఉమ్మడి ఖమ్మంలో సత్తాచాటిన కాంగ్రెస్ పార్టీ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనంలోనూ ఉమ్మడి ఖమ్మంలో 9 నియోజకవర్గాలను గెల్చుకుని సత్తా చాటిన కాంగ్రెస్‌ పార్టీ, ఈ ఎన్నికల్లోనూ అదేస్థాయిలో సత్తాచాటింది. బీఆర్ఎస్ తరఫున భద్రాచలంలో తెల్లం వెంకట్రావు మినహాయిస్తే, మిగతా వారందరూ ఓటమి పాలయ్యారు. అశ్వారావుపేటలో ఆదినారాయణరావు, ఇల్లెందులో కోరం కనకయ్య విజయం సాధించారు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధిరలో మల్లు భట్టి విక్రమార్క, వైరాలో మాలోతు రాందాస్, సత్తుపల్లి మట్టా రాగమయితో పాటు మిత్రపక్షం సీపీఐ తరఫున కొత్తగూడెంలో పోటీచేసిన కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.

కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్

District Wise Assembly Election Results 2023 : అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ హస్తం పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 12 నియోజకవర్గాలకు 2018 ఎన్నికల్లో హుజుర్‌నగర్‌, నకిరేకల్‌, మునుగోడులో మాత్రమే గెలుపొందిన కాంగ్రెస్‌, మిగతా అన్ని స్థానాలను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఒక్క సూర్యాపేట మినహాయిస్తే, అన్నిచోట్ల విజయఢంకా మోగించింది. సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి జగదీశ్‌రెడ్డితో హోరాహోరీగా తలపడిన కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, భువనగిరిలో కుంభం అనిల్ కుమార్‌రెడ్డి విజయం సాధించారు. దేవరకొండలో బాలునాయక్, నాగార్జున సాగర్‌లో జానారెడ్డి తనయుడు కుందూరు జైవీర్‌రెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, కోదాడలో ఉత్తమ్‌ పద్మావతి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, తుంగతుర్తిలో మందుల సామేలు విజయం సాధించారు.

Mahabubnagar Election Results 2023 Live : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో హస్తం హవా కొనసాగింది. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్‌ 12చోట్ల గెలుపొందగా, బీఆర్ఎస్ 2 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థులు కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేటలో వంశీకృష్ణ, దేవరకద్రలో మధుసూధన్‌ రెడ్డి, జడ్చర్లలో అనిరుధ్‌రెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్‌లో వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌లో రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్‌లో చిట్టెం పర్ణికారెడ్డి, షాద్‌నగర్‌లో శంకరయ్య, వనపర్తిలో మేఘారెడ్డి విజయం సాధించారు. కేవలం రెండు స్థానాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. అలంపూర్‌లో విజయుడు, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఓటమి పాలయ్యారు.

kodangal, Telangana Election Result 2023 LIVE: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి విజయం - కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానంటూ ఎమోషనల్

Warangal Election Results 2023 Live : తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. హస్తం హవాకు 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి ఎర్రబెల్లికి సైతం పరాజయం తప్పలేదు. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి మినహాయిస్తే, బీఆర్ఎస్​కు చెందిన మిగతా అభ్యర్థులందరూ ఓటమి చెందారు. ములుగు నుంచి సీతక్క, మహబూబాబాద్ నుంచి మురళీనాయక్‌, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట నుంచి నాగరాజు, భూపాపల్లిలో గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ స్థానంలో నాయిని రాజేందర్‌రెడ్డి, డోర్నకల్‌లో రామచంద్రనాయక్ గెలుపొందారు.

Karimnagar Election Results Live 2023 : రాష్ట్రావిర్భావం అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనే కాకుండా ఉద్యమ సమయంలో జరిగిన ఉపఎన్నికల్లో కారుకు జైకొట్టిన ఉమ్మడి కరీంనగర్‌ ప్రజానీకం, ఈ ఎన్నికల్లో మాత్రం విభిన్న తీర్పునిచ్చింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో 2014లో 12 స్థానాలను, 2018లో 11 నియోజకవర్గాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో మంథనిలో మాత్రమే గెలుపొందిన హస్తం పార్టీ, ఈ సారి 8 నియోజకవర్గాలను కొల్లగొట్టింది. బీఆర్ఎస్ ఐదు నియోజకవర్గాలకే పరిమితమైంది.

కాంగ్రెస్‌ నుంచి రామగుండంలో రాజ్‌ఠాకూర్, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌, పెద్దపల్లిలో విజయరమణారావు, వేములవాడలో ఆది శ్రీనివాస్, మంథని నియోజకవర్గంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హూస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌, మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి కరీంనగర్‌లో గంగుల కమలాకర్, హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి, జగిత్యాల నుంచి సంజయ్‌కుమార్, కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్, సిరిసిల్లలో కేటీఆర్‌ మాత్రమే గెలుపొందారు.

CM KCR Resigned : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా - గవర్నర్ తమిళిసై ఆమోదం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సొంత జిల్లాల ఉమ్మడి మెదక్‌లోనూ ముగ్గురు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. 10 నియోజకవర్గాలున్న మెదక్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ ఏడు స్థానాలను గెలుచుకుంది. గజ్వేల్‌లో కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు, దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి, పటాన్‌చెరులో మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, జహీరాబాద్‌లో మాణిక్‌రావు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి ఆందోల్‌లో పోటీచేసిన దామోదర రాజనరసింహ, మెదక్‌లో మైనంపల్లి రోహిత్, నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి గెలుపొందారు.

Nizamabad Election Results 2023 Live : ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మూడు పార్టీలకు పట్టం కట్టారు. 9 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో కాంగ్రెస్‌ నాలుగు చోట్ల, బీజేపీ 3 చోట్ల, బీఆర్ఎస్ 2 నియోజకవర్గాలను గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌ తరఫున బోధన్‌లో పోటీచేసిన సుదర్శన్‌రెడ్డి, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు, నిజామాబాద్‌ రూరల్‌లో భూపతిరెడ్డి, ఎల్లారెడ్డిలో మదన్‌మోహన్‌రావు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులు ఆర్మూర్‌లో రాకేశ్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌లో ధన్‌పాల్‌ సూర్యనారాయణ, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపొందారు.

గాంధీభవన్​ వద్ద అంబరాన్నంటిన సంబురాలు

బీఆర్ఎస్ నుంచి బాల్కొండలో పోటీచేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే విజయం సాధించారు. కామారెడ్డిలో తొలి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధిక్యత ప్రదర్శించినా, ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలపై సంచలన విజయం సాధించారు. కామారెడ్డి పోరులో కేసీఆర్ రెండో స్థానంలో నిలువగా, రేవంత్‌రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు.

Adilabad Election Results 2023 Live : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు సైతం విభిన్న తీర్పునిచ్చారు. 10 నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో 9 సీట్లను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ, ఈసారి కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వినోద్‌, చెన్నూరులో వివేక్‌ వెంకటస్వామి, ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులు ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్‌, ముథోల్‌లో రామారావు పవార్, నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి, సిర్పూర్‌లో హరీశ్‌బాబు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, బోథ్‌లో అనిల్‌ జాదవ్‌ గెలుపొందారు. సిర్పూర్​లో పోటీచేసిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండో స్థానానికి పరిమితమయ్యారు.

Revanth Reddy, Telangana Election Result 2023 Live : 'ప్రగతిభవన్ పేరును అంబేడ్కర్ ప్రజా భవన్​గా మారుస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.