ETV Bharat / bharat

ప్రభుత్వ ఖజానా నింపిన 114ఏళ్ల నాటి టేకు చెట్టు.. ఎంత పలికిందో తెలుసా?

author img

By

Published : Feb 21, 2023, 11:02 PM IST

114 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు నాటిన నీలాంబురి టేకు చెట్టు ఏకంగా రూ.39.29 లక్షలకు అమ్ముడుపోయి ఆ రాష్ట్ర అటవీ శాఖ ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కాగా, దీన్ని లారీలో తరలించే సమయంలో అక్కడి టింబర్​ డిపోకు భారీగా జనం చేరుకున్నారు. దీంతో ఇప్పుడు అందరూ ఈ టేకు చెట్టు గురించే చర్చించుకుంటున్నారు.

114 Year Old Teak Tree Sold In Lakhs
లక్షల్లో అమ్ముడుపోయిన 114 ఏళ్ల టేకు చెట్టు

114 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు నాటిన నీలాంబురి టేకు చెట్టుకు వేలంలో రికార్డు ధర పలికింది. అటవీ శాఖ నిర్వహించిన వేలంలో ఈ టేకును దాదాపు రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ టేకు వృక్షం ప్రభుత్వ అధీనంలోని సంరక్షణ ప్రాంతంలో కూలిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకొని వేలంలో ఉంచారు అధికారులు. నెదుంకాయం అటవీ డిపోలో దీన్ని వేలానికి ఉంచగా.. బృందావన్ టింబర్స్ యజమాని అజీశ్ కుమార్ రూ.39.25 లక్షలకు దాన్ని కొనుగోలు చేశారు. 8 క్యూబిక్ మీటర్ల మందంతో ఉన్న ఈ టేకును.. మూడు భాగాలుగా చేసి విక్రయించారు. 3 మీటర్ల పొటవు ఉన్న పెద్ద భాగానికి రూ.23 లక్షలు, మిగిలిన రెండు భాగాలకు రూ.11లక్షలు, రూ.5.25 లక్షలు చొప్పున వచ్చాయి. ఫిబ్రవరి 10న ఈ వేలం జరిగింది.

114 Year Old Teak Tree Sold In Lakhs
రూ.39.29 లక్షలకు అమ్ముడుపోయిన 114 ఏళ్ల టేకు చెట్టు

ఈ టేకును 1909లో బ్రిటిషర్లు నాటారు. ఈ టేకు చెట్లను అధికారులు సంరక్షిస్తూ ఉంటారు. కావాలని కొట్టేసిన వృక్షాలను వేలానికి ఉంచరు. ఎండిపోయి, దానంతట అదే పడిపోయిన వృక్షాలను మాత్రమే వేలం వేస్తారు. తాజా వేలంలో రికార్డు ధర రావడంపై నెదుంకాయం డిపో అధికారి షెరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ టేకుకు భారీ ధర వస్తుందని ముందుగానే ఊహించామని, అయితే ఈ స్థాయిలో అమ్ముడు పోతుందని అనుకోలేదని అన్నారు. 'ఇది అత్యంత నాణ్యమైన టేకు. ఈ ధర రావడం చాలా సంతోషంగా ఉంది. నీలాంబురి టేకు కొత్త బెంచ్​మార్క్ సృష్టించినట్లైంది. నీలాంబురి టేకుకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే తొలిసారి టేకును పెంచడం ప్రారంభించింది ఇక్కడే' అని షెరీఫ్ తెలిపారు.

114 Year Old Teak Tree Sold In Lakhs
రూ.39.29 లక్షలకు అమ్ముడుపోయిన 114 ఏళ్ల టేకు చెట్టు

టేకును వేలంలో దక్కించుకున్న బృందావన్ టింబర్స్ యజమాని.. తరచుగా బిడ్డింగ్​లో పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. 'నాణ్యమైన కలప కొనుగోలు చేసేందుకు వారు ఎప్పుడూ ముందుకు వస్తారు. ఇంత మంచి టేకును కొనడం పట్ల ఆయన కూడా సంతోషంగా ఉన్నారు. వేలంలో చాలా పోటీ ఉంది. మూడు మీటర్ల పొడవుగా ఉన్న ఇలాంటి టేకు దొరకటం చాలా అరుదు' అని అధికారులు చెప్పారు. టేకును దక్కించుకున్న అజీశ్ కుమార్.. కేరళ అటవీ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. లారీలో ఎక్కించి టేకును తిరువనంతపురానికి తీసుకెళ్తున్నారు అజీశ్. ఇందుకోసం అదనంగా రూ.15వేలు వెచ్చిస్తున్నారు.

బ్రిటిష్ కాలం నాటి మలబార్ కలెక్టర్ హెచ్​వీ కనోలీ.. ఈ ప్రాంతంలో టేకు మొక్కలు నాటించారు. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి కనోలీ ప్లాట్​గా పేరు వచ్చింది. ప్రపంచంలో తొలిసారి టేకు మొక్కలు నాటింది ఇక్కడేనని చెబుతుంటారు. ప్రస్తుతం నీలాంబుర్​లోని 2.31 హెక్టార్ల విస్తీర్ణంలో టేకు చెట్లు ఉన్నాయి. ఇక్కడే టేకు మ్యూజియం, ప్రపంచంలోని పురాతన టేకుగా పరిగణించే 'కన్నిమరి'తో చేసిన ఇళ్లు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.