ETV Bharat / bharat

Chandrababu Comments: రైతులకు వారంలోగా పరిహారమివ్వాలి.. లేకుంటే ఉద్యమమే:చంద్రబాబు

author img

By

Published : May 13, 2023, 7:22 AM IST

Chandrababu Comments
Chandrababu Comments

Chandrababu Fires on CM Jagan: రైతు పోరుబాటే జగన్‌ పార్టీకి అంతిమయాత్ర కాబోతోందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రైతుల నుంచి వసూలు చేసిన ప్రతి పైసా వారం రోజుల్లో చెల్లించడంతో పాటు... పంటలకు పరిహారం ఇవ్వకపోతే... ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు. పోరాటానికి రైతులంతా సిద్ధం కావాలని తణుకు బహిరంగసభలో పిలుపునిచ్చారు.

రైతులకు వారంలోగా పరిహారమివ్వాలి.. లేకుంటే ఉద్యమమే

Chandrababu Fires on CM Jagan: ధాన్యం సమస్యలు పరిష్కారించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. రైతు పోరుబాటలో భాగంగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు.. మండుటెండలోనూ చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక ఆకుల శ్రీరాములు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకొస్తామని 72 గంటలు డెడ్‌లైన్‌ విధించినా సీఎంలో చలనం లేదని చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నిద్రలేని రాత్రులు గడిపితే... ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆక్షేపించారు.

ధాన్యం విక్రయిస్తే ఎక్కడైనా రైతులకు డబ్బులిస్తారని... కానీ మన రాష్ట్రంలో రైతుల నుంచే దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే... ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పర్యటించే ప్రాంతాల్లో రైతులను ప్రభుత్వం బెదిరిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యం చూపేందుకు వచ్చిన రైతులను పోలీసులు అమానుషంగా అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సామర్థ్యం ఉంటే రైతుల సమస్యలు పరిష్కరించాలి కానీ వారిని భయపెట్టడం తగదన్నారు.

‘‘కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకొస్తానని.. 72 గంటల డెడ్‌లైన్‌ ఇచ్చినా సీఎంలో చలనం లేదు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నిద్రలేని రాత్రులు గడిపితే చేతగాని ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల సమస్యలు పట్టించుకోకపోగా నాపై ఎదురుదాడి చేస్తున్నారు. నేను పర్యటించే ప్రాంతాల్లో రైతులను బెదిరిస్తున్నారు. సమస్యలు చెప్పేందుకు వస్తుంటే వారిని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరసన తెలియజేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని హరించడానికి పోలీసులు ఎవరు?-చంద్రబాబు, టీడీపీ అధినేత

రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల మేర పంట నష్టం జరిగితే ఆ వివరాలు ఎందుకు బయటపెట్టరని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బస్తాకి అదనంగా 2 కిలోలు ఎందుకు తీస్తున్నారో చెప్పాలని నిలదీశారు. రైస్‌ మిల్లర్లను దళారులుగా మార్చి దోచుకుంటున్నారని ఆరోపించారు.

"రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పరిహారం ఎందుకివ్వరు? ఈ ప్రభుత్వం రైస్‌మిల్లర్లను దళారులుగా చేసింది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బీమా.. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకునేవాళ్లం. ఇప్పుడు అవేమీ లేవు. తేమ, మొలక వచ్చిన ధాన్యం కొంటామన్నారు గానీ.. ఎక్కడా కొనలేదు"-చంద్రబాబు, టీడీపీ అధినేత

నూక, తేమ, రవాణా పేరుతో రైతుల నుంచి వసూలు చేసిన డబ్బును వెనక్కి ఇవ్వాలని.., నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వారంలోగా డిమాండ్లు పరిష్కరించకుంటే... తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. చుక్కల భూముల్లో సర్వే పేరుతో వైసీపీ నాయకులు దందా చేస్తున్నారని విమర్శించారు.

"రైతుల నుంచి నూక, తేమ, రవాణా పేరుతో వసూలుచేసిన మొత్తం వెనక్కి ఇవ్వాలి. మొక్కజొన్న, వరికి నష్టపరిహారంగా ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలి. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.50వేలు చెల్లించాలి. తడిసినా, మొలకలొచ్చినా, తేమ, నూక శాతాలతో ప్రమేయం లేకుండా మద్దతు ధర అందించాలి. రైతులకు రవాణా, హమాలీ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించాలి. ఈ నాలుగు డిమాండ్లు వారంలోగా పరిష్కరించాలి.. లేకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తాం"-చంద్రబాబు, టీడీపీ అధినేత

బహిరంగ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో-1ను హైకోర్టు కొట్టేయడం ప్రజాస్వామ్య విజయంగా చంద్రబాబు అభివర్ణించారు. ఈనాడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుండటంతోనే.. మార్గదర్శిపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

"ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో1ను హైకోర్టు కొట్టేయడం ప్రజాస్వామ్య విజయం. హైకోర్టు తీర్పుతో అయినా బుద్ధి వస్తుందో లేదో చూడాలి. నేను ఆంక్షలు పెట్టి ఉంటే నువ్వు సభలు ఎక్కడ పెట్టేవాడివి.. పాదయాత్ర ఎలా చేసేవాడివి? ప్రభుత్వ వైఫల్యాలను ‘ఈనాడు’ ఎత్తిచూపడంతో ‘మార్గదర్శి’పై దాడులు చేస్తున్నారు"-చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.