ETV Bharat / bharat

తమిళనాడును వదలని వర్షాలు.. 12కి చేరిన మృతులు

author img

By

Published : Nov 11, 2021, 6:41 AM IST

tn floods
తమిళనాడు వరదలు

తమిళనాడులో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు చేరింది. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నవంబర్ 10, 11 తేదీల్లో సెలవును ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 12కి చేరింది. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గురువారం ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో మరో మూడు, నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడుతో పాటు.. పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.

Tamil Nadu rains
చెన్నైలోని అశోక్ నగర్​ జలదిగ్భందం

వరద ప్రభావిత ప్రాంతాల్లో 11 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు, 7 ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలను మోహరించినట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ తెలిపారు. చెన్నైతో పాటు.. చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Tamil Nadu rains
చెన్నైలోని అశోక్ నగర్​ జలదిగ్భందం

మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాలైన చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు నవంబర్ 10, 11 తేదీల్లో సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

Tamil Nadu rains
చెన్నైలోని అశోక్ నగర్​ జలదిగ్భందం

అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో సాధారణం కంటే 50 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 90 ప్రధాన రిజర్వాయర్లలో 53 డ్యాంలు 76 శాతం పరిమితిని మించాయని అధికారులు తెలిపారు. థెర్వోయ్ కందిగై రిజర్వాయర్ 100 శాతం నిండినట్లు వెల్లడించారు.

పొంచి ఉన్న మరో ప్రమాదం..

మరోవైపు.. నవంబరు 13 వరకు చెన్నై తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.