ETV Bharat / bharat

3 నిమిషాల్లో 19 ఇడ్లీలు తిని.. విజేతలుగా నిలిచి..​

author img

By

Published : Nov 16, 2021, 12:39 PM IST

Updated : Nov 16, 2021, 1:15 PM IST

మూడు నిమిషాల్లో మీరు ఎన్ని ఇడ్లీలు తినగలరు? మహా అయితే ఒకటి లేదా రెండు కదూ! కానీ, ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం 3 నిమిషాల్లోనే 19 ఇడ్లీలు ఆరగించారు. ఇంతకీ ఎవరు వారు? ఎందుకలా చేశారు? అలా తిని వారు ఏం సాధించారు?

idly-eating competition
ఇడ్లీ తినే పోటీ

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో 'ఇడ్లీ' పోటీ

తమిళనాడు అంటే.. టక్కున గుర్తొచ్చే ఆహార పదార్థం ఇడ్లీ సాంబార్​. అయితే.. ఇటీవల చాలా మంది ఇడ్లీలను కాదని ఫాస్ట్​ఫుడ్​కు అలవాటు పడుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇడ్లీ తింటే కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించేలా 'ఇడ్లీ తినే పోటీ'ని(Idli eating competition) నిర్వహించింది ఓ హోటల్ యాజమాన్యం. ఈ పోటీలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు.. కేవలం 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు తిని, అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈరోడ్​ జిల్లా(Tamil nadu erode news) కడయంపట్టి ప్రాంతంలో పట్టాయ కేటరింగ్​ యాజమాన్యం ఈ 'ఇడ్లీ' పోటీని(Idli eating competition) నిర్వహించింది. ఇడ్లీలు తింటే ఎలాంటి అనారోగ్యానికి గురికారని చెప్పేందుకే తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలిపారు. తమిళ కమెడియన్ వైయా​పురి ఈ కార్యక్రమానికి హాజరై పోటీని ప్రారంభించారు.

idly-eating competition
పోటీదారుకు ఇడ్లీలు వడ్డిస్తున్న నిర్వాహకులు
idly-eating competition
పోటీలో ఇడ్లీలు తింటున్న వ్యక్తి
idly-eating competition
విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం

వేగంగా తిన్నవారే విజేత..

ఇందులో పాల్గొనేవారికి కొన్ని నిబంధనలు విధించారు నిర్వాహకులు. 10 నిమిషాల గడువులో ఎక్కువ ఇడ్లీలు తినాలి. తిన్న తర్వాత 5 నిమిషాల వరకు వాంతి చేసుకోకూడదు. 19-30 ఏళ్ల వయసు వారు, 31-40 ఏళ్ల వయసు వారు, 41-50 ఏళ్ల వయసు వారిని గ్రూపులుగా విభజించి ఈ పోటీని నిర్వహించారు. ప్రతి గ్రూపులో 25 మంది వరకు పాల్గొని, ఇడ్లీలు తిన్నారు.

3 నిమిషాల్లోనే 19 ఇడ్లీలు తిని..

31-40 ఏళ్ల వయసు గ్రూపులో కుమార పాలయం ప్రాంతానికి చెందిన రవి, 41-50 ఏళ్ల వయసు గ్రూపులో భవానీ ప్రాంతానికి చెందిన రామలింగం.. కేవలం 3 నిమిషాల్లోనే 19 ఇడ్లీలను ఆరగించారు. పోటీలో పాల్గొన్న మిగతావారెవరూ కూడా 10 నిమిషాల్లో 19 ఇడ్లీలను తినలేకపోయారు. దాంతో వీరిద్దరూ ప్రథమ విజేతలుగా నిలిచారు.

ప్రతి గ్రూపులో ప్రథమ విజేతగా నిలిచిన వారికి రూ.5,000, రెండో విజేతకు రూ.3,000, మూడో విజేతకు రూ. 2,000, నాలుగో విజేతకు రూ.1,000 చొప్పున నగదు బహుమతులను నిర్వాహకులు అందించారు. జిల్లా డీఎస్​పీ షణ్ముగం ఈ కార్యక్రమానికి హాజరైన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజలంతా సహజ ఆహార పదార్థాలనే తినాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకుని..

Last Updated :Nov 16, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.