ETV Bharat / bharat

Swamiji Rape on Girl: కీచక స్వామీజీ.. బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. కాళ్లకు గొలుసులు కట్టి

author img

By

Published : Jun 20, 2023, 10:20 AM IST

Swamiji Rape on Girl in Visakha: ఆశ్రమంలో సేవలు చేసేందుకు వచ్చిన అనాథ బాలికను స్వామీజీ లైంగికంగా వేధించాడు. రెండేళ్లపాటు అత్యాచారం చేశాడు.. అంతటితో ఆగకుండా ఏడాదిగా తన గదిలోనే కాళ్లకు సంకెళ్లు వేసి బంధించి మరీ లైంగిక దాడి చేశాడు.. చివరకు ఎలాగలాగో తప్పించుకుని రైలు ఎక్కింది. ఆ బాలికను రైలులోని ఓ మహిళ చేరదీసింది. చివరకు విజయవాడలోని చైల్డ్​ వెల్ఫేర్‌ కమిటీ వసతి గృహానికి రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. స్వామీజీ ఆకృత్యాలు బయటకు వచ్చాయి.

Swamiji Rape on Girl in Visakha
Swamiji Rape on Girl in Visakha

Swamiji Rape on Girl in Visakha: ఆశ్రమంలో చేరిన తనపై స్వామీజీ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఓ అనాథ బాలిక ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన పోలీసులు అతడిని సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. బాధితురాలు తెలిపిన ప్రకారం.. రాజమహేంద్రవరం నగరానికి చెందిన బాలిక (15) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో బంధువులు రాజమహేంద్రవరం సమీపంలోని ఓ హాస్టల్‌లో చేర్చారు. అక్కడ ఐదో తరగతి వరకు చదివింది. అనంతరం వారు బాలికను రెండేళ్ల క్రితం కొందరు సాధువుల ద్వారా విశాఖలోని జ్ఞానానంద, రామానంద ఆశ్రమంలో సేవల నిమిత్తం పంపించారు.

అక్కడ బాలికతో ఆవులకు మేత వేయించడం, వాటి పేడను తొలగించడం వంటి పనులను ఆశ్రమ స్వామీజీ పూర్ణానంద చేయించేవాడు. అర్ధరాత్రి అయ్యాక బాలికను తనతో పాటు గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. సంవత్సరం నుంచి బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించాడు. ఎదురుతిరిగితే కొట్టేవాడు. రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవాడు. రెండు వారాలకు ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లాల్సి వచ్చేది. కాలకృత్యాలకు కూడా అనుమతించే వాడు కాదు. బకెట్‌లోనే విసర్జించాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇలా తనని రెండు సంవత్సరాలుగా హింసించే వారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

పనిమనిషి సాయంతో బయటకు: ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన.. అక్కడున్న పనిమనిషి నుంచి డబ్బులు తీసుకుని ఆశ్రమం నుంచి బాలిక బయటపడింది. ఆటోలో నేరుగా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకుని, అక్కడ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. అక్కడ ఓ మహిళా ప్రయాణికులు ఆ బాలికను గమనించి వివరాలు ఆరా తీసింది. తాను అనాథనని, ఆశ్రమం నుంచి తప్పించుకుని బయటకు వచ్చానని వివరించింది. దీంతో ఆమె.. బాలికను తనతో పాటు రాజమహేంద్రవరం తీసుకెళ్లింది. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని తన సోదరి ఇంటికి బాలికను తీసుకుని వచ్చింది. అక్కడ ఇరుగుపొరుగు వారి సలహా మేరకు హాస్టల్‌లో చేర్చేందుకు ఆమె ప్రయత్నించింది.

పోలీసుస్టేషన్‌ నుంచి లేఖ తీసుకొస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో కంకిపాడు పీఎస్‌కు వెళ్లారు. అక్కడ విషయం చెప్పి.. వారు ఇచ్చిన లేఖను తీసుకుని సీడబ్ల్యూసీకి వెళ్లారు. ఆశ్రమంలో అనుభవించిన నరకాన్ని విజయవాడలోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు బాలిక వివరించింది. భోజనం కూడా పెట్టకుండా దారుణంగా వ్యవహరించాడని బాలిక వివరించింది. మందులు ఇచ్చే వాడని వేసుకోకపోతే కొట్టేవాడని స్వామీజీ గురించి ఎవరికైనా చెప్పినా నమ్మేవారు కాదంది. ఆశ్రమంలో మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారని, అందులో తాను ఒక్కదానినే బాలికను అని వివరించింది. గతంలో మరో బాలికపైనా అత్యాచారం చేశాడని చెప్పింది. స్వామీజీని కఠినంగా శిక్షించి.. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతోంది.

సీడబ్ల్యూసీ సభ్యులు బాలికను విజయవాడలోని దిశ పోలీసుస్టేషన్‌కు పంపించారు. అక్కడ బాలికను విచారించిన పోలీసులు.. ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. పూర్ణానంద స్వామీజీని నిందితుడిగా చేర్చారు. సెక్షన్‌ 376, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 6 కింద స్వామీజీపై కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మరోవైపు విశాఖ పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు.. ఆశ్రమ భూములు కొట్టేయాలని కొందరు చూస్తున్నారని, ఇందులో భాగంగానే కుట్ర జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తానన్నారు. తమ ఆశ్రమంలో ఉండే ఓ బాలిక అదృశ్యమైందని ఆశ్రమ నిర్వాహకులు ఈ నెల 15న ఫిర్యాదు చేయగా.. తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.