ETV Bharat / bharat

ఉచిత హామీల విచారణకు త్రిసభ్య ధర్మాసనం.. గుర్తులను తొలగించాలన్న పిటిషన్‌ తిరస్కరణ

author img

By

Published : Nov 2, 2022, 8:53 AM IST

రాజకీయ నాయకులు ఇచ్చే ఉచిత హామీలను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటీషన్లపై విచారణను జరపనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది.

supreme-court-electoral-freebies-revdi-issue-ramana
supreme-court-electoral-freebies-revdi-issue-ramana

Supreme Court On Freebies : ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పక్షాలు పోటీపడుతూ ప్రజలకు ఇస్తున్న అపరిమిత ఉచిత హామీలను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను త్రిసభ్య ధర్మాసనం చేపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిఫరెన్స్‌ ఆర్డర్‌ ప్రకారం ఉచిత హామీల వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సీజేఐ తెలిపారు.

ఆ ధర్మాసనం చేపట్టే కేసుల జాబితాలో చేర్చేలా ఆదేశాలిచ్చేందుకు గాను సంబంధిత రికార్డులన్నీ తన ముందుంచాలని జస్టిస్‌ యు.యు.లలిత్‌ సూచించారు. ప్రాధాన్యం గల అంశమైనందున సత్వరమే విచారణకు వచ్చేలా చూస్తామన్నారు. విశాల ప్రజాహితం దృష్ట్యా ... నిర్హేతుకమైన ఉచిత హామీలు ఇవ్వకుండా నియంత్రణ విధించడం కోసం ఒక నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్లలో ఒకరైన అశ్వినీ ఉపాధ్యాయ్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రవాసులు, వలస కార్మికుల ఓటుహక్కుపై పిల్‌ల మూసివేత
పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో లేదా తమ ప్రతినిధుల ద్వారా ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), వలస కార్మికులను అనుమతించాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దాఖలైన కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు మంగళవారం మూసివేసింది. వారిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములుగా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందంటూ అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి హామీ ఇవ్వడంతో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అటార్నీ జనరల్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా సంబంధిత పిల్‌లను సాగదీయడంలో అర్థం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

సుఖ్‌బీర్‌సింగ్‌పై కేసు.. స్టే..
ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందేందుకు శిరోమణి అకాలీదళ్‌ ఫోర్జరీ పత్రాలను సమర్పించిందంటూ ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఇతరులకు వ్యతిరేకంగా ట్రయల్‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులకు సమన్లు జారీ చేస్తూ హొషియార్‌పుర్‌ అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు విచారించింది.

ఏడాదిన్నరపాటు కేసును ఎందుకు పక్కనపెట్టారు?
విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న ఓ కేసును దాదాపు ఏడాదిన్నరపాటు తమ రిజిస్ట్రీ పక్కనపెట్టడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ దాన్ని ఎందుకు విచారణ కోసం లిస్టింగ్‌ చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చట్టం-1971లోని ఓ నిబంధనకు సంబంధించి ఆర్‌.సుబ్రమణియన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ వ్యవహారంలో సుప్రీం ఈ మేరకు స్పందించింది.

'ప్రసారాల లైసెన్స్‌ రెన్యువల్‌కు భద్రత అనుమతులు అక్కర్లేదు'
టీవీ ఛానళ్ల ప్రసారాల లెసెన్సు రెన్యువల్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రతపరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరంలేదని మలయాళం న్యూస్‌ ఛానెల్‌ ‘మీడియా వన్‌’ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మీడియా వన్‌ టీవీ ఛానెల్‌ ప్రసారాలపై కేంద్ర ప్రభుత్వ నిషేధాన్ని కేరళ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ ఛానెల్‌ యాజమాన్యం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై విచారణను జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ప్రారంభించగా..పిటిషనర్‌ వాదనలు వినిపించారు. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ (నియంత్రణ) చట్టం-1995 ప్రకారం...ప్రసారాల లైసెన్సు రెన్యువల్‌కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ అవసరంలేదని తెలిపారు. వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.

చట్టాల ముసాయిదాను వెబ్‌సైట్లో ఉంచాలన్న పిల్‌ కొట్టివేత
పార్లమెంటులో, శాసనసభల్లో చట్టాలు చేయడానికి కనీసం 60 రోజుల ముందుగా వాటి ముసాయిదాలను ప్రభుత్వ వెబ్‌సైట్లలో ప్రముఖంగా ప్రదర్శించి, ప్రజలకు అందుబాటులో ఉంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణకు చేపట్టేందుకు మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. చట్టాలను ప్రాంతీయ భాషల్లో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రజలకు వాటి గురించి తెలియజేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆశాభావం వ్యక్తంచేసింది. ముసాయిదా చట్టాలను ప్రచురించాలని ప్రభుత్వాన్ని తాము ఆదేశించడం సబబు కాదని అభిప్రాయపడింది. అది పూర్తిగా ప్రభుత్వాలకు సంబంధించిన విషయమని పేర్కొంటూ పిల్‌ను కొట్టివేసింది. దీనిని అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేశారు.

గుర్తులను తొలగించాలన్న పిటిషన్‌ తిరస్కరణ
బ్యాలెట్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం (ఈవీఎం) నుంచి పార్టీ గుర్తులను తొలగించి అభ్యర్థుల ఫొటో, వయసు, విద్యార్హతలు ఉంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ఎన్నికల సంఘం, పోలింగ్‌ ప్యానెల్‌ ఉన్నతాధికారులను ఆశ్రయించాలని పిటిషనర్‌, న్యాయవాది అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం సూచించింది.

ఇదీ చదవండి:తీగల వంతెనపై కారు నడిపిన పర్యటకులు

మోర్బీ ఆస్పత్రికి మోదీ.. బాధితులకు పరామర్శ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.