ETV Bharat / bharat

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. సెషన్స్​ కోర్టులోనే విచారణ జరపాలి: సుప్రీం

author img

By

Published : Feb 27, 2023, 3:33 PM IST

SC ON EX MINISTER NARAYANA
SC ON EX MINISTER NARAYANA

SC ON EX MINISTER NARAYANA :టెన్త్​ క్లాస్​ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సెషన్స్‌ కోర్టులోనే విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

SC ON EX MINISTER NARAYANA PETITION : పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి పొంగులేటి నారాయణ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులోనే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టుకు వెళ్లవచ్చన్న సుప్రీంకోర్టు.. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీం ముగించింది.

2023 జనవరి 6న పేపర్‌ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిల్​ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పై నారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్​పై విచారణ జరిపిన సుప్రీం.. గతంలో బెయిల్​ రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీ చేసింది.

అసలేం జరిగింది: 2022 ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో టెన్త్​ క్వచ్చన్​ పేపర్​ లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం బయటకు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లీకేజ్​ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల ఆరోపణలపై నారాయణ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.

నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్​గా 2014లోనే ఆయన వైదొలిగారంటూ లాయర్లు కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుపై గతంలో జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ కొన్ని నెలలుగా విచారణ చేపట్టారు. ఆ క్రమంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు నారాయణ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో అప్పట్లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ రద్దు విషయంలో విచారణ జరిపిన సుప్రీం.. అప్పట్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.

ఉపాధ్యాయులు అరెస్ట్​: పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో 2022 ఏప్రిల్​ 29వ తేదీన ఏడుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అనంతపురం రేంజి డీఐజీ రవిప్రకాష్‌ తెలిపారు. తమ పాఠశాలలకు మంచి పేరు తేవాలనే స్వార్థంతో కొందరు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడ్డారని, వారికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సహకరించారని డీఐజీ చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.